యూట్యూబర్ : వైల్డ్​ కుకింగ్​..వరల్డ్​ ఫేమస్​

చిన్నప్పటినుంచి చెఫ్​ కావాలని కలలు కన్నాడు. చివరికి అనుకున్నది సాధించాడు. ఒక పెద్ద సంస్థలో చెఫ్​గా ఉద్యోగంలో చేరాడు. అంతలోనే కరోనా ప్యాండెమిక్​ వల్ల అతన్ని ఇంటికే పరిమితం చేసింది. ఉద్యోగం లేకపోయినా.. నచ్చిన పని మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే సోషల్​ మీడియా కంటెంట్​ క్రియేటర్​గా మారాడు. హోటల్​లో చేసే వంటలే ఇంట్లో చేస్తూ.. వీడియోలు తీసి అప్​లోడ్​ చేశాడు. కట్​ చేస్తే.. శ్రీలంకలోనే ఫేమస్​ కంటెంట్​ క్రియేటర్​గా మారిపోయాడు చరిత్​ ఎన్​ సిల్వా. 

శ్రీలంకలో ఫేమస్​ యూట్యూబ్​ ఛానెల్ ‘వైల్డ్ కుక్‌‌‌‌బుక్’. ఆ దేశంలోనే కాదు ఈ ఛానెల్​కు ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్స్​ ఉన్నారు. దీన్ని చరిత్ ఎన్. సిల్వా నడుపుతున్నాడు. అతన్ని అందరూ ముద్దుగా ‘దేవ్’​ అని పిలుస్తుంటారు. సిల్వా1996లో శ్రీలంకలో పుట్టాడు. అక్కడే చదువుకుని చెఫ్​గా సెటిల్​ అయ్యాడు. నచ్చిన ఉద్యోగం, సరిపడా జీతంతో హాయిగా సాగుతున్న అతని జీవితంలోకి కరోనా ఒక ఉప్పెనలా వచ్చింది. అయితే ఆ ఉప్పెన వల్లనే అతను సోషల్​ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే అతని జీవితంలో టర్నింగ్​ పాయింట్ అయ్యింది. దానివల్లే సక్సెస్​తోపాటు గుర్తింపు కూడా సంపాదించుకున్నాడు. అతని లైఫ్ గురించి అతని మాటల్లోనే.. ​ చిన్నప్పటి నుంచి చెఫ్‌‌‌‌ కావాలని కలలు కన్నాను. ఎందుకంటే.. మాది చెఫ్​ కుటుంబం. వరల్డ్​ ఫేమస్​ చెఫ్స్​ నిర్వహించే కుకరీ ప్రోగ్రామ్స్​ చూస్తూ పెరిగా. ఆ ప్రోగ్రా​మ్స్​ నేను కంటెంట్​ క్రియేటర్​గా ఎదగడానికి దోహదం చేశాయి కూడా. 

సోషల్​ మీడియాలోకి..

2020 వరకు హాయిగా ఉద్యోగం చేసుకునేవాడిని. యూట్యూబ్​లో ఛానెల్​ పెట్టాలని ఎప్పటినుంచో ఉన్నా దాన్నంత సీరియస్​గా తీసుకోలేదు. కానీ.. కరోనా వచ్చి నాలాగ ఎంతోమంది జాబ్స్​ రిస్క్​లో పడ్డాయి. చెఫ్స్​ ఎక్కువగా పర్యాటక రంగంలోనే పనిచేస్తారు. లాక్‌‌‌‌డౌన్ వల్ల పర్యాటకరంగం కుదేలైంది. దాంతో నాతోపాటు ఎంతోమంది చెఫ్​లు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అప్పుడే నాకు సోషల్​ మీడియాలో కంటెంట్​ క్రియేట్​ చేయాలనే ఆలోచన వచ్చింది. 2020 నవంబర్​1న యూట్యూబ్​లో ఛానెల్ క్రియేట్​ చేశా. అప్పుడే టిక్​టాక్​లో కూడా కంటెంట్​ పోస్ట్​ చేయడం మొదలుపెట్టా. అయితే.. అప్పటివరకు టిక్​టాక్​లో శ్రీలంక ఫుడ్​ కంటెంట్​ చేసేవాళ్లు అంతగా లేరు. ఎక్కువగా ఎంటర్​టైన్​మెంట్​ కంటెంట్​ మాత్రమే చేసేవాళ్లు. అందుకే టిక్​టాక్​ ఎంట్రీకి అదే సరైన టైం అనుకున్నా. 

