పర్యవేక్షణ లోపం వల్లే కెనాల్​కు గండ్లు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట/మునగాల/కోదాడ, వెలుగు : పదేండ్లుగా కాలువలపై పర్యవేక్షణ లేకపోవడంతోనే కెనాల్ కు గండ్లు పడ్డాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇక పక్కగా ప్రాజెక్టులు, కాల్వల పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. కొత్తగా కాలువల పరిరక్షణకు 700 మంది ఇంజనీర్లు, 1,800 మంది లష్కర్ల  నియమాలను చేపడుతున్నట్లు తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద సాగర్  ఎడమ కాలువ గండి పూడ్చివేత పనులను

చిలుకూరు మండలం నారాయణపురంలో కోతకు గురైన చెరువు కట్ట రిపేర్లను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్  తేజస్  నంద్ లాల్  పవార్ తో కలిసి  పరిశీలించారు. ఎడమ కాలువ గండి పూడ్చివేత పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఎన్ఎస్పీ ఎస్ఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్​ను ఆదేశించారు. సాగర్  ఎడమ కాలువకు బుధవారం నీటిని విడుదల చేస్తామన్నారు. ప్రకృతి సృష్టించిన వరదలపై కొంత మంది రాజకీయం చేయడం తగదన్నారు. 

సీఎంతో సహా అందరం యుద్ధ ప్రతిపాదికన సహాయక చర్యలు చేపట్టామని, నీటిపారుదల శాఖను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ నిర్లక్షానికి గురైందని, అకాల వర్షాన్ని ఆసరా చేసుకుని ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. సూర్యాపేట జిల్లాలో వర్షాల కారణంగా  సుమారు 300 ఎకరాల్లో భారీగా పంట నష్టం జరిగిందని చెప్పారు. చెరువులో ఆక్రమణలు తొలగించాలని పలువురు రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా, ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఎన్ఎస్పీ సీఈ రమేశ్ బాబు, ఎస్ఈ శివ ధర్మ తేజ, డీఈ స్వర్ణ పాల్గొన్నారు.

కూసుమంచి : ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం నాయకున్​గూడెం సమీపంలో సాగర్  ప్రధాన కాలువ గండి పూడ్చివేత పనులను మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి పరిశీలించారు. పనుల్లో జాప్యం ఎందుకు జరిగిందని అధికారులను ప్రశ్నించారు. బుధవారం నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లాలోని ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసి పంటలను కాపాడతామని తెలిపారు. సీఈ విద్యాసాగర్​రావు, ఈఈలు మంగళంపూడి వెంకటేశ్వర్లు, అనన్య, డీఈలు మధు, మన్మధరావు పాల్గొన్నారు.