పరిచయం: నేను లేకుండా ఈ సినిమా చేయనన్నాడు!

దాదాపు పదేండ్ల విరామం తర్వాత మళ్లీ స్క్రీన్​పై తళుక్కుమంది ఆ నటి. ఎప్పటిలాగే మరో ఛాలెంజింగ్​ క్యారెక్టర్​లో నటించి మెస్మరైజ్ చేసింది. ఆమె ఎవరో కాదు.. మలయాళ నటి జ్యోతిర్మయి. మోడల్​గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె టీవీ సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చింది. మలయాళ స్టార్​ యాక్టర్స్​తో స్క్రీన్​ షేర్ చేసుకున్న ఆమె ఇతర భాషల్లోనూ నటించింది. రీసెంట్​గా కుంచకో బోబన్, ఫహద్​ ఫాజిల్ నటించిన ‘బోగన్​విల్లే’ సినిమాలో రీతూ అనే​ రోల్​లో నటించిమెప్పించింది. మరి జ్యోతిర్మయి కెరీర్ బిగినింగ్​​, మ్యారీడ్​ లైఫ్​, లాంగ్​ బ్రేక్​, రీస్టార్ట్​ వంటి ఇంట్రెస్టింగ్​ టాపిక్స్​గురించి ఆమె మాటల్లో..

మాది కేరళలోని కొట్టాయం. అమ్మానాన్నలకు నేను ఒక్కదాన్నే సంతానం. మా నాన్న సిన్సియారిటీ గురించి చెప్పేవాళ్లు. అది ఇప్పటివరకు నేను పాటిస్తూ వచ్చా. అమ్మ మ్యాథ్స్ టీచర్. తను ఎప్పుడూ నాకు తోడుగా ఉండేది. కొచ్చిలో చదువుకున్నా. జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్​లో కేరళ ప్రెస్ అకాడమీ నుంచి డిప్లొమా డిగ్రీ పొందా. ఆ తర్వాత మోడలింగ్​లో కెరీర్​ స్టార్ట్ చేశా. దాంతో టీవీ సీరియల్​లో నటించే అవకాశం వచ్చింది. నేను చేసిన మొదటి సీరియల్ ‘ఇంద్రనీలమ్’ మంచి పేరు తెచ్చిపెట్టింది. అలా సీరియల్స్​లో బిజీగా ఉండగానే సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి.

2000లో ‘పైలట్స్’​ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టా. అందులో నేను చేసింది చాలా చిన్న పాత్ర. ఆ తర్వాత ‘ఇష్టం’, ‘భావమ్’​ అనే సినిమాల్లో 2001లో నటించా. ‘భావమ్​’ సినిమాకి అవార్డులు కూడా వచ్చాయి. 2002లో ‘మీస మాధవన్’ అనే సినిమాలో సెకండ్ ఫీమేల్​ లీడ్ పాత్రలో నటించా. ఆ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి కెరీర్​లో వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. దిలీప్​, మమ్ముట్టి, మోహన్ లాల్, సత్యరాజ్​, విజయ్​కాంత్​ వంటి పెద్ద స్టార్స్​తో స్క్రీన్​ షేర్ చేసుకున్నా. 

బోగన్ ​విల్లే గురించి..

నేను ఎప్పుడు సