బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జిలను లెక్కచేయని అభ్యర్థులు! .. కీలక వ్యవహరాల్లో వారి ప్రమేయం జీరో

  • చేరికలు, ప్రచార కార్యక్రమాలకే పరిమితం 
  • నల్గొండలో చిచ్చుపెట్టిన జడ్పీ చైర్మన్​ పదవి
  • పాశం రామిరెడ్డికి కౌంటర్‌‌‌‌‌‌‌‌గా తండు సైదులుకు ఆఫర్​ 
  •  తీవ్ర మనస్తాపానికి గురైన బండా నరేందర్ రెడ్డి ? 
  • సాగర్​లో చేరికలను కట్టడి చేయడంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి విఫలం

నల్గొండ, వెలుగు :  ఎన్నిక ల్లో అసమ్మతి నేతలను బుజ్జగించి, దారిలోకి తెచ్చుకునేందుకు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ హైకమాండ్​ ప్రతి నియోజకవర్గానికి ఇన్​చార్జిని పెట్టింది. కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు వారిని ఏమాత్రం లెక్కచేయట్లేదు. పార్టీ చేరికలు, ప్రచారాలకు మినహా కీలక కార్యక్రమాలకు పిలవట్లేదని తెలిసింది.  ముఖ్యంగా పదవుల ఒప్పందం,  ఆర్థిక వ్యవహారాల్లో వారి ప్రమేయం ఉండనివ్వట్లేదు.  గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా కొందరు ఇన్​చార్జిలు పార్టీకి కోవర్టులుగా పనిచేశారనే ఆరోపణలు ఉండటంతో అలాంటి వాళ్లతో ఎమ్మెల్యేలు అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో ఇన్‌‌‌‌చార్జులు అలకబూనినట్లు ప్రచారం జరుగుతోంది. 

తండు సైదులకు జడ్పీ చైర్మన్​ ఆఫర్​..?

మళ్లీ అధికారంలోకి వస్తే తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్​కు జడ్పీ చైర్మన్​ పదవి ఇస్తామని పార్టీ ముఖ్య నేతలు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ ఒప్పందం కుదిరాకే ఆయన పార్టీ మారేందుకు సిద్ధపడినట్టు సమాచారం. అయితే దీనిపై ప్రస్తుత చైర్మన్, నల్గొండ నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జిగా ఉన్న​బండా నరేందర్​ రెడ్డికి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆయన  తీవ్ర మనస్తాపానికి గురైనట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.  కాగా,  తిప్పర్తి జడ్పీటీసీ పాశం రామిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవడంతో ఆయనకు కాంగ్రెస్​ లీడర్లు జడ్పీ చైర్మన్​ ఆఫర్​ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది.

దీనికి కౌంటర్​గా అదే మండలానికి చెందిన సైదులు గౌడ్​కు చైర్మన్​ చేస్తామని ఎమ్మెల్యే వర్గం హామీ ఇచ్చినట్టు టాక్‌‌‌‌ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. తిప్పర్తి ఎంపీపీ, జడ్పీటీసీ పార్టీ మారాక కోదాడ ఇన్​చార్జిగా ఉన్న ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్​రావు నల్గొండకు వచ్చి అసమ్మతి నేతలతో భేటీ కావడం మరింత చర్చకు దారితీసింది. వెలమ సామాజిక వర్గానికి చెందిన తిప్పర్తి ఎంపీపీని తిరిగి పార్టీలోకి రప్పించేందుకు అదే వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రవీందర్​రావు ప్రయత్నించారని, దీని గురించి కూడా నరేందర్​ రెడ్డి కనీస సమాచారం ఇవ్వలేదని తెలిసింది. 

సాగర్​లో ఎమ్మెల్సీ కోటిరెడ్డిపైనే విమర్శలు...

నాగార్జునసాగర్​ ఎన్నికల ఇన్​చార్జిగా వ్యవహారిస్తున్న ఎమ్మెల్సీ కోటిరెడ్డికి ఎమ్మెల్యే వర్గానికి అస్సలు పడట్లేదు. ఇప్పటికే 30 మందికి పైగా సర్పంచ్​లు పార్టీ మారారు. కాంగ్రెస్‌‌‌‌లోకి వలసలను అడ్డుకోవడంలో ఎమ్మెల్సీ ఫెయిలయ్యారని ఎమ్మెల్యే భగత్​ వర్గం ఆరోపిస్తోంది.  రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉండొచ్చని సంకేతాలు ఉన్నా ఎమ్మెల్సీ పట్టించుకోవడం లేదని వాళ్లు మండిపడుతున్నారు. దీంతో అక్కడి పరిస్థితులు చక్కబెట్టేందుకు మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి రంగంలోకి దిగినట్టు తెలిసింది. సాగర్​రాజకీయాలతో సన్నిహిత సంబంధాలు కలిగిన సుఖేందర్​ రెడ్డి ఇటీవల పలువురు ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపారు.  

ALSO READ : యూత్​కు ప్యాకేజీలు.. సంఖ్యను బట్టి లక్ష దాకా క్యాష్ ఆఫర్లు

దేవరకొండలో అమిత్​ఆపరేషన్

దేవరకొండలో గుత్తా వర్గం కాంగ్రెస్​లో చేరడంతో అక్కడి పరిస్థితులు చక్క బెట్టేందుకు పార్టీ హైకమాండ్​ఆయన కొడుకు అమిత్​ రెడ్డికే బాధ్యతలు అప్పగించింది. నియోజకవర్గ కోఆర్డినేటర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న అమిత్​కాంగ్రెస్​ నేతలను టార్గెట్​చేస్తున్నప్పటికీ వాళ్లు ససేమిరా అంటున్నారు. తాము ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని కోరినా వినలేదని, అందుకే పార్టీ మారామని చెబుతున్నారు. ఎమ్మెల్యే రవీద్ర నాయక్‌‌‌‌ సైతం అమిత్‌‌‌‌తో సరిగ్గా కోఆర్టినేట్‌‌‌‌ చేయడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయన ఎంత కష్టపడ్డా అనుకున్న ఫలితాలు రావడం లేదు.  త్వరలో కాంగ్రెస్​లో భారీ చేరికలు ఉంటాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో వాటిని అడ్డుకోవడంలో అమిత్​ ఏమేరకు స క్సెస్​ అవుతాడనేది వేచిచూడాల్సిందే.