పరిచయం : పైలట్ కావాల్సింది.. యాక్టర్​నయ్యా : సిద్ధాంత్ గుప్తా

చూడ్డానికి బాగుంటాడు. బాగానే చదువుతాడు. స్పోర్ట్స్​లో బెస్ట్ ప్లేయర్. కానీ నాన్న కల నెరవేర్చాలని  పైలట్​ అవ్వాలనుకున్నాడు. కొద్దిరోజుల్లో పైలట్​ అవుతాడనగా లైఫ్​ యూటర్న్​ తీసుకుంది. ఒక ఫొటోషూట్ తన డ్రీమ్​ని మార్చేసింది. మోడలింగ్ వైపు నడిచేలా చేసింది. నటనలో ఏమీ తెలియకపోయినా యాక్టర్​ అవ్వాలనే ఆశ.. యాక్టింగ్​ కోర్సులో చేరేలా చేసింది. 

అలా మొదలైన జర్నీ సాఫీగా ఏం సాగలేదు. ఎత్తుపల్లాలు వచ్చినా నిలుదొక్కుకొని, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యాక్టర్. అతనే.. బాలీవుడ్​ టీవీ, సినీ నటుడు సిద్ధాంత్ గుప్తా. ఫ్రీడమ్​ ఎట్ మిడ్​నైట్​ సిరీస్​లో జవహర్ లాల్ నెహ్రూ పాత్ర పోషించాడు. సిద్ధాంత్​ జర్నీ తన మాటల్లోనే...

మాది జమ్మూ కశ్మీర్​. మా నాన్న పేరు సుకేశ్​ గుప్తా, జమ్మూలో ఫారెస్ట్​ ఆఫీసర్​గా రిటైర్ అయ్యారు. మా అమ్మ సంధ్య, జమ్మూలో ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్, సోషల్ యాక్టివిస్ట్ కూడా. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. పేరు సనత్. తను భార్యతో కలిసి జమ్మూలోనే ఫ్యాషన్ డిజైన్ బిజినెస్ నడుపుతున్నాడు. ఇదే మా ఫ్యామిలీ. థియేటర్​కి వెళ్లి సినిమాలు చూడడం తప్ప ఇండస్ట్రీలో ఎవరూ తెలియదు. అంతెందుకు అసలు యాక్టర్ అవ్వాలనే ఆలోచనే లేదు. చిన్నప్పటి నుంచి నాకు ఆటలంటే ఇష్టం. 

ఆ ఇష్టంతోనే స్పోర్ట్స్ బాగా ఆడేవాడిని. ఎంతగా అంటే... నేషనల్​ లెవల్లో అండర్–14 క్రికెట్​ ఆడా. అండర్–17 స్విమ్మింగ్, అండర్–19 బాస్కెట్ బాల్​ వంటి స్పోర్ట్స్​లోనూ సత్తా చాటా. ఆ తర్వాత కమర్షియల్ పైలట్ లైసెన్స్ కోసం ఢిల్లీ వెళ్లా. పైలట్ అవ్వడానికి అన్నీ సెట్ అయ్యాయి. అప్పటికి నేను చదువుతూనే ఉన్నాను. అదే టైంలో నేను కొంతమందిని కలిశాను.

 వాళ్లు ఫొటోషూట్​ ఇవ్వమని అడిగారు. తర్వాత నాకు వేరే షూట్​ ఆఫర్ వచ్చింది. నా పోస్టర్లు సిటీలో కనిపిస్తే బాగుంటుంది అని అప్పుడే ఆశ కలిగింది. ఛాన్స్ రాగానే అటు వైపు వెళ్లా. డెనిమ్​ బ్రాండ్​కి మోడల్​గా మారా. దాంతో నా ఇంట్రెస్ట్​ కాస్త పైలట్ నుంచి మోడలింగ్​ మీదకి షిఫ్ట్ అయింది. నిజానికి పైలట్ అవ్వాలనేది నా కల కాదు. మా నాన్న కల. నేనెప్పుడూ పైలట్ కావాలని కోరుకోలేదు. 

ఫస్ట్ ఆడిషన్​ డిజప్పాయింట్ చేసినా..

మోడలింగ్​లో ఉన్నప్పుడు హీరో హోండా, క్లియర్ షాంపూ, క్లోజ్​ అప్ వంటి కమర్షియల్ యాడ్స్ చేశా. తర్వాత సినిమాల్లో ట్రై చేయాలనే కోరికతో ఆడిషన్స్​కి వెళ్లాలని నిర్ణయించుకున్నా. అలా నా ఫస్ట్ ఆడిషన్​కి వెళ్లా. అక్కడ నా ఇంట్రడక్షన్ ఇవ్వమన్నారు. అది కూడా సరిగా చేయలేకపోవడంతో సెలక్ట్ కాలేకపోయా. అయినా ఆశ మాత్రం పోలేదు. దాంతో యాక్టింగ్​ కోర్స్​లో జాయిన్ అయ్యా. అక్కడే నేను యాక్టింగ్​తో ప్రేమలో పడిపోయా. అది నా జీవితాన్ని మార్చేసింది. నాటకాల్లో నటించడం మొదలుపెట్టా. అవి కూడా కొంతకాలమే చేశా.  

అంతలోనే ‘బద్మాషియాన్’​తో బ్రేక్ వచ్చింది. అంతకు ముందే 2012లో ‘టుటియా’ దిల్ అనే సినిమాలో విశాల్ ఖన్నా అనే పాత్రలో నటించా. కానీ, పెద్దగా గుర్తింపు రాలేదు. 2013లో ‘బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంకాక్’ సినిమాలో కూడా కనిపించా. 2015లో ‘బద్మాషియాన్​’​ సినిమాలో దేవ్​ అరోరా పాత్రలో నటించా. అందులో కాస్త గుర్తింపు వచ్చింది. కానీ, అవకాశాలు రాలేదు. 

