పరిచయం : కరీనా కపూర్ పాత్ర నేను చేయాల్సింది కానీ

చూడగానే పక్కింటి అమ్మాయిలా అనిపించే ఈ బ్యూటీ ఈషా సింగ్​. పదిహేడేండ్ల వయసులో కెరీర్ స్టార్ట్ చేసి పాతికేండ్లకే ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.   హిందీ సీరియల్స్​లో నటించి, టీవీ ఆడియెన్స్​కు దగ్గరైన ఆమె.. సినిమాల్లో అడుగుపెట్టి మూవీ ఆడియెన్స్​కు పరిచయం అయింది. ప్రస్తుతం ‘పైతానీ’ అనే వెబ్​ సిరీస్​తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ మొత్తంలో పదికి పైగా ప్రాజెక్టుల్లో నటించిన ఈషా షార్ట్​ అండ్ స్వీట్​ స్టోరీ తన మాటల్లోనే... 

మాది మధ్యప్రదేశ్​లోని భోపాల్​. టీనేజ్​లో ఉన్నప్పటి నుంచే నాకు సెలబ్రెటీస్​ ఇంటర్వ్యూలు చదవాలనే ఇంట్రెస్ట్ ఉండేది. బాలీవుడ్​ గురించి అన్ని రకాల వార్తలూ చదివేదాన్ని. నా దగ్గర ఉన్న పెద్ద బొమ్మని ఎదురుగా పెట్టుకుని, దానిముందు సరదాగా మూవీ సీన్స్​ని నటించేదాన్ని. అలా నా సినిమాల మీద ఇంట్రెస్ట్ అనేది నా వయసుతోపాటే పెరుగుతూ వచ్చింది. నా మొదటి ఆడిషన్ కోసం నేను ముంబై వచ్చినప్పుడు బిల్​ బోర్డ్ మీద ఉన్న అమ్మాయి బొమ్మను చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే అదే బిల్ బోర్డుపై నా బొమ్మ కనిపించింది. 

అది చూసి మనసుకు చాలా సంతోషంగా అనిపించింది. అయితే, మొదట్లో నా కెరీర్ అంత సాఫీగా ఏం సాగలేదు. అసలు భోపాల్ నుంచి ముంబైకి షిఫ్ట్ కావడమే పెద్ద కష్టమైన పని. రోజు నేను మా నాన్నకు ఫోన్​ చేయడం, ఏడవడం.. ఏడాదిపాటు ఇదే కంటిన్యూ అయింది. ఇక్కడ అనుకున్నంత ఈజీగా పనులు కావు అని అర్థమైపోయింది. కొత్తగా వచ్చినవాళ్లతో ఎవరూ మంచిగా మసలుకోరు. 

కొంతమంది మాత్రమే సపోర్ట్ చేస్తారు. నేను టెలివిజన్​ షోల్లో నటించేటప్పుడు ఒకరు నాతో ఒక మాట అన్నారు. అది నాకు ఇంకా గుర్తుంది. అదేంటంటే నేను లావుగా ఉన్నానట, అందుకని డైటీషియన్​ దగ్గరకు వెళ్లమని సలహా ఇచ్చారు. అదే వ్యక్తి మరో సందర్భంలో ‘నీకు నటించడం ఎలాగో తెలియదు. నువ్వు యాక్టింగ్ నేర్చుకోవాలి’ అని చెప్పారు. ఆ షో నుంచి నేను వెళ్లిపోయాను. ఆ షోకి నన్ను వద్దన్నారని అనుకున్నారంతా. కానీ, కొన్ని ఏండ్ల తర్వాత వాళ్లే నన్ను తిరిగి పిలిచారు. 

