ఇందూరులో బీఆర్ఎస్​ ఎదురీత

  •     అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన సీన్‌ 
  •     జిల్లా ప్రెసిడెంట్​ సహా సెగ్మెంట్​కు దూరంగా ఓడిన లీడర్లు
  •     కారు దిగేసి షాక్​ ఇచ్చిన ముఖ్య నేతలు
  •     పార్లమెంటు ఎలక్షన్ లో పెద్ద దిక్కు లేక సతమతం 

నిజామాబాద్​, వెలుగు: పదేండ్లు తిరుగులేని ఆధిపత్యంతో జిల్లాలో వెలుగు వెలిగిన బీఆర్​ఎస్​ ప్రస్తుత పార్లమెంట్​ ఎలక్షన్​లో ప్రతికూల రాజకీయ పరిస్థితులకు ఎదురీదుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్టేట్​లో అధికారం కోల్పోవడం ఓడిన నేతలు సెగ్మెంట్​లకు అంటీముట్టనట్లు ఉండడం, ముఖ్య లీడర్లు పార్టీని వీడగా కార్యకర్తలు చెల్లాచెదురైన టైంలో లోక్​సభ ఎలక్షన్​ రావడం కఠిన పరీక్షగా మారింది.  

పార్టీ చీఫ్​ కేసీఆర్​ కూతురు ఎమ్మెల్సీ కవిత అరెస్టు కానట్లయితే ఎన్నికల కోఆర్డినేషన్​ బాధ్యతలు అప్పగించేవారేమో.  ఇప్పుడా పరిస్థితి లేనందున ఏకవాక్యంతో క్యాడర్​ను ఒక్కతాటిపై నడిపే లీడర్​ షార్టేజ్​ ఉంది.  రాజ్యసభ సభ్యుడు కేఆర్​సురేష్​రెడ్డి, మాజీమంత్రి ప్రశాంత్​రెడ్డి పెద్దదిక్కుగా ఆ కొరతను తీర్చే ప్రయత్నం చేస్తూ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు.  ఈ పరిణామాల బర్డన్​ అంతా అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్​పై పడుతోంది. 

టికెట్​ కోసం క్యూ కట్టిన స్టేజ్​ నుంచి  బలవంతంగా ఒప్పించే స్థాయికి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆయా పార్టీలతో పొత్తులు ఫిక్స్​ చేసుకొని అసెంబ్లీ స్థానాలకు బీఆర్​ఎస్​ పోటీ చేసినప్పుడు టికెట్లు ఆశించే లీడర్ల సంఖ్య బాగానే ఉండేది.  ఇక 2014  నుంచి 2023 దాకా అయితే  మొత్తమంతా వన్​ సైడే.  జిల్లా పార్లమెంట్​ సెగ్మెంట్‌లో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలుండగా 2014  ఎన్నికల్లో ఒక్క జగిత్యాలలో మాత్రమే కాంగ్రెస్​ గెలిచింది.  మిగితా ఆరుగురు బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలే.  2018 ఎలక్షన్​లో టోటల్​ ఏడుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్​ వారే.  ఎంపీగా కవిత గెలిచాక అధినేత కేసీఆర్​ కూతురు కావడంతో ఎదురులేని ఆధిపత్యం నడిపారు.

2023 జనరల్​ ఎలక్షన్​లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బాల్కొండ, కోరుట్ల, జగిత్యాలలో ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచినా స్టేట్​లో పవర్​ కోల్పోవడంతో సీన్​ రివర్స్​ అయింది.  పార్లమెంట్​ స్థానంలో కవిత పోటీ చేస్తారని అంతకముందు అంతా భావించగా ఆమె 'నో' చెప్పారు.  అర్బన్​ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్​ఆయన తమ్ముడు బిగాల మహేశ్​ ఇలా అందరూ జారుకున్నారు.  చివరకు అన్ని రకాల సహకారాలు ఇస్తామనే హైకమాండ్​ భరోసాతో  బాజిరెడ్డి గోవర్ధన్​ను ఎంపిక చేయగా ఆయన సరేనన్నారు.  

ప్రజలకు దూరంగా మాజీ ఎమ్మెల్యేలు 

బీఆర్​ఎస్​ జిల్లా ప్రెసిడెంట్​ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశన్నగారి జీవన్​రెడ్డి ఆర్మూర్​ అసెంబ్లీలో ఓటమి చెందాక జిల్లా పాలిటిక్స్​లో యాక్టివ్​గా లేరు.  అర్బన్​కు చెందిన బిగాల గణేశ్ గుప్తా అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు.  పోలీస్​ కేసులతో బేజారవుతూ బోధన్​ మాజీ ఎమ్మెల్యే షకీల్​దుబాయ్​లోనే ఉంటున్నారు. మున్సిపల్​ కార్పొరేషన్​ మేయర్​ నీతూకిరణ్​ పార్టీ ప్రోగ్రామ్స్​లో అంటీముట్టనట్లే ఉంటున్నారు.  మార్క్​ఫెడ్​ ఛైర్మన్​ మారమోహన్​రెడ్డి, డీసీసీబీ చైర్మన్​ రమేశ్​రెడ్డి బీఆర్ఎస్​ను  వీడారు.  బోధన్​, ఆర్మూర్​ మున్సిపాలిటీలలో గులాబీ జెండా దిగిపోయింది.  మాజీ ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్, జడ్పీ వైస్​ చైర్మన్​ రజితయాదవ్​​ తదితర ముఖ్య లీడర్లు కారు దిగేశారు.  లోకల్​ బాడీస్​ ప్రతినిధులు మెజారిటీ శాతం పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.  లీడర్​షిప్​  లేక కార్యకర్తలు దాదాపు చెల్లాచెదరయ్యారు. 

భుజాన వేసుకునే వారేరి..?

పార్లమెంట్​ ఎన్నికలను కష్టకాలంలో బీఆర్ఎస్ ఎదుర్కొంటుండగా ​ సమన్వయం చేసే లీడర్​ లేకుండా పోయారు.  ఎమ్మెల్సీ కవిత అరెస్టు కానట్లయితే ఆమెకు బాధ్యత ఇచ్చేవారే.  బీఆర్ఎస్​ గవర్నమెంట్​ఉన్నప్పుడు పవర్​ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్​చుట్టే తిరిగేదనే అపవాదు మధ్య మంత్రుల రోల్​ లిమిటెడ్​గా ఉండేది.  జిల్లా మంత్రిగా ప్రశాంత్​రెడ్డి పనిచేసినప్పటికీ ఆఫీసర్స్​తో రివ్యూ మీటింగ్‌ల వరకే ఆయన హోదా పరిమితమయ్యేది.  

పక్క సెగ్మెంట్స్​లోకి తొంగిచూడడం పార్టీ కార్యకర్తలతో పరిచయాలను అనుమతించేవారు కాదు.  కారణాలైవైనా సెగ్మెంట్​ దాటకుండా ఎమ్మెల్యేలకు లైన్​ గీసిపెట్టారు. ప్రస్తుతం పెద్దదిక్కుగా మారిన రాజ్యసభ సభ్యుడు సురేశ్​రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్​రెడ్డికి  హైకమాండ్​ గతంలో అమలు చేసిన నియంత్రణలు ఇప్పుడు సమస్యగా మారాయి.  పార్టీ మీద పట్టులేక ముందుకు వెళ్లడం ఇబ్బందవుతోంది.  వీటికి ఎదురీదడం అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్​కు తప్పనిసరిగా మారింది.