రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొస్తం: శ్రీధర్ బాబు

  • టార్గెట్  16 వేల కోట్లు 
  • రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొస్తం: శ్రీధర్ బాబు 
  • ఐటీ, హెల్త్​కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలపై ఫోకస్ పెట్టామని వెల్లడి 
  • అమెరికా, సౌత్​కొరియా టూర్లపై అధికారులతో మంత్రి రివ్యూ

హైదరాబాద్, వెలుగు: సీఎం అమెరికా, సౌత్​ కొరి యా టూర్​లో భాగంగా రాష్ట్రానికి రూ.16 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఐటీ, హెల్త్​కేర్, లైఫ్​సైన్సెస్, ఫుడ్​ప్రాసెసింగ్ తదితర రంగాల్లో భారీ ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఆ పెట్టుబడులు రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి తోడ్పడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఆదివారం నుంచి ఈ నెల 11 వరకు సీఎం రేవంత్​రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్​బాబు అమెరికా, సౌత్​కొరియాలో పర్యటించనున్నారు. శనివారం ఉదయమే సీఎం రేవంత్​ రెడ్డితో కలిసి అధికారుల టీమ్ అమెరికా బయలుదేరి వెళ్లగా.. ఆదివారం ఉదయం మంత్రి శ్రీధర్​బాబుతో కలిసి మరో టీమ్ బయల్దేరనుంది. టూర్​ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలు, నిర్వహించబోయే సమావేశాలు, కార్యక్రమాల ప్లాన్​పై అధికారులతో శనివారం సెక్రటేరియెట్​లో మంత్రి శ్రీధర్​బాబు రివ్యూ నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలు, పెట్టుబడుల ప్రవాహంతో రాష్ట్రం పటిష్ట ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. ‘‘వ్యాపార, పారిశ్రామిక పెట్టుడులకు అనుకూల వాతావరణాన్ని పెంపొందించడంలో సీఎం రేవంత్​ రెడ్డి చేపడుతున్న వ్యూహాత్మక కార్యక్రమాలు.. పెట్టుబడులకు రాష్ట్రాన్ని ప్రధాన గమ్య స్థానంగా నిలబెడుతున్నాయి. అమెరికా, సౌత్​కొరియా పర్యటనలో ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాలను పటిష్టపర్చడమే కాకుండా కొత్తగా పలు సంస్థలు రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చేలా కృషి చేస్తాం. నూతన పెట్టుబడుల వల్ల రాష్ట్రంలో వేలాది కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి” అని చెప్పారు.

సాఫ్ట్​వేర్ ఎగుమతుల్లో బెంగళూరును దాటేస్తం..  

సాఫ్ట్​వేర్ ఎగుమతుల్లో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామ ని మంత్రి శ్రీధర్​బాబు చెప్పారు. గత మార్చి 31 వరకు ఐటీ ఎగుమతులు రూ.2.7 లక్షల కోట్లు ఉండగా, జూన్ చివరి నాటికి అవి రూ.2.9 లక్షల కోట్లకు పెరిగాయ ని వెల్లడించారు. 11.28 శాతం వృద్ధి నమోదైందన్నారు. ప్రస్తుతం రూ.7 లక్షల కోట్ల సాఫ్ట్​వేర్ ​ఉత్ప త్తుల ఎగుమతితో బెంగళూరు మొదటి స్థానం లో ఉండగా, హైదరాబాద్​ రెండో స్థానంలో ఉందని వివరించారు. 

వచ్చే మూడేండ్లలో బెంగళూరును అధిగమించి ముందుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేశామ న్నారు. ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్​(ఏఐ) సిటీ ఆవిర్భావంతో ప్రపంచంలోనే ఏఐ హబ్​గా హైదరాబాద్ అవతరిస్తుందని పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్​లో హైదరాబాద్​లో ఏఐ గ్లోబల్​సమిట్ ​నిర్వహించనుండగా.. దానికి సంబంధించిన వెబ్​సైట్​ను శ్రీధర్​బాబు ప్రారంభించారు. త్వరలో ప్రారంభిం చనున్న స్కిల్ యూనివర్సిటీలో భాగంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) కన్సార్టియం హైదరాబాద్​లో మొదటి ఏడాది 2 వేల మందికి శిక్షణనిస్తుందని తెలిపారు.