మేడిగడ్డ పేరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్​ డ్రామా

కొత్త రేషన్​కార్డులు ఇవ్వకుండా స్కీమ్​లకు లింక్​ ఎందుకు?
కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

కామారెడ్డి టౌన్, వెలుగు: మేడిగడ్డ పేరిట బీఆర్ఎస్, కాంగ్రెస్​ డ్రామా ఆడుతున్నాయని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి  కామారెడ్డిలో సభ నిర్వహించారు. అంతకు ముందు కామారెడ్డి మండలం గర్గుల్ నుంచి  జిల్లా కేంద్రం వరకు భారీ బైక్ ​ర్యాలీ నిర్వహించారు. అనంతరం జేపీఎన్​ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో  వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ..  షరతులు లేకుండా 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్​ చేశారు. గత ప్రభుత్వం పదేండ్లలో ఏ ఒక్కరికీ రేషన్ ​కార్డు ఇవ్వలేదన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం కొత్త రేషన్ ​కార్డులు ఇవ్వకుండానే రేషన్​కార్డు తప్పనిసరి అని లంకె పెడుతోందన్నారు. ముందు రేషన్​ కార్డులు ఇచ్చిన తర్వాత పథకాలు అమలు చేయాలన్నారు. దేశంలో ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. 400 సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డిలో బీజేపీని గెలిపించినట్లుగానే  వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో  జహీరాబాద్ ​ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించాలన్నారు. కామారెడ్డి ప్రజలకు తానిచ్చిన హామీలను నెరవేరుస్తానన్నారు. పార్టీ జిల్లా ప్రెసిడెంట్​అరుణతార మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశ పెట్టిన స్కీమ్​లు అన్ని వర్గాలకు మేలు చేస్తున్నాయన్నారు.

ఎంపీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. పార్టీ ఓబీసీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్​ ఆలే భాస్కర్, లీడర్లు బద్ధం మహిపాల్​రెడ్డి, పైడి ఎల్లారెడ్డి, వడ్డేపల్లి సుభాష్​రెడ్డి,  జైపాల్​రెడ్డిలతో పాటు స్థానిక లీడర్లు పాల్గొన్నారు. అంతకు ముందు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనూ విజయ సంకల్ప యాత్ర సాగింది. ఎల్లారెడ్లి, లింగంపేట, గాంధారి, సదాశివ్​నగర్, రామారెడ్డి మండల కేంద్రాల మీదుగా కామారెడ్డికి చేరుకుంది.