న్యూఢిల్లీ: బార్డర్ వెంబడి గతంలో ఉన్న స్థితిని కొనసాగించేందుకు చైనాతో ఏకాభిప్రాయం కుదిరిందని డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వెంట పెట్రోలింగ్, పశువుల మేత విషయంలో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఇదొక కీలక పరిణామమని, చర్చలతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
గురువారం ఢిల్లీలో ‘చాణక్య డిఫెన్స్ డైలాగ్– 2024’ ప్రోగ్రాంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. ‘‘బార్డర్ లో ఇండియా, చైనా మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి మిలిటరీ, డిప్లమాటిక్ లెవల్ లో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బార్డర్ లో గతంలో ఉన్న స్థితిని కొనసాగించేందుకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇదీ చర్చలకు ఉండే పవర్. చర్చలతోనే సమస్యలకు పరిష్కారం సాధ్యం అవుతుంది” అని రాజ్ నాథ్ అన్నారు.