డాన్సర్‌గా మొదలై కొరియోగ్రాఫర్‌గా పేరుతెచ్చుకుని, టీవీ షోలకు హోస్ట్‌గా మారి.. చివరకు తను అనుకున్న సినిమాల్లో యాక్టర్‌గా నిలదొక్కుకున్నాడు. ‘నాదీ షారుఖ్ ఖాన్‌లాంటి స్టోరీనే.. సక్సెస్ వెనుక స్ట్రగుల్స్ చాలానే ఉన్నాయి’ అంటోన్న రాఘవ్ జుయల్.. ‘కిల్’ సినిమాలో విలన్ రోల్లో మెప్పించాడు. దశాబ్దంపాటు టీవీ ప్రేక్షకుల్ని అలరించాడు. ప్రస్తుతం ‘కిల్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా హీరోకు సమానంగా ప్రశంసలు అందుకుంటోన్న రాఘవ్ జర్నీ తన మాటల్లోనే..
‘‘నేను పుట్టింది ఉత్తరాఖండ్‌లోని ఖేతు అనే గ్రామంలో. పెరిగిందంతా డెహ్రాడూన్‌లో. మా నాన్న దీపక్ జుయల్, అడ్వకేట్. అమ్మ పేరు అల్కా బక్షి. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కడా ట్రైనింగ్ తీసుకోలేదు. కానీ, టీవీ, ఇంటర్నెట్లలో చూసి డాన్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. స్కూల్లో ఉన్నప్పుడు డాన్స్ కాంపిటీషన్లో ప్రైజ్‌లు కూడా వచ్చేవి.
తర్వాత కాలేజీలో చేరా. బీకామ్ పూర్తిచేశా. కానీ, కాలేజీలో చేరినప్పటినుంచి డాన్స్‌కు దూరంగా ఉండమని నాన్న తిట్టేవాళ్లు. చదువు మీద శ్రద్ధపెట్టమని చెప్పేవాళ్లు. దాంతో నేను నాన్న లేనప్పుడు ప్రాక్టీస్ చేసేవాడిని. గంటలుగంటలు ఒంటరిగానే డాన్స్ ప్రాక్టీస్ చేసేవాణ్ని. సాయంత్రం నాన్న ఇంటికి వచ్చే టైంకి బుక్ తీసుకుని చదుకుంటున్నట్టు నటించేవాణ్ని. అలా నాన్నకు నేను డాన్స్ చేయడం ఇష్టం లేకపోయినా చాలా ఏండ్లు నేను ప్రాక్టీస్ చేశా.
నా కష్టానికి ప్రతిఫలంగా ‘డాన్స్ ఇండియా డాన్స్’ సీజన్ 3 ద్వారా అవకాశం వచ్చింది. అప్పుడు నాకు ప్రత్యేకమైన డాన్సింగ్ స్టయిల్ ఉండేది. కానీ, టాప్‌లో రాలేకపోయాను. నా ఆడిషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో షో వాళ్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా నన్ను మళ్లీ పిలిచారు. ఆ షోలో సెకండ్ రన్నరప్‌గా నిలిచా. ఆ తర్వాత నాకు స్టేజ్ నేమ్ పెట్టుకున్నా.
దాని క్రొక్రొయక్స్ (crockroax). సోషల్ మీడియాలో అలానే ఫేమస్ అయ్యా. డాన్సర్, కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు వచ్చింది. తర్వాత 2014లో సోనాలి కేబుల్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చా. ఆ తర్వాత ఏబిసిడి 2, నవాబ్జాదె, స్ట్రీట్ డాన్స్ త్రీడి, బహుత్ హువా సమ్మాన్, కిసి కా భాయ్ కిసి కా జాన్ వంటి సినిమాల్లో నటించా. ‘కిల్’ సినిమాతో నెగెటివ్ రోల్స్ కూడా మొదలుపెట్టా.
దశాబ్దకాలం టీవీలోనే..
2011 నుంచి 2021 వరకు పది సంవత్సరాలు నేను టెలివిజన్‌లో పనిచేశా. చాలాకాలం టీవీ హోస్ట్‌గా చేశాను. డాన్స్ షోలలో పార్టిసిపేట్ చేశా. ఆ పదేండ్లలో అడపాదడపా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసే అవకాశం వస్తే అవి కూడా చేశా. కానీ, ఈ విషయంలో నేను బాధపడను. ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి రావాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడున్న స్టార్ హీరోల్లో కూడా ఒకప్పుడు టీవీ షోల్లో పనిచేసినవాళ్లు చాలామందే ఉన్నారు. అంతెందుకు షారుఖ్ ఖాన్ కూడా ఒకప్పుడు టీవీ యాక్టరే. ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చాడు.