మొదలుపెట్టినప్పుడు కంటెంట్ క్రియేటర్​గా సక్సెస్​ అవుతాననే నమ్మకం ఉండేది కాదు. నేను చేస్తున్న కంటెంట్‌‌‌‌ని ప్రజలు ఇష్టపడతారని ఎప్పుడూ అనుకోలేదు. మొదట్లో చాలా సవాళ్లు, అడ్డంకులు ఎదురయ్యాయి. కొన్నిసార్లు నా టైం వేస్ట్​ చేస్తున్నట్లు అనిపించింది. కానీ.. పట్టు వదలకుండా ట్రై చేశా. అప్పుడే నా వీడియోలు ఊహించని విధంగా వైరల్‌‌‌‌ అయ్యాయి. ముఖ్యంగా టిక్​టాక్​లో బాగా పేరొచ్చింది. ఇప్పుడు ప్రపంచం నలుమూలలా నేను చేస్తున్న కంటెంట్ చూస్తున్నారు. కంటెంట్​కి వచ్చే పాజిటివ్​ కామెంట్స్ చాలా సపోర్ట్​ని ఇచ్చాయి. అందుకే ఇప్పుడు యూట్యూబ్​, టిక్​టాక్​తోపాటు ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​లో కూడా కంటెంట్​ పోస్ట్​ చేస్తున్నా. 

అటు ఉద్యోగం.. ఇటు కంటెంట్​

గతంలో ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సోషల్​ మీడియాకి కంటెంట్​ చేసేవాడిని. కంటెంట్​ క్రియేషన్​ ​ కోసం నాతోపాటు ఒక టీం కూడా పనిచేస్తుంది. అయితే.. కంటెంట్ క్వాలిటీ మరింత పెంచాలని ఈ మధ్యే ఉద్యోగాన్ని వదిలేసి.. ఫుల్​టైం కంటెంట్​ క్రియేటర్​గా మారిపోయా. 

మొదట్లో ఇది సరైన నిర్ణయమో? కాదో? అనే సందేహం ఉండేది. కానీ.. ఇప్పుడు కంటెంట్​కు వస్తున్న రీచ్​ చూశాక సరైన నిర్ణయమే అని అర్థమైంది. ఇప్పుడు ప్రతిరోజూ వీడియోలు చేస్తున్నా. కొన్నిసార్లు ఒక వీడియో తీసేందుకు ఒకరోజంతా పడుతుంది. వంట చేయడం  కంటే షూటింగ్‌‌‌‌ ప్రిపరేషన్‌‌‌‌, క్లీనింగ్‌‌‌‌ చాలా కష్టం. కానీ.. ఇష్టమైన పని కాబట్టి ఎప్పుడూ విసుగు అనిపించదు.  

 పేరెందుకు? 

వాస్తవానికి మొదట్లో పచ్చని పంటపొలాలు, అడవుల్లోకి వెళ్లి వంటలు చేయాలి అనుకున్నా. అందుకే ఛానెల్​కు ‘వైల్డ్ కుక్‌‌‌‌బుక్’ అనే పేరు పెట్టా. కానీ.. కరోనా నాకా అవకాశం ఇవ్వలేదు. దాంతో.. ఇంట్లోనే వీడియోలు చేయడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. అయినాకూడా వైల్డ్​ కుకుబుక్​ అనే పేరు బాగా నచ్చడంతో అదే ఉంచేశా. 

కొత్త వంటకాలు

సోషల్​ మీడియాలో నాకు సక్సెస్​ రావడానికి  కారణం నా కంటెంట్​. ఎప్పటికప్పుడు కొత్త రకం వంటకాలు చేయడానికే ఇష్టపడతా. ఫుడ్​ ప్రయోగాలు చేయడం నా హాబీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొత్త రుచులను శ్రీలంకకు పరిచయం చేస్తుంటా. పైగా వాటి రిఫరెన్స్​లతో శ్రీలంకన్​ స్టయిల్​లో వంటకాలు చేస్తా. అందుకే నా వీడియోలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. నేను చేసే వంటల్లో ‘మక్లూబా, మిడిల్ ఈస్టర్న్ రైస్’ నాకు చాలా ఇష్టం. వండడమే కాదు వీటిని తినడం కూడా ఇష్టమే.’’

