పరిచయం : అమ్మ ఇచ్చిన ధైర్యంతో : నేహా సర్గమ్

పక్కింటి అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. దేవతామూర్తుల పాత్రల్లో ఒదిగిపోయింది. శాస్త్రీయ సంగీత మూలాలున్న ఇంటి నుంచి వచ్చిన ఆమె వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆమె పేరే నేహా సర్గమ్. హిందీలో టీవీ నటిగా మొదలైన ఆమె ప్రయాణం ‘మీర్జాపూర్​ సీజన్​3’లో సలోని బాబీగా కనిపించింది. ఈ సిరీస్​ హిట్ కావడంతో ఇప్పుడు ఈ సలోని ఎవరా? అని ఆరా తీస్తున్నారు. ఆమె గురించి​...

బిహార్​లోని పాట్నాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. నేను అక్కడే సెయింట్ జోసఫ్​ హైస్కూల్లో చదివా. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక, పాట్నా ఉమెన్స్​ కాలేజీలో బీబీఏ పూర్తి చేశా. ఆ తర్వాత అడ్వర్టైజ్​మెంట్ అండ్ సేల్స్ ప్రమోషన్​లో మాస్టర్స్ డిగ్రీ చేశా. 

పాట కోసం వెళ్తే..

చిన్నప్పటి నుంచే మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ నాకు. క్లాసికల్ మ్యూజిక్​లో ట్రైనింగ్​ తీసుకున్నా. మాది సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. మా తాత పండిట్ సియారామ్ తివారీ లెజెండరీ క్లాసికల్ సింగర్. అలా నాపై సంగీత ప్రభావం ఉండడంతో ‘ఇండియన్ ఐడల్ – 2, 4’ సీజన్లలో సింగింగ్ ఆడిషన్లు కూడా ఇచ్చా. కానీ సెలక్ట్​ రాలేదు. కానీ, ఇండియన్ ఐడల్ 4 సీజన్​ కోసం ఇచ్చిన ఆడిషన్ నా లైఫ్​ని మలుపుతిప్పింది. రెండో రౌండ్ కోసం ముంబై పిలిచారు. అప్పుడు త్రోట్​ ఇన్ఫెక్షన్​ వచ్చింది. దాంతో పాడలేకపోయా. కానీ, రాజన్​ షాహి నా ఆడిషన్​ క్లిప్​ చూసి నాకు ఫోన్ చేశారు. ఆయన కాల్ చేయడంతో నేను షాక్ అయ్యా. ఆయన చేసిన వర్క్ చూసినప్పటికీ వాటి వెనుక ఉన్నది ఆయనే అని నాకు తెలియదు.  ఆయన నన్ను చూడడం, తను చేయబోయే కొత్త ప్రాజెక్ట్ చూసుకునే మెయిన్​ అతనికి నేను చాలా ఇష్టం కావడంతో నాతో యాక్టింగ్ చేయించాలి అనుకుంటున్నట్టు చెప్పారు. 

స్క్రీన్​ టెస్ట్ కోసం ముంబైకి పిలిచారు. అలా ఒకదానివెంట ఒకటి వేగంగా పనులు జరిగిపోయాయి. ఈ విషయంలో నా ఫ్యామిలీ చాలా ఎగ్జయిట్​ అయ్యారు. నిజానికి నేను దీనికంటే ముందే ఎం.బి.ఎ. చేయాలనుకున్నా. వాళ్లు నా అడ్మిషన్లు పూర్తి చేస్తానని మాట ఇవ్వడంతో ముంబై వెళ్లా. నటనలో క్రాష్​ కోర్స్ చేశా. రాజన్, అమర్ దీప్​ ఝా అనే నటితో కొత్త ఆర్టిస్టులకు యాక్టింగ్ సెషన్స్ ఇప్పించారు. మాకున్న టైం బట్టి ఒక వారంలో ఆ పని పూర్తి చేశాం. నేను ఆమెకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆ కొంత టైంలోనే నేర్చుకున్న నటన, అందుకు ఆమె చేయించిన ప్రాక్టీసు నాకు తరువాత చాలా పనికొచ్చింది. 

