చివరి అంకంలో బోనాల పండుగ

తెలంగాణలో  పండుగలు,  సంస్కృతి,  సంప్రదాయాలు ఇతర రాష్ట్రాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి.  తెలంగాణ  సంస్కృతికి దాదాపు 5 వేల సంవత్సరాల చరిత్ర ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మన తెలంగాణ పల్లె,  పట్టణాల్లో ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే పండుగలో ముఖ్యమైనది  బోనాల పండుగ ఒకటి.  ముఖ్యంగా మన భాగ్యనగరం (హైదరాబాద్),  లష్కర్ (సికింద్రాబాద్) జంట నగరాల్లో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందుకే   తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. 

మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంభమై తరువాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండుగను నిర్వహిస్తారు. ఆతరువాత చివరగా లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంతో పాటు చాలాచోట్ల నిర్వహిస్తారు.  ఆషాఢమాసం నుంచి శ్రావణమాసం వరకు ఈ బోనాల పండుగ తెలంగాణ ప్రాంతాలలో ప్రజలు ఆనందంగా జరుపుకుంటారు.  ఈ పండుగను ప్రధానంగా జంటనగరాలతో పాటు తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు. పండుగ రోజున గ్రామదేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, పోతరాజు వేషాలు, శివసత్తులు, డప్పు వాయిద్యాల నడుమ ఆడపడుచుల బోనాలు కనువిందు చేస్తాయి.

ఆషాఢంలో  ప్రారంభమై..శ్రావణ మాసం చివరిలో ముగింపు

నాగరికత కంటే మొదలు గ్రామీణ దశలో మాతృదేవతల కాలం నుంచి నివేదన సంప్రదాయం ఉంది.  బోనం అనేది భక్తి,  భయం రెండూ కూడుకుని ఉన్న భావన.  వర్షాకాలం ఆరంభ ఆషాఢ మాసంలో అంటు వ్యాధులు ప్రబలే కాలం కాబట్టి వ్యాధులను అరికట్టేలా కొన్ని ఆరోగ్యసూత్రాలు ఈ పండుగలో దాగి ఉన్నాయని, గ్రామదేవతలను గౌరవిస్తూ బోనం సమర్పించి తృప్తి పరిస్తే గ్రామం, పిల్లలు చల్లగా ఉంటారని భావించి మాతృస్వామ్య గ్రామదేవతలకు బోనాలు సమర్పించుకుంటారు. వివిధ రూపాల్లో కొలువుదీరిన అమ్మవారు ఆషాఢ, శ్రావణమాసంలో తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం.

వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.  మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు.  మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచి, డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ వివిధ ప్రాంతాల్లో కొలువుదీరిన అమ్మవార్ల  ఆలయాలను దర్శించుకుని మాతృదేవికి గాజులు, చీరలతో సహా బోనం సమర్పిస్తారు. 

బోనాలను మోసుకెళ్తున్న మహిళలను  అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసం. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది. ఆమెను శాంతపరచడానికి ఈ మహిళలు ఆలయమును సమీపించే సమయంలో వారి పాదాలపై భక్తులు నీళ్ళుపోసి శాంతింపజేస్తారు. ఈ పండుగ తెలంగాణలోని హైదరాబాదుతో పాటు కొన్ని ప్రాంతాలలో ఆషాఢ మాసంలో  ప్రారంభమై శ్రావణమాసం చివరిలో ముగుస్తుంది. 

బోనాల పండుగకు శాస్త్రీయ కారణాలు

జానపదులు తమకు ఇష్టమైన గ్రామదేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం.  బోనం అంటే భోజనం అని అర్థం.  ఆ భోజనాన్ని ఆషాఢ, శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఆచారం. ముందుగా  ఒక మట్టి కుండలో అన్నం వండుతారు. అలావండిన అన్నం కుండకి సున్నం, పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన ఆ కుండపై ఒక దీపాన్ని ఉంచుతారు. 

ఇలా వండిన బోనం ఎంతో పవిత్రమైంది. అలా వండిన బోనానికి సున్నం,  పసుపు, వేపాకులు పెట్టడం వలన ఎటువంటి చెడు క్రిమి కీటకాలు రావు. ఇందులో వాడిన సున్నం, పసుపు,  వేపాకులు ఇవ్వన్ని యాంటీ సెప్టిక్.  ఎటువంటి క్రిమి కీటకాలకు బోనం లోపలికి  వెళ్ళే అవకాశం లేదు.  మేకపోతు మెడలో వేపమండలుకట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే  పసుపు కలిపిన నీరు,  వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడతారని ప్రజల నమ్మకం.

- కేశపాగ శ్రీనివాస్,

సీనియర్​ జర్నలిస్ట్​