- కాంగ్రెస్ మోసంతో రైతుల ఆవేదన
- బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటే
- సీఎం రేవంత్ రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నడని ఫైర్
యాదాద్రి/జనగాం, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు నరకం అనుభవిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు అన్ని రకాల వడ్లకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు సన్నాలకు మాత్రమే ఇస్తమంటున్నదని.. ఈ మోసంతో రైతులకు కన్నీటికి బదులు కండ్ల నుంచి రక్తం కారుతోందని మండిపడ్డారు. గురువారం ఆయన యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం రాఘవపురం, రుద్రవెళ్లిలోని కొనుగోలు సెంటర్లను పరిశీలించారు.
అనంతరం జనగామలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లారు. ఈ రెండు చోట్ల ఆయన మీడియాతో మాట్లాడారు. వడ్ల కొనుగోలులో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనే ప్రతి గింజకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంటే.. కొనడానికి వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. రైతుల బాధల కంటే సీఎం రేవంత్‌రెడ్డికి ఎన్నికలే ఎక్కువయ్యాయని విమర్శించారు. సన్నాల పేరుతో దొడ్డు రకం పండించే రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోబోమన్నారు. సన్నాలను ప్రోత్సహించడానికి రూ.1,000.. దొడ్డు రకానికి రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు, కౌలు రైతులు, కూలీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దేవుడిపై ఒట్టు పెడితే న్యాయం జరగదన్నారు.
పెనం మీంచి పొయ్యిల పడ్డట్టయ్యింది
బీఆర్ఎస్ కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటేనని.. ఆ రెండు పార్టీలు నిజాం వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. రుణమాఫీ విషయంలో రైతులను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. డిసెంబర్ 9నే మాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆగస్టుకు వాయిదా వేశారన్నారు. మాఫీ చేయకపోవడం వల్ల రైతులకు బ్యాంకర్లు కొత్తగా రుణాలు ఇవ్వడం లేదన్నారు. దొరల పాలన పోవాలని, కేసీఆర్ పీడ విరగడ కావాలని జనం కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తే ఇప్పుడు పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిల పడ్డట్టైందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తానన్న కాంగ్రెస్ ద్రోహం చేస్తోందన్నారు. హామీలను అమలు చేయడం చేతకాకుంటే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పదేండ్ల పాలన బాటలోనే కాంగ్రెస్ ఆర్నెళ్ల పాలన సాగిందన్నారు. రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయుస్తున్నాడని విమర్శించారు. కిషన్‌రెడ్డి వెంట మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, జనగాం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించండి
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యావంతులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు. గురువారం ఖమ్మంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని తెలంగాణ సమాజం కోరుకుంటున్నదని తెలిపారు. పార్టీకి గ్రాడ్యుయేట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు నైతిక విలువలు లేవన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీలో కొనసాగే పరిస్థితి లేదన్నారు. నిరుద్యోగులకు ఇస్తానన్న నాలుగు వేల రూపాయల భృతి ఏమైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కౌన్సిల్లో పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగుల గుండె చప్పుడు వినిపించేది ఒక్క బీజేపీ మాత్రమేనని చెప్పారు.