బీజేపీ మళ్లీ గెలిస్తే ..పెట్రోల్, డీజిల్ 400 అయితయ్ : కేసీఆర్

  • మోదీ పాలనలో దేశ ప్రతిష్ట దిగజారింది
  • అచ్ఛే దిన్​ రాలేదు... సచ్చే దిన్​ వచ్చాయి
  • దోపిడీదారులు, పెట్టుబడిదారుల పార్టీ బీజేపీ 
  • కామారెడ్డి, మెదక్ రోడ్​షోలో కేసీఆర్
  • కృష్ణా, గోదావరి నీళ్లను తమిళనాడుకు తరలించేందుకు యత్నిస్తున్నారని ఆరోపణ

కామారెడ్డి​, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశ ప్రతిష్ట దిగజారిందని బీఆర్ఎస్ చీఫ్​ కేసీఆర్  అన్నారు. బీజేపీకి ఈసారి 400 సీట్లు వస్తాయని అంటున్నారని, ఆ పార్టీకి 200 సీట్లు కూడా రావని ఆయన పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డి, మెదక్​లో జరిగిన రోడ్​షోలో ఆయన మాట్లాడారు. ‘‘బీజేపీ మళ్లీ గెలిస్తే.. పెట్రోల్, డీజిల్ రేటు లీటరుకు రూ.400 అయితది. అచ్ఛే దిన్ తెస్తానని మోదీ మాట ఇచ్చి దేశ ప్రజలు సచ్చే దిన్  తెచ్చాడు. 

ఆయన పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారింది. రూపాయి విలువ తగ్గింది. ఎగుమతులు బందయ్యాయి. దిగుమతులు పెరిగాయి. 150 హామీలు ఇచ్చిన మోదీ.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు” అని కేసీఆర్  వ్యాఖ్యానించారు. కామారెడ్డి వాళ్లు బీజేపీ ఎమ్మెల్యేను గెలిపిస్తే జన్​ధన్​ ఖాతాలో రూ. 30 లక్షలు వచ్చినయట కదా అని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘కృష్ణా, గోదావరి నదులను తమిళనాడుకు తరలించాలని మోదీ చూస్తున్నారు. 

బీజేపీకి ఓటు వేస్తే మన నదుల నీళ్లు పోతాయి. బీజేపీది దోపిడీదారులు, పెట్టుబడిదారుల పార్టీ. అది పేదల పార్టీ కాదు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చుపెట్టడం తప్ప పేదల కోసం పనిచేయడం బీజేపీ నేతలకు తెల్వదు” అని కేసీఆర్  విమర్శించారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, బీఆర్ఎస్​ అందులో కీలకంగా ఉంటుందన్నారు. 

కాంగ్రెస్​ గ్యారంటీలు అమలు చేయలే

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదని కేసీఆర్ అన్నారు. ‘‘ఈనెల 9 నాటికి రైతుబంధు డబ్బులు వేస్తానని సీఎం రేవంత్ చెప్పిండు. ఆయనే కుట్రచేసి ఎలక్షన్​ కమిషన్​కు తెలియజేసి ఆయనే బ్యాన్​ చేసిండు. రైతుబంధు కథ ఒడిసింది’’ అని కేసీఆర్​  అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపి అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిందన్నారు.  ‘‘నేను సీఎంగా ఉన్నప్పుడు 9 ఏండ్లలో రెప్పపాటు కూడా కరెంటు పోయేది కాదు.  ఇప్పుడేం మాయరోగం వచ్చి కరెంటు పోతోంది? కరెంటు రాదు. మంచినీళ్లు రావు. పంటకు బోనస్​ బోగస్​ అయ్యింది. 

రూ.2 లక్షల రుణమాఫీపై సీఎం ఏ ఊరికి పోతే ఆ ఊరి  దేవుండ్ల మీద ఓట్లు పెడుతున్నాడు. పనిచేసే సిపాయి అలా ఒట్లు  పెడతడా?” అని కేసీఆర్​ అన్నారు. కరెంటు కోతల వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కి పోతున్నాయని ఆరోపించారు. నదుల నీళ్లు కాపాడుకోవాలన్నా, కాంగ్రెస్​ పార్టీ మెడలు వంచి గ్యారంటీలు అమలు చేయించాలన్నా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్  అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. తమకు 12, 13 సీట్లు ఇస్తే కాంగ్రెస్​ ప్రభుత్వ మెడలు వంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థులు గాలి అనిల్​కుమార్, వెంకట్రామి​రెడ్డి, మాజీ మంత్రి హరీశ్​రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.