కారు డోర్లు లాక్.. ఊపిరాడక బాలుడు మృతి

  • నిజామాబాద్ జిల్లా బోధన్​లో ఘటన

బోధన్, వెలుగు: కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్ అయిపోవడంతో ఊపిరాడక ఆరేండ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో చోటు చేసుకుంది. గోసంబస్తీకి చెందిన రేణుక, ప్రవీణ్ దంపతులకు కొడుకు రాఘవ (6) ఉన్నాడు. 

ఈ నెల 4వ తేదీన రేణుక, ప్రవీణ్ దంపతులు రాకాసిపేట్​లోని హనుమాన్ మందిరం వద్ద కూలీ పనులు చేసేందుకు రాఘవతో కలిసి వచ్చారు. భార్యాభర్తలిద్దరూ పనులు చేస్తుండగా.. అదే కాలనీలో ఉంటున్న నానమ్మ వద్దకు ఆడుకుంటానని చెప్పి రాఘవ వెళ్లాడు. నానమ్మ వచ్చి రాఘవ ఇంటికి రాలేదని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అందరూ కలిసి రాత్రంతా బాబు కోసం కాలనీ మొత్తం వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో రాత్రి రెండు గంటలకు బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్​లో కంప్లైంట్ చేశారు. 

మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. రెండు బృందాలుగా విడిపోయి రాఘవ కోసం గాలించారు. రాకాసిపేట్​లోని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆదివారం రాత్రి బయటికెళ్దామని ఇంటి పక్కనే ఉన్న తన కారు డోర్ ఓపెన్ చేశాడు. అందులో బాలుడి డెడ్​బాడీ ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐ వీరయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. గోసంబస్తీకి చెందిన రేణుక, ప్రవీణ్ కొడుకు రాఘవగా గుర్తించారు. చంద్రశేఖర్ తన కారుకు సెంట్రల్ లాక్ వేయకపోవడంతో డోర్లు ఓపెన్ అయ్యాయని, రాఘవ ఎక్కి ఆడుకుంటుండగా లాక్ అయినట్టు పోలీసులు తెలిపారు. 

రెండు రోజుల పాటు కారులోనే ఉండిపోవడంతో ఊపిరి ఆడక బాలుడు చనిపోయినట్టు వివరించారు. రేణుక, ప్రవీణ్​కు ముగ్గురు పిల్లలు కాగా, వారిలో ఇద్దరు అనారోగ్యంతో చనిపోయారు. మూడో పిల్లాడు కూడా చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.