తొలి అడుగులు

నా మొదటి టీవీ షో ‘ఇష్క్​ కా రంగ్.. సఫేద్​’. అప్పటికి నా వయసు పదిహేడేండ్లు. ఆ తర్వాత మరికొన్ని టీవీ సీరియల్స్​లో నటించాను. ‘మిడిల్ క్లాస్ లవ్​’ సినిమాతో బాలీవుడ్​కి ఎంట్రీ ఇచ్చా. కెరీర్ స్టార్ట్ చేసిన ఏడేండ్ల తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ సినిమా ఎక్స్​పీరియెన్స్ నాకెంతో నచ్చింది. నన్ను ఎవరూ బయటి వ్యక్తిలా లేదంటే టెలివిజన్​ నుంచి వచ్చానని వేరుగా చూడలేదు.

 ఎందుకంటే చాలామంది టీవీ యాక్టర్లకు సినిమాల్లో అవకాశాలు రావడం కష్టం అనుకుంటారు. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని. నేను ఆడిషన్ ఇచ్చా, సెలక్ట్ అయ్యానంతే! ఈ రోజు నేను సినిమాల్లో, వెబ్ సిరీస్​ల్లో నటిస్తున్నాన్నంటే దానికి కారణం టీవీ సీరియల్సే. కాబట్టి నేను టెలివిజన్ షోలు ఎప్పటికీ ఆపను. అన్నిరకాల ప్రాజెక్ట్స్​లో నటించాలనుంది. అది టీవీ, సినిమా, వెబ్ సిరీస్​ ఏదైనా. సినిమాలు, సిరీస్​లు చేస్తున్నా కాబట్టి టీవీ షోలు చేయకూడదని అనుకోవట్లేదు. 

ఆమీర్​ఖాన్​ పక్కన ఛాన్స్ మిస్​!

‘మిడిల్ క్లాస్ లవ్’ కంటే ముందు రెండు సినిమాలకు నేను ఆడిషన్ ఇచ్చా. అందులో ఒకటి లాల్ సింగ్ చద్దా. కొత్తవాళ్ల కోసం వెతుకుతున్నారని తెలిసి ఆడిషన్​ ఇచ్చా. అందులో కరీనా కపూర్ నటించిన పాత్ర కోసం. ఆమీర్​ఖాన్​కి కూడా నా నటన నచ్చిందని ఒకరు నాకు చెప్పారు. కానీ, అది జరగలేదు. అయితే ఆడిషన్ కోసం మూడు సీన్స్ చేశాం. ఆ టైంలో నేను చాలా ఎంజాయ్ చేశా. అప్పుడు నాతో పాటు మా నాన్న కూడా ఉన్నారు. దాంతో నేను చాలా టెన్షన్​గా ఉన్నాను. నాన్న ఎప్పుడు సెట్​కి వచ్చినా నాకు అలానే ఉండేది. కానీ ఆయన నన్నేమీ అనరు.

 చాలా కూల్​గా ఉంటారు. నా వర్క్​ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ పాత్ర కోసం 50 మందిని ఆడిషన్ చేశారు. అందులో నన్ను సెలక్ట్ చేయకపోయినా అక్కడిదాకా వెళ్లానంటే గ్రేట్ అనిపించింది. అదికాకుండా ఆమీర్ ఖాన్​కి జంటగా నటించాలంటే అది మామూలు విషయం కాదు కదా. అందుకే ఆ ఛాన్స్​ మిస్ అయినందుకు బాధపడలేదు. 

‘పైతానీ’ గురించి..

పైతానీ సిరీస్​లో అమ్మాకూతుళ్ల బంధం గురించి ఉంటుంది. పైతానీ చీరలు నేసే గోదావరి జీవితంలో ఒక్కసారి కూడా ఆ చీరను కట్టుకోలేదు. ఎన్నో సవాళ్లతో కూడిన లైఫ్​ లీడ్ చేస్తూనే కూతుర్ని బాగా పెంచుతుంది. కూతురు కావేరీ తల్లి తనకోసం ఎన్నో త్యాగాలు చేసింది కాబట్టి ఆమె కోరిక తీర్చాలనుకుంటుంది. ఆమె నేసే చివరి చీర లక్షల ఖరీదైనప్పటికీ దాన్ని బహుమతిగా ఇవ్వాలనుకుంటుంది. ఆ క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎమోషన్స్​తో నిండిన ఈ సిరీస్‌, హస్తకళ, సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఇలాంటి సిరీస్​లో నేను నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. పర్సనల్​గా రియల్​ లైఫ్​లో కూడా నాకు, మా అమ్మకు ఇలాంటి బాండింగ్ ఉంది. 