అదే ఏడాది నాన్నకు ఆరోగ్యం బాలేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయా. అప్పుడు కొన్ని సమస్యలు రావడం వాటిని పరిష్కరించడంతోనే టైం గడిచిపోయింది. ఆ తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా గడపాలనే ఉద్దేశంతో లండన్​ వెళ్లా. కెరీర్ బాలేనప్పుడు ఎవరికైనా బాధగా అనిపిస్తుంది . అలాంటప్పుడు కాస్త విరామం, విశ్రాంతి అవసరం అనిపించింది. 

టీవీలో నటిస్తే..

నిజం చెప్పాలంటే ఖాళీగా కూర్చోవడం కంటే యాక్టింగ్ కెరీర్ కంటిన్యూ చేయడం ముఖ్యం అనిపించింది. అందుకే టెలివిజన్​ సిరీస్​లోనూ నటించడం మొదలుపెట్టా. అయితే దీనివల్ల నాకు మంచే జరిగింది. టీవీలో నటించడం వల్ల మనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. తెలియని వ్యక్తి వచ్చి సినిమాల్లో నటిస్తున్నాడు అంటే ఎవరూ డబ్బులు పెట్టి చూడరు. ఫిల్మ్ మేకర్స్ కూడా టీవీ యాక్టర్లను తీసుకునే చాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్లకు కచ్చితంగా ఆడియెన్స్ ఉంటారు. కాబట్టి వాళ్లకు రిస్క్​ కూడా తగ్గుతుంది. 

ప్యాండెమిక్​కి ముందు నుంచే స్ట్రగుల్స్ చూశా. యాక్టర్ అవ్వాలనుకోవడం, ముంబైకి రావడం, అవన్నీ నా చాయిస్. అలాంటప్పుడు ప్రపంచాన్ని ఎందుకు నిందించాలి. ఏదైనా చేయాలి అనుకుంటే అది నీ చాయిస్  మాత్రమే. ‘లైఫ్ స్టీరింగ్ ఎప్పుడూ మన చేతిలోనే ఉంటుంది. ఏ పనిచేయాలి? ఏది చేయడకూడదు అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. అంతేకానీ, డబ్బు, ఫేమ్ కోసం ఆలోచిస్తూ కూర్చోకూడదు’ అని నాకు నేను చెప్పుకునేవాడిని. అందుకే టీవీ సీరియల్స్​లో నటించా. ‘తషాన్– ఇ –ఇష్క్’ సీరియల్​కి మంచి పేరొచ్చింది. 

ఆ తర్వాత 2017లో ‘భూమి’ అనే సినిమాలో అదితిరావు, సంజయ్​దత్​తో కలిసి నటించే అవకాశం వచ్చింది. కానీ, ‘భూమి’ లాంటి సినిమాలో నటించినా అవకాశాలు రాలేదు. దాంతో మళ్లీ టీవీ వైపే వెళ్లా. అప్పుడు కూడా ఒకటే నమ్మా. వచ్చిన అవకాశాలు వదులుకోకూడదు. సినిమాలు లేకపోతే సీరియల్స్ చేస్తూ ఉండాలి. అంతేకానీ ఎవరూ గుర్తించట్లేదని, మళ్లీ సీరియల్స్​లోకి ఎందుకు? అనే ఆలోచనలు వస్తే ముందడుగు వేయలేం అని. 

నెహ్రూ పాత్రలో..

దర్శకుడు నన్ను నమ్మి ఈ పాత్ర ఇవ్వడం నా అదృష్టం. మన టాలెంట్ మీద మనకు నమ్మకం ఉంటే ఎంతదాకానైనా వెళ్లొచ్చు. ఒక కళాకారుడిని గుర్తించి తగిన పాత్ర ఇవ్వడం దర్శకుల గొప్పతనమే. ఇది మొదలుపెట్టినప్పుడే నేను ఆ పాత్రలో లీనమవుతానని తెలుసు. ఎందుకంటే ఇది ఒక్కరోజులో అయిపోదు. కాబట్టి నేను కొంత టైం తీసుకున్నా. కొన్ని వారాలు టైం తీసుకున్నాక డిసైడ్ అయ్యాను. ఓకే ఇది నా కోసమే అనిపించింది. టైం చాలా తక్కువ ఉండడంతో పాత్రలోకి త్వరగా వెళ్లడానికి ప్రయత్నించా. నేను చేయగలను అని నమ్మా. 

ఆ నమ్మకమే నన్ను ముందుకు నడిపించింది. యూట్యూబ్​లో చాలా విషయాలు అందుబాటులో ఉన్నాయి. ఆయన రాసిన పుస్తకాలు కూడా చదివి, నెమ్మదిగా కనెక్ట్ అవ్వడానికి, ఆలోచనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించా. అయితే ఇది నా వయసుకు మించిన పాత్ర కావడంతో మొదట కాస్త భయపడ్డా. నిజానికి ఈ సిరీస్​ ఒక బుక్​ నుంచి తీసుకున్న కథ. అయితే నేను అది చదవలేదు. స్క్రిప్ట్​లోనే పాత్రల్ని చూశా. ఈ సిరీస్​లో నా పాత్ర గాంధీ, వల్లభాయ్ పటేల్​ కాంబినేషన్​లో ఎక్కువగా కనిపిస్తుంది.