పరిచయం : మజ్ను నుంచి సికందర్​ వరకు : అవినాశ్ తివారీ

అవినాశ్​ తివారీ.. బాలీవుడ్​లో వెర్సటైల్ యాక్టర్​. పదేండ్ల కిందటే అమితాబ్​ బచ్చన్​తో స్క్రీన్​ షేర్ చేసుకున్న నటుడు. ఖాకీ : ది బిహార్ చాప్టర్, బాంబాయి మేరీ జాన్, కాలా, మడగావ్ ఎక్స్​ప్రెస్.. వంటి సినిమాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం తమన్నా నటించిన హిందీ సినిమా ‘సికందర్​ కా ముఖద్దర్’లో సికందర్​ పాత్రలో మెప్పించాడు. దాదాపు పదిహేనేండ్లపాటు ఇండస్ట్రీలో ఉన్న అవినాశ్​ జర్నీలో ఇంట్రెస్టింగ్ సంగతులు ఇవి. 

మాది బీహార్​. నేను ఇంజినీరింగ్ 

తర్వాత ఎంబీఏ చేశా. మంచి శాలరీతో జాబ్​ వస్తుంది. కానీ, అదే శాలరీ నేను ఇండస్ట్రీలో కూడా సంపాదించొచ్చు అనిపించింది. 24 ఏండ్ల వయసులోనే నాకు నచ్చింది నేను చేయాలనుకున్నా. దాంతో ఢిల్లీలో బ్యారీ జాన్​ యాక్టింగ్ స్కూల్​లో ట్రైనింగ్‌ తీసుకున్నా, నాటకాల్లో నటించా. న్యూయార్క్​కి వెళ్లి మరో ఏడాదిన్నరపాటు ట్రైనింగ్ తీసుకున్నా. 

అప్పుడే15 షార్ట్​ ఫిల్మ్స్ చేశా. న్యూయార్క్​ నుంచి వచ్చానంటే ముంబైలో అవకాశాలు వస్తాయనుకున్నా. 2008లో కాస్టింగ్ డైరెక్టర్స్ ట్రెండ్ రావడంతో మార్పు మొదలైంది. నేను న్యూయార్క్​ నుంచి వచ్చినప్పుడు పోర్ట్​ఫోలియో బదులు షోరీల్ ఉండేది. ఆడిషన్​కి వెళ్లినప్పుడల్లా నా లాప్​టాప్​లో షో రీల్స్ చూపించేవాడిని. అడ్వర్టైజ్​మెంట్స్​లో నటిస్తే నెలనెలా ఆదాయం వచ్చేది. కానీ, సినిమాల్లో నటించాలంటే ఎవరినీ కలవాలో తెలిసేది కాదు. టీవీ షో​లో నటించడం ఇష్టం ఉండేది కాదు. 

కెరీర్ మొదట్లో.. 

డైరెక్టర్​ అనిల్ దేవ్​గన్, మంగత్ పాతక్​ కూతురిని లాంచ్ చేస్తున్న సినిమా గురించి తెలిసింది. ఆ సినిమా కోసం బిగ్​ 92.7 ఎఫ్​ఎం యాక్టర్స్ షో రీల్స్ కాంపిటీషన్ పెట్టారు. దానికి నా షో రీల్ పంపా. నేను ఆఫీస్​కి వెళ్లేసరికి ఎంట్రీ క్లోజ్ అయింది. సెక్యూరిటీ లోపలికి వెళ్లనివ్వలేదు. దాంతో మంగత్​కి ఫోన్ చేశా. ఆయన నా ఆడిషన్​ తీసుకున్నారు. కానీ, అవకాశం మాత్రం రాలేదు. అప్పటికీ నేను నాటకాల్లో నటిస్తున్నా.. డీడీ నేషనల్ షో చేశా. 

అయినా గుర్తింపు లేదు. అప్పుడే  ‘లైలా మజ్ను’ డైరెక్టర్ సాజిద్​ని కలిశా. ఆడిషన్​ చేశాక మజ్ను రోల్​కి నేను సరిపోతానని చెప్పి, వేరే పనులు పెట్టుకోవద్దన్నారు. దాంతో ఎనిమిది నెలలు వెయిట్ చేశా. కానీ రెస్పాన్స్ లేదు. ఆ తర్వాత ఆరు నెలలకు సినిమా స్టార్ట్ అయింది. పూర్తయ్యాక రిలీజ్​కి మరో ఏడాది గడిచింది. అయితే 2018లో ‘లైలా మజ్ను’ రిలీజ్ అయ్యాక ‘ఇతను షోలు, సినిమాల్లో నటిస్తాడు’ అని గుర్తించేవాళ్లు.