95 మిలియన్ల వ్యూస్​ 

వైల్డ్​ కుక్​బుక్​ ఛానెల్​ని ఇప్పటివరకు 8.91 మిలియన్ల మంది సబ్​స్క్రయిబ్​ చేసుకున్నారు. ఇప్పటివరకు ఛానెల్​లో 550కి పైగా వీడియోలు అప్​లోడ్​ చేశాడు సిల్వా. ఛానెల్​లో అప్​లోడ్​ చేసే పెద్ద వీడియోల కంటే షార్ట్​ వీడియోలకు ఎక్కువ రీచ్​ వస్తోంది. ఒక వీడియోకు ఏకంగా 95 మిలియన్ల వ్యూస్​ వచ్చాయి. పాతిక మిలియన్ల వ్యూస్​ దాటిన వీడియోలు కూడా చాలానే ఉన్నాయి. నాలుగైదు నెలలుగా అప్​లోడ్​ చేస్తున్న ప్రతి వీడియోకు మిలియన్​ కంటే ఎక్కువ వ్యూస్​ వస్తున్నాయి. ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ల్లో కూడా సిల్వాకు రెండు మిలియన్ల కంటే ఎక్కువ ఫాలోవర్స్​ ఉన్నారు.  

కుకింగ్​ ఛానెల్ కోసం.. ​ 

ఇదివరకు ఒక దేశ వంటకం మరో దేశం వాళ్లు నేర్చుకోవాడానికి, దాని రుచిని అలవాటుపడడానికి చాలా టైం పట్టేది. కానీ.. ఇప్పుడు ప్రపంచంలోని ఒక చివర వండే వంటకం పూర్తి వివరాలు మరో చివరన ఉండేవాళ్లకు కూడా తెలిసిపోతున్నాయి. దానికి కారణం సోషల్​ మీడియా. అందులోనూ యూట్యూబ్​ ఛానెల్స్​ ఇంపాక్ట్​ చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు ఎవరికి ఏ దేశం వంటకం తినాలనిపించినా, పక్క ప్రాంతంలోని ఫేమస్​ ఫుడ్​ తినాలి అనిపించినా యూట్యూబ్​నే అడుగుతున్నారు. దీనివల్ల క్వాలిటీ కంటెంట్​ ఇచ్చే కుకింగ్​ ఛానెల్స్​కి రీచ్​ బాగా పెరుగుతుంది. మరి అలాంటి వీడియోలు కావాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే.. ​ 

తప్పుదారి పట్టించవద్దు

ఎక్కువ వ్యూస్​ కోసం వ్యూయర్స్​ని తప్పుదారి పట్టించొద్దు. థంబ్​నెయిల్​లో చెప్పిన విషయమే వీడియోలో కనిపించాలి. లేదంటే.. వ్యూయర్స్​కి నమ్మకం పోతుంది. ఉదాహరణకు బిర్యానీ రెడీ చేసే ఐదు నిమిషాల వీడియో పెట్టి.. దానికి ‘5 నిమిషాల్లో బిర్యానీ!’ అని థంబ్​నెయిల్​ పెడుతుంటారు. ఇలాంటి హ్యాక్స్​ వల్ల ఛానెల్‌‌‌‌ బాగా డెవలప్ ​అవుతుంది అనుకోవడం భ్రమే. ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా చెప్పాలి. 

మొదటి 30 సెకన్లు కీలకం

అప్​లోడ్​ చేసిన వీడియోలో ఏముంది? అది ఎలాంటి వాళ్లకు అవసరం?.. అనేది మొదటి 30 సెకన్లలోనే వ్యూయర్స్​కి అర్థమయ్యేలా చేయాలి. లేదంటే.. ఆ వీడియో ఎంత బాగున్నా ఆ వ్యక్తికి అవసరం లేకపోతే.. చూసిన తర్వాత టైం వృథా అయ్యిందని ఫీల్​ అవుతాడు. 

ఫుడ్​ గురించే.. 

ఫుడ్ వీడియో పెట్టి అందులో దాని గురించి పెద్దగా మాట్లాడకపోతే.. చూడడానికి ఇష్టపడరు. చెప్పడం ద్వారా, లేదంటే చూపించడం ద్వారా అయినా.. ఫుడ్​ గురించి పూర్తి వివరాలు తెలిసేలా వీడియో ఉండాలి.

అన్నీ ముఖ్యమే

వీడియోలో ఫుడ్​ మాత్రమే కాదు.. ప్రతీది జాగ్రత్తగా చూసుకోవాలి. మాట్లాడే భాష, వేసుకునే బట్టలు, వాడే వస్తువులు అన్నీ ఫర్​ఫెక్ట్​గా ఉండేలా జాగ్రత్త పడాలి. వాయిస్, ప్రెజెంటేషన్​, చేతి కదలికలు కూడా బాగుండాలి. ప్రజెంటేషన్​ కోసం కొంత పెట్టుబడి కూడా పెట్టాల్సి వస్తుంది. అంటే మంచి కెమెరా, ఎడిటింగ్​ సాఫ్ట్​వేర్​ లాంటి వాటికోసం కాస్త ఎక్కువ ఖర్చు చేసినా తప్పులేదు.