ప్రతిరోజూ మెమొరీనే!

నేను చేసిన నా మొదటి పాత్ర పేరు నివేదిత. ఆమెకు తల్లి ఉండదు. అమ్మమ్మ దగ్గర పెరుగుతుంది. ఇంట్రావర్ట్​ అయిన అమ్మాయి. కథ సాగేటప్పుడు పాత్రలో విభిన్న షేడ్స్​ కనిపిస్తాయి. ఫస్ట్ టైం నేను నటించిన అనుభవం నిజంగా మాటల్లో చెప్పలేను. స్క్రిప్ట్​లో సగం మర్చిపోయా. దాంతో చాలా భయపడ్డా. అప్పుడు నేను చేయగలిగినంత బెస్ట్​గా చేయమని మోటివేట్ చేశారు టీం సభ్యులు. మొదటి సీన్​ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. 

ఎందుకంటే ఆ సీన్​లో అన్నయ్య యశ్ తప్పిపోతే చెల్లెలు ఏడుస్తుంటుంది. అలా ఏడుస్తూ నటించడం నాకు కష్టం అనిపించింది. ఆ సీరియల్ షూటింగ్ అంతా రోలర్ కోస్టర్​ రైడ్​లా అనిపించింది. కానీ ఆ టైం బాగా ఎంజాయ్ చేశా. ప్రతి రోజూ ఒక మెమొరీనే.  నిజానికి టీవీ చాలా గొప్ప మీడియం. మిగతా వాటిని దాటే సామర్థ్యం ఉన్నప్పటికీ అది జరగట్లేదు. టీవీ పరిశ్రమలో చాలా కష్టపడి పనిచేస్తారు. కానీ, నాణ్యమైన కంటెంట్​ లేకపోవడం వల్ల ఆ ప్రయత్నాలు ఫలించట్లేదు. 90ల్లో ఉన్న క్రేజ్ టీవీ వాళ్లకు మళ్లీ రావాలి అనుకుంటున్నా. అలా ట్రై చేయాలి కూడా.

ఫ్యామిలీ సపోర్ట్​ వల్లే..

నా కెరీర్​లో నా కుటుంబం చాలా సపోర్ట్ చేసింది. మొదట ‘చాంద్ చుపా బాదల్ మే’ అనే సీరియల్​లో చేశా. నాకు ఈ ఆఫర్ వచ్చినప్పుడు కాస్త తడబడ్డా. మా వాళ్లు నన్ను ఎంకరేజ్ చేసి, ట్రై చేయమని  చెప్పారు. కాబట్టి నేను అది చేయగలిగా. నా ప్రతి అడుగులో వాళ్లు నాకు అండగా ఉన్నారు.

మీర్జాపూర్ విశేషాలు..

‘మీర్జాపూర్ 3’ సిరీస్​లో నేహ, సలోనీ బాబీ అనే రోల్​ చేశా. అయితే, ఇందులో విజయ వర్మ నటించిన పాత్ర పేరు  ‘చోటే త్యాగి’. మా ఇద్దరి కాంబినేషన్లో రొమాంటిక్ సీన్ ఉంది. ఈ పాత్ర ఒప్పుకున్నందుకు ప్రేక్షకులు నన్ను తిడతారు, ట్రోల్ చేస్తారని భయపడ్డా. గతంలో రామాయణంలో ‘సీత’ వంటి పాత్ర చేశాను కాబట్టి  ప్రేక్షకులు నెగెటివ్ కామెంట్స్ చేస్తారనుకున్నా. కానీ, సిరీస్ రిలీజ్ అయ్యాక వచ్చిన రిజల్ట్ చూసి షాక్ అయ్యా. నా పాత్రకు వస్తున్న ఫీడ్ బ్యాక్ చూస్తే హ్యాపీగా అనిపిస్తోంది. విజయ్​ వర్మ లేకపోతే నేనిలా యాక్టింగ్ చేసేదాన్ని కాదు. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం కంఫర్టబుల్​గా అనిపించింది. 

