భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా...ఇండియాకు చోటివ్వాలి : విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్

  • ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు తక్షణ అవసరం: జైశంకర్ 
  • ఫుడ్, హెల్త్ రంగాల్లో జాగ్రత్త పడాలి
  • మోడ్రన్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
  • బ్రిక్స్ సదస్సు ముగింపు సమావేశంలో విదేశాంగ శాఖ మంత్రి స్పీచ్ 

మాస్కో: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కోరారు. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్​తో పాటు మరికొన్ని అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేయాలన్నారు. రష్యాలోని కజాన్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ఆయన మాట్లాడారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్లు సమస్యలను దౌత్యం, చర్చలతోనే పరిష్కరించుకోవాలి.

ఇది యుద్ధాలు చేసే యుగం కాదు. ఫుడ్, హెల్త్, ఫ్యూయెల్ సెక్యూరిటీ విషయంలో ఎంతో జాగ్రత్తపడాలి. ప్రపంచ క్రమం మారుతూ పోతున్నది. అదేవిధంగా గతంలోని ఎన్నో అసమానతలు కూడా కొనసాగుతున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా అన్ని దేశాలు ముందుకు వెళ్తున్నాయి. అభివృద్ధి వనరులు, మోడ్రన్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. కరోనా మహమ్మారితో పాటు పలు సంక్షోభాలు గ్లోబల్ సౌత్​ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రపంచం చాలా వెనుకబడిపోయే ప్రమాదం ఉన్నది’’అని జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు.

సమానమైన ప్రపంచ క్రమాన్ని ఎలా సృష్టించాలనేదానిపై బ్రిక్స్ ఫోకస్ పెట్టాలన్నారు. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్​లోని పర్మినెంట్, నాన్ పర్మినెంట్ కేటగిరీలను సంస్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కౌన్సిల్​లో శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఇండియా చాలా ఏండ్ల నుంచి కోరుతున్నదని గుర్తు చేశారు. యూఎస్, యూకే, ఫ్రాన్స్ కూడా మద్దతు తెలిపాయన్నారు. ఇప్పుడు చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యూఎస్​కు యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ శాశ్వత సభ్యత్వం ఉందని తెలిపారు. ఇండియా రిక్వెస్ట్​ను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

కొత్త దేశాలు ఒకే ఆకాంక్షలు కలిగి ఉన్నయ్: పుతిన్

బ్రిక్స్​లో కొత్తగా చేరిన దేశాలు.. ఒకే విధమైన ఆకాంక్షలు, విలువలను కలిగి ఉన్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఫలితంగా బ్రిక్స్ మరింత బలోపేతం అయ్యిందని తెలిపారు. గురువారం బ్రిక్స్ సమిట్ ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘టర్కీ, అజర్​బైజన్, మలేషియా బ్రిక్స్​లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. మరిన్ని దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. బ్రిక్స్ సమిట్ సక్సెస్ అయింది. సహకరించిన అన్ని దేశాలకు కృతజ్ఞతలు’’అని పుతిన్ తెలిపారు.

ఇండియాతో కలిసి పని చేసేందుకు మేం సిద్ధం: చైనా

కజాన్ వేదికగా ఇండియా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ ద్వైపాక్షిక చర్చలు జరపడం శుభ పరిణామం అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య ఉమ్మడి అవగాహన కుదరడం సంతోషకరమని తెలిపారు. చైనా, ఇండియా సంబంధాలు మరింత మెరుగుపడ్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను స్థిరమైన అభివృద్ధి మార్గంలో తిరిగి నడిపించే మార్గాన్ని ఇరువురు నేతలు నిర్దేశించారని చెప్పారు. ఇండియాతో కలిసి పని చేసేందుకు చైనా సిద్ధంగా ఉందన్నారు.