ఫాంటసీ జానర్​ టచ్ చేశా

‘బేకబూ’ అనే ఫాంటసీ టీవీ షోలో నటించా. అప్పటివరకు ఆ జానర్​లో నేను నటించలేదు. స్క్రిప్ట్ చెప్పేటప్పుడే నాకు నచ్చింది. కానీ, కాస్త డౌట్​తోనే ఉన్నా. వాళ్లు నా డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూ నెరేట్ చేశారు. చెప్పడం అయిపోక ముందే నేను మా అమ్మ వైపు చూసి.. ‘ఇది నేను చేయాలనుకుంటున్నా’ అని సైగ చేశా. ఈ షో ప్రోమో విడుదల కాగానే ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలా ఉంది. కాపీ కొట్టారా? లేదంటే దానికి దీనికి లింక్ ఉందా? అని చాలామంది చాలా ప్రశ్నలు వేశారు. కానీ, ఇది పూర్తిగా భిన్నమైన కథ. తప్పకుండా అందరికీ నచ్చుతుంది అని ఇన్​స్టాలో పోస్ట్ కూడా పెట్టా. ఆ సీరియల్​ కూడా పెద్ద హిట్టయ్యింది. 

నాకోసం నా పేరెంట్స్ విడిగా..

తల్లిదండ్రులు పిల్లల కోసం ఏమైనా త్యాగం చేస్తారు అంటారు కదా. నిజంగా అది నా లైఫ్​లో జరిగింది. మా అమ్మానాన్నలు నా కోసం చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిది. నా యాక్టింగ్ కెరీర్ కోసం అమ్మ, అన్నయ్య నాతో పాటు ముంబై వచ్చేశారు. నాన్న మాత్రం ఆయన ఉద్యోగరీత్యా భోపాల్​లోనే ఉండిపోయారు. నా లైఫ్ బాగుండాలనే నేను కోరుకున్నదాంట్లో సక్సెస్ సాధించాలనే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ల సపోర్ట్ లేకపోతే నేను ఈరోజు ఈ స్టేజీలో ఉండేదాన్ని కాదు. నాకు మా ఫ్యామిలీతో చాలా దృఢమైన అనుబంధం ఉంది. మొదట్లో ముంబై వచ్చినప్పుడు ఏడాదిపాటు ఏడ్చాను. ఇంటికి వెళ్లిపోవాలని చాలా దిగులుపడేదాన్ని. కానీ, ఇప్పుడు అలా కాదు. ముంబై నన్ను ఆదరించినట్లు అనిపించింది. ఎంతో సంతోషంగా ఉన్నాను. 

ఇతరులతో నన్ను నేను పోల్చుకోను. కష్టపడి పైకి వచ్చిన వాళ్ల కథలు చాలా విన్నా. వాళ్లు ఎంతో కష్టపడి, నిజాయితీగా ఆ స్థాయికి చేరుకున్నారు.
నా గురించి చెప్పాల్సివస్తే నన్ను ఆదరించినందుకు నేను చాలా రుణపడి ఉంటాను. ఇదంతా నా పేరెంట్స్ వల్లనే జరిగింది. ఎందుకంటే వాళ్లే నాకు సపోర్ట్ చేశారు. మా అమ్మ ఎప్పుడూ నాతోపాటే ఉంటారు.

నేను ఒక పాత్ర చేస్తున్నప్పుడు క్యారెక్టర్​లో లీనమవుతాను. ఆఫ్ స్క్రీన్​లో కూడా నేను అలాగే బిహేవ్ చేస్తుంటాను.కొన్నిసార్లు ఆ క్యారెక్టర్​ వేసుకునే బట్టలే నేను మామూలు టైంలోనే ధరిస్తాను. అలా నేను ఒక పాత్ర కోసం ప్రిపేర్ అవుతాను.ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలన్నీ నా మనసుకు నచ్చాయి.