విలన్ పాత్రలు కూడా చేశాడు. నాది అలాంటి కథే. సినిమా అవకాశాలు, ప్రేక్షకుల ఆదరణ కోసం టీవీ షోల్లో పనిచేశా. అక్కడ బ్రేక్ తీసుకుంటే ఇమేజ్ ఫేడ్ అవుట్ అవుతుంది. ప్రజలు మర్చిపోతారు అనే ఉద్దేశంతో వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకుంటూ వెళ్లా. సినిమాల్లో లీడ్ రోల్స్, హీరో పాత్రలు రాలేదని అలానే కూర్చోలేదు. విలన్ పాత్రల్లో కూడా నటించొచ్చు. ఆ పాత్రలోనే మన నటన, టాలెంట్ చూపించొచ్చు. పాత్ర ఏదైనా ప్రేక్షకుల మెప్పు పొందాలనే ఉద్దేశంతోనే విలన్ పాత్రలు వచ్చినా ఒప్పుకుంటున్నా.
ఆ నిర్ణయం కష్టమైనదే..
సినిమాల కోసం టెలివిజన్‌లో పనిచేశా. దశాబ్దకాలంపాటు జర్నీ చేసిన చోటు నుంచి సడెన్‌గా దూరం అవ్వడం కష్టంగా అనిపిస్తుంది. అది కూడా కావాలని మనమే వేరే దానికోసం ఉన్న అవకాశాన్ని వద్దు అనుకునే నిర్ణయం తీసుకోవడం సింపుల్ విషయం కాదు. అయినప్పటికీ ఆ నిర్ణయం తీసుకున్నానంటే సినిమా మీద నాకు ఉన్న ప్యాషన్ అలాంటిది. ఒకటి కావాలనుకుంటే దానికోసం ఏదైనా చేయాల్సి వస్తుంది. చాలా కష్టం, త్యాగం వంటివి ఉంటాయి. నా కెరీర్లో కూడా అలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ వదులుకుని, సినిమాల కోసమే ఎదురుచూశా. ఇప్పుడు ఆ అవకాశాలు వస్తున్నాయి. నెమ్మదిగా నా కెరీర్ ట్రాక్‌లో పడింది. ఈ స్టేజ్‌ని నేను ఆస్వాదిస్తున్నా.
సహనం కోల్పోయా
నేను రోజూ షూటింగ్‌కి వెళ్తూనే ఉన్నా. అది నాకు సంతోషాన్నిస్తుంది. యాక్టర్‌గా నేను సంతృప్తి చెందుతున్నా. కానీ, ఒక టైంలో నేను నటించిన సినిమాలు రిలీజ్ ఆలస్యం అవుతుండడంతో సహనం కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంతకాలం టీవీ షోలు చేస్తూ ఉండిపోవాలి? అని ఆల్రెడీ నేను సతమతమవుతున్న రోజులు అవి. ఆ టైంలో నా చుట్టూ ఉన్నవాళ్లు నాకు సెల్ఫ్ డౌట్ క్రియేట్ చేశారు. బిగ్ బాస్‌కి ఎందుకు వెళ్లకూడదు? అంటారు. ఏదీ ట్రై చేయట్లేదు ఎందుకు? అంటారు. సినిమాల్లో నటించాలని వచ్చి, ఇన్నేండ్లు టీవీలో ఉండిపోవడంతో ఎదుగుదల కనిపించట్లేదని నాకూ అర్థమైంది.
నా మైండ్‌లో బోలెడు ఆలోచనలున్నాయి. కానీ, టైం మనది కానప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు వెళ్లలేం అనిపించింది. టాలెంట్ ఉంటే సరిపోదు దాన్ని ప్రూవ్ చేసుకునేందుకు కరెక్ట్ టైం, సరైన ప్లాట్ ఫాం కావాలి అనిపించింది. ఇలా ఆలోచిస్తున్న టైంలోనే... టీవీ షోల వల్ల కూడబెట్టుకుంటున్న డబ్బు కాస్త తగ్గిపోసాగింది. ఇమేజ్ కూడా రాను రాను తగ్గిపోవడం మొదలైంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా లేను. ఒక టైంకి ఫేమ్ అంతా పోయింది. అది నన్ను కాస్త అభద్రతాభావానికి గురిచేసింది. అప్పుడు నాలో ఉన్న నెగెటివిటీతో నేనే పోరాడా. నేను ఎంచుకున్న దారిలోనే నేను వెళ్లాలి అని నిర్ణయించుకున్నా. కంఫర్టబుల్‌గా ఉన్న టీవీ వదిలేసి సినిమాల్లోకి రావడం అంత ఈజీ కాదు. కానీ, నా అదృష్టంకొద్దీ పేరున్న ప్రొడక్షన్ కంపెనీల నుంచే ఆఫర్లు వచ్చాయి. అలా నా కెరీర్ ముందుకు సాగింది.
‘కిల్’ కోసం తొమ్మిది నెలలు..
