బ్రిడ్జిలకు రిపేర్లు కరువు

  • పగిలిపోతున్న బ్రిడ్జి స్లాబులు
  •  బ్రిడ్జిల మీద పేరుకుపోతున్న ఇసుక, చెత్త
  •  20 ఏండ్లుగా రిపేర్లకు నోచుకోలేదు

పెద్దపల్లి, వెలుగు: జిల్లాలో వాగులు, కాలువల మీద కట్టిన బ్రిడ్జీలు ప్రమాదకరంగా మారుతున్నాయి. దాదాపు 20 ఏండ్ల నుంచి ఎలాంటి మరమతులు, మెయింటనెన్స్​ లేకపోవడంతో నాణ్యత కోల్పోతున్నాయి. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మానేరు, హుస్సేన్​మియా వాగు పైనా దాదాపు 25 వరకు  చిన్న, పెద్ద బ్రిడ్జీలు నిర్మించారు. వాటికి మూడు, నాలుగేళ్లకోసారి రిపేర్లు చేయాల్సి ఉంది. కానీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. జిల్లాలో ఉన్న లెవల్​ బ్రిడ్జీలు, ఓవర్​బ్రిడ్జీలు కట్టి మూడు దశాబ్దాలు పూర్తయ్యాయి.

 మానేరు, హుస్సేన్​ మియా వాగు ప్రవహించే సుల్తానాబాద్​, పెద్దపల్లి, ముత్తారం, జూలపల్లి, మంథని మండలాల్లో శిథిలావస్థకు చేరిన బ్రిడ్జిలు ఎక్కువ ఉన్నాయి. మంథని మండలంలోని అడవి సోమన్​పల్లి బ్రిడ్జి కి రిపేర్​ చేయాల్సి ఉండగా నామమాత్రంగానే ప్యాచ్​ వర్క్​ చేసి వదిలేశారు. పెద్దపల్లి మండలంలోని మూలసాల వద్ద బ్రిడ్జీని కూడా మరమ్మతులు చేయాల్సి ఉందని గ్రామస్తులు చెప్తున్నారు. కాల్వ శ్రీరాంపూర్​ మండలంలోని గంగారం వద్ద ఉన్న బ్రిడ్జి పైన స్లాబుల జాయింట్స్​ వద్ద గ్యాప్​ పెరిగిపోతున్నా పట్టించుకోవడం లేదు.

Also Read :- రిజర్వాయర్లు ఫుల్​ పంటలకు భరోసా

స్లాబులు పగిలిపోతున్నా రిపేర్లు మాత్రం చేయడం లేదు. మొట్లపల్లి వద్ద ఉన్న లెవల్​ బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. పెద్దపల్లి మండలం భోజన్నపేట గ్రామానికి చెందిన కల్వర్టు పూర్తిగా ద్వంసమైంది. అక్కడ మరో బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. కానీ ఆ బ్రిడ్జినే ఇంకా వాడుకలో ఉంచారు. 

బ్రిడ్జీలు కట్టడం వరకే కాంట్రాక్టర్ల పని, అయితే వాటిని మెయింటెన్​ చేయాల్సిన సంబంధిత శాఖలు వాటిని గాలికి వదిలేస్తున్నారు. కాంట్రాక్టు నిబంధనలకు ప్రకారం కట్టడం పూర్తయిన తర్వాత కూడా నిర్ణీత కాలం వరకు కాంట్రాక్టర్లే బ్రిడ్జిల మెయింటనెన్స్​ చేయాలి, కానీ అలాంటి పరిస్థితి జిల్లాలో ఎక్కడ కనిపించడంలేదు.