యాదగిరిగుట్ట క్యూలైన్ గ్రిల్ లో ఇరుక్కున్న బాలుడి తల

  • చాకచక్యంగా బయటకు తీసిన అయ్యప్ప దీక్షాధారులు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం ఆలయానికి వచ్చిన ఫ్యామిలీకి చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం ‌‌‌‌‌‌‌‌స్వామి దర్శనం కోసం క్యూలైన్ లో నిరీక్షిస్తుండగా.. బాలుడి తల క్యూలైన్  ఐరన్  గ్రిల్ లో ఇరుక్కుపోయింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్  బోడుప్పల్ కు చెందిన కిష్టయ్య ఫ్యామిలీతో కలిసి స్వామివారి దర్శనం కోసం ఆదివారం ఉదయం నారసింహుడి దర్శనం కోసం వీఐపీ క్యూలైన్ లో వెయిట్  చేస్తున్నారు.

బ్రేక్  సమయం కావడంతో కాసేపు క్యూలైన్లను నిలిపివేశారు. దీంతో ఫ్యామిలీతో కలిసి క్యూలైన్లలో వెయిట్  చేస్తున్న సమయంలో తన ఏడేండ్ల కొడుకు దయాకర్  తల ప్రమాదవశాత్తు క్యూలైన్  గ్రిల్ లో ఇరుక్కుంది. 10 నిమిషాల పాటు బాలుడు అవస్థలు పడ్డాడు. క్యూలైన్ లో ఉన్న తోటి భక్తులు, అక్కడే ఉన్న అయ్యప్ప దీక్షాపరులు గ్రిల్ ను కొంచెం వెడల్పు చేసి బాలుడిని జాగ్రత్తగా బయటకు తీశారు. దీంతో ప్రమాదం తప్పినట్లైంది. అనంతరం ఫ్యామిలీతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నాడు.