అమితాబ్​ బచ్చన్​తో యాక్షన్ సీన్

2013లో ‘యుధ్’ అనే సినిమాలో అమితాబ్​ బచ్చన్​తో యాక్షన్ సీన్ మర్చిపోలేనిది. ఆ సీన్​ ఒక మాల్​లో జరిగింది. ఆయన మధ్యాహ్నం వచ్చారు. ఆ టైంలో ఎండగా ఉండడంతో మేం నీడలో కూర్చుని ఉన్నాం. కానీ, అమితాబ్​ని చూశాక మామీద మాకే సిగ్గేసింది. వెంటనే వెళ్లి ఆయన చుట్టూ చేరాం. ఆయన మాకు స్వీట్స్ పంచారు. నాకు స్వీట్ ఇస్తున్న ప్పుడు ఎదురుగా ఆయన్ని చూడగానే నా గుండె ఆగినంతపనైంది. ఇక షూటింగ్ విషయానికొస్తే.. అప్పటికే నేను స్టంట్ బాయ్స్​తో ప్రాక్టీస్ చేశా. ఆయన మాత్రం రిహార్సల్​ చేయకుండానే షూటింగ్​లోకి వచ్చారు. 

కానీ చాలా ఈజీగా చేసేవారు. అయితే ఆ సీక్వెన్స్ చేసేటప్పుడు పొరపాటున నా మోచేయి ఆయన తలకి తగిలింది. సెట్ అంతా సైలెంట్ అయిపోయింది. డైరెక్టర్ మాత్రం కట్ చెప్పలేదు. ఆ షాట్ అయిపోయాక నేను సారీ చెప్పా. అప్పుడు సెట్​లో అంతా ‘ఇక నీకు సినిమాలు ఉండవు’ అని టీజ్ చేశారు. నేను కూడా ‘నా కెరీర్ అయిపోయింది’ అనుకున్నా. కానీ, అమితాబ్​ చాలా మంచివారు. ఆ విషయంలో నాకు చాలా సపోర్ట్​ చేశారు. అలాగే ఈ సినిమాలో నాకు పెద్ద మోనోలాగ్ డైలాగ్ ఉంది. అది చెప్పగానే అమితాబ్..​ యూనిట్ మొత్తాన్ని చప్పట్లు కొట్టమని చెప్పి, వచ్చి నన్ను హగ్ చేసుకున్నారు. అప్పటికి నా వయసు 28 ఏండ్లు. ఆ టైంలో అలాంటి వ్యక్తి నుంచి ప్రశంస       రావడంతో నా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. 

కరణ్​ జోహార్​తో దోస్తీ

2019లో  ‘బుల్​ బుల్, బాంబాయి మేరీ జాన్, ఐ మెట్​ ఎ గర్ల్​ ఇన్​ ది ట్రైన్’ ​ ప్రాజెక్ట్​లు వరుస కట్టాయి. అవి జరుగుతుండగానే కరణ్​ జోహార్​ నుంచి ఫోన్​ కాల్ వచ్చింది. ‘ఘోస్ట్ స్టోరీస్​’లో నేను నటిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అప్పుడు నేను లండన్​లో ఉన్నా. లండన్ నుంచి తిరిగి రాగానే కరణ్​ ఒకరోజు సాయంత్రం 6 గంటలకు కలవమని చెప్పి, మళ్లీ ఫోన్ చేసి 5 గంటలకు రమ్మన్నారు. 

అయితే ఆ రోజు ట్రాఫిక్​ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. దాంతో మెట్రో ఎక్కి, ఎలాగో ఆఫీస్​కి వెళ్లా. ఎందుకంటే కరణ్ లాంటి వ్యక్తిని కలిసే ఆపర్చునిటీ మిస్ అవ్వొదు అనుకున్నా. నైట్​ 9 గంటల వరకు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. మేం ఎప్పుడు కలిసినా 2 గంటలు టైం స్పెండ్ చేస్తాం. కానీ, వర్క్​ గురించి మాట్లాడుకోం. మొదట్లో ఆర్థిక స్తోమత లేక పీఆర్​ని పెట్టుకోలేదు. దాంతో కరణ్​ ఆ విషయం తనే చూసుకుంటానన్నాడు. అలా కెరీర్ మొదట్లో తను నాకు అండగా నిలిచాడు.

15 ఏండ్ల కల.. 

2003లో నేను ఒక కల కనేవాడిని. అదేంటంటే నేను మెయిన్​ లీడ్​గా పోస్టర్​లో కనపడాలి అని. ఆ డ్రీమ్15 ఏండ్ల తర్వాత నెరవేరింది. అదే ‘లైలా మజ్ను’. ఆ సినిమా రిలీజ్​కి పది రోజుల ముందు నాకు యాక్సిడెంట్ అయింది. ఫేస్ పాడయింది.. బెడ్ మీదే ఉన్నా. నాకేం అర్థం కాలేదు. అంతా అయిపోయింది అనుకున్నా. ఆ తర్వాత నన్ను నేను చాలా మోటివేట్ చేసుకున్నా. అయితే ఆ సినిమా రిలీజ్ అయ్యాక అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. సినిమా కమర్షియల్​గా ఫెయిల్ అని టాక్ వచ్చింది. మూడేండ్లు పడ్డ శ్రమంతా మూడు రోజుల్లోనే పోయింది. దాంతో నేను కలలు కనడం మానేశా. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే.. ఆ సినిమా ఈ ఏడాది అంటే15 ఏండ్ల తర్వాత ఆగస్టు​లో రీ–రిలీజ్ చేశారు. మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇది నిజంగా కలలా ఉంది!