ఇంటిమేట్ సీన్స్ చేయడంలో విజయ్​కి అనుభవం ఉంది. దానివల్ల కూడా భయం అనిపించలేదు. అన్నింటికంటే కూడా.. ఈ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు నా టెన్షన్ చూసి ‘ఈరోజుల్లో అందరూ ఇలాంటి పాత్రలుచేస్తున్నారు. నువ్వొక్కదానివి స్పెషల్ ఏం కాదు’ అని అమ్మ నాకు ధైర్యం ఇచ్చింది. అమ్మ ధైర్యంతో నేను ఈ రోల్​ చేశా. ఆసీన్స్ గురించి డైరెక్టర్, విజయ్​లతో మాట్లాడా. ముగ్గురం కలిసి చర్చించుకున్నాం. ‘గురు’ అయితే నాకు అసౌకర్యంగా అనిపిస్తే చేయొద్దని చెప్పారు. విజయ్ కూడా నన్నెలా హ్యాండిల్ చేస్తున్నారనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాళ్లు.

హోమ్లీ గర్ల్

మా ఫ్యామిలీతో నాకు క్లోజ్​నెస్​ ఎక్కువ. ఎప్పుడైనా సిటీ నుంచి బయటికి వెళ్తే లేదా ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్తే వెంటనే హెల్త్​ పాడవుతుంది. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్​ కంటే ముఖ్యం నాకింకేమీ లేవు.  ఖాళీ టైం దొరికిందంటే ఇంట్లోనే ఉంటా. నా వాళ్లతో టైం స్పెండ్ చేస్తా. నా ఫ్రెండ్స్ నన్ను ‘మూడ్​ స్పాయిలర్’ అని పిలుస్తుంటారు. మరేం చేయను నాకు పార్టీ కల్చర్ నచ్చదు. 

అది నా అదృష్టం

దేవత పాత్రలో నటించడం నా అదృష్టం.  ‘సీత’ లేదా ‘లక్ష్మీ దేవి’ పాత్రలు చేయడం అంత ఈజీ కాదు. ఎక్కడా ఓవరాక్షన్​​ చేయకూడదు. బ్యాలెన్స్​ మెయింటెయిన్ చేయాలి. అలాంటి పాత్రల్లో నటించడం సవాళ్లతో కూడుకున్నది. ఆ కాస్ట్యూమ్స్ వేసుకోవడం అంత ఈజీ కాదు. చాలా టైం పడుతుంది. 

  •     నా రోల్ మోడల్ మా తాతయ్య. ఆయన్ని నేను ఆరాధిస్తా. నా పేరెంట్స్ కూడా అంతే. 
  •     ‘ఇండియన్ ఐడల్5’ కి వెళ్లమని మా వాళ్లంతా చెప్పారు. కానీ, నాకే వెళ్లడం ఇష్టం లేక.. పరీక్షలు ఉన్నాయని దాటవేశా. 
  •     మా తాత కోసం ఏర్పాటుచేసే ఫంక్షన్లలో పర్ఫార్మ్​ చేశా. అవకాశం దొరికితే స్టేజ్ పై క్లాసికల్ మ్యూజిక్ పర్ఫార్మ్ చేయగలను.
  •     సింగింగ్, యాక్టింగ్ రెండూ అద్భుతమైన కళలు. ఆ రెండింటినీ ఆస్వాదిస్తా. రెండింటినీ వేరువేరుగా చూడడం కష్టం నాకు. 
  •     పరిశ్రమలోకి రావాలని, టెలివిజన్​లో నటించాలని ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. నేను చేసే పని మనస్ఫూర్తిగా చేయడమే నాకు తెలుసు. 

- ప్రజ్ఞ