ఈ పాత్ర కోసం నేను 90ల నాటి నుంచి 2000 సంవత్సరం వరకు దొంగల గురించి పబ్లిష్ అయిన చాలా న్యూస్ పేపర్లు చదివా. ఒంటికి నూనె పూసుకుని దొంగతనాలకు పాల్పడుతుంటారు. వాళ్లంతా ప్రొఫెషనల్‌గా చేస్తుంటారు. అలాగే నా పాత్ర పేరు ఫణి ఏ తప్పు చేయాలని అనుకోడు. అతని తండ్రి దొంగగా ఎలా ఉండాలో నేర్పిస్తాడు. అందులో ఎలా రాణించాలో చెప్తాడు. అందుకు అతను అలా తయారవుతాడు. ‘ఫణి’ కామెడీ కూడా డార్క్, వ్యంగ్యంగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూపోతే పాత్రలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
ఉదాహరణకు... ఈ పాత్ర కోసం నేను షూటింగ్ మొదలుకాకముందు తొమ్మిది నెలల నుంచి ఫిజికల్ ప్రిపరేషన్ మొదలుపెట్టా. స్క్రిప్ట్‌ని దాదాపు 80–90 సార్లు చదివా. చదివిన ప్రతిసారీ ఒక కొత్త విషయాన్ని కనిపెట్టా. ప్రతిసారి కొత్త బిహేవియర్, కొత్తదనం ట్రై చేయడం చేసేవాడిని. ఆ క్యారెక్టర్‌లోని రిథమ్‌ని పట్టుకుని, దానికి అనుగుణంగా నటించేందుకు దాదాపు రెండు నెలలు పట్టింది. అందుకోసం యాక్షన్ డైరెక్టర్ సె–యోంగ్ ఓహ్తో కలిసి పనిచేశా. అంతేకాదు.. ఈ పాత్ర కోసం నేను మా నాన్న సాయం కూడా తీసుకున్నా. ఆయన క్రిమినల్ లాయర్.
ఆయన నాకు ఏమని చెప్పారంటే.. ‘ఎవరూ క్రిమినల్స్‌లా కనపడరు. ప్రతి ఒక్కరూ మనుషులే. చట్టం దృష్టిలో నేరం ప్రూవ్ అయ్యేవరకు ఎవరూ క్రిమినల్స్’ కాదు అని. అప్పుడు నాకు నేను చెప్పుకున్నదేంటంటే.. నేను క్రిమినల్ లేదా విలన్ అని ఎందుకు అనుకోవాలి? నేను ఒక క్యారెక్టర్ని చూసి, దానికి కావాల్సిన విధంగా నటించాలి అని. ఇదేకాకుండా... నేను ఒక క్యారెక్టర్ చేయాలంటే సైకలాజికల్‌గా చాలా ప్రిపేర్ అవుతాను. డైరెక్టర్‌తో కూర్చుని దాని గురించి డిస్కస్ చేస్తాను. రకరకాల ప్రశ్నలు వేస్తుంటాను. ఆ విధంగా నేను ఒక పాత్రకోసం ప్రిపేర్ అవుతాను.
కిల్’తో లైఫ్ టర్న్!
ఈ సినిమాలో నేను చేసిన పాత్రకు చాలా ప్రశంసలు వచ్చాయి. ఒకరైతే హాలీవుడ్ యాక్టర్ హేత్ లెడ్గర్తో పోల్చారు. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అప్రిసియేట్ చేస్తూ మెసేజ్ చేశారు. కొందరేమో ‘విలన్ ఆఫ్ ది ఇయర్’ అని మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా చాలామంది నాకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అలాగే, ‘కిల్’ సినిమాని హాలీవుడ్లో రీమేక్ చేయాలనుకోవడం అంటే మామూలు విషయం కాదు.
ఎందుకంటే బాలీవుడ్ సినిమాలు హాలీవుడ్లో రీమేక్ అవ్వడం అనేది తరచూ జరిగే విషయం కాదు. చిన్న బడ్జెట్, చిన్న యాక్టర్స్‌తో తీసిన మా సినిమాని ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చి చూసి అభినందించడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సినిమాలో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నా. పోయిన నెలలో నేను నటించిన ‘గ్యారాగ్యారా’ అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. దానికి కూడా ప్రశంసలు దక్కాయి. త్వరలోనే ‘యుద్రా’ అనే సినిమా రాబోతుంది.’’
గ్రోత్ ఆగిపోకూడదు
ప్రతి మనిషి లైఫ్‌లో గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంఫర్టబుల్‌గా ఉంటే.. అంటే, ఇల్లు, కారు, ఉద్యోగం ఉండి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్లయితే గ్రోత్ ఆగిపోయినట్లే! నేను అలా ఉండాలనుకోలేదు. కొత్త విషయాలు, డిఫరెంట్ పాత్రలు నేర్చుకోవాలనుకుంటున్నా. బతికున్నంతకాలం డిఫరెంట్ క్యారెక్టర్స్, ఎమోషన్స్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నా. నిజానికి ఒక ఊహా ప్రపంచంలోకి వెళ్లి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది ఫన్‌గా అనిపిస్తుంది నాకు. యాక్టింగ్ అంటే విపరీతమైన ఇష్టం కాబట్టి రకరకాల పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తున్నా.
- ప్రజ్ఞ