యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీకి చెందిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు శుక్రవారం రాత్రి క్యాంప్‌కు వెళ్లారు. బీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, చింతల కిష్టయ్యపై సొంత పార్టీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్ 9, బీజేపీకి చెందిన ఆరుగురు అవిశ్వాసంపై సంతకం చేశారు.
23న అవిశ్వాసం మీటింగ్ నిర్వహణ కోసం కలెక్టర్ హనుమంతు జెండగే కౌన్సిలర్లకు నోటీసులు కూడా అందించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అసంతృప్త కౌన్సిర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే రిజైన్ చేస్తామన్న చైర్మన్, వైస్ చైర్మన్ చేయకపోవడంతో కౌన్సిలర్లు శుక్రవారం మీటింగ్చేసుకొని క్యాంప్‌నకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు కౌన్సిలర్ ఎండీ అజీమ్ ఆధ్వర్యంలో 15 మంది వికారాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌కు వెళ్లారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా క్యాంప్‌నకు వెళ్తారని తెలుస్తోంది. అవిశ్వాస మీటింగ్ సమయానికి వారందరూ భువనగిరికి వస్తారని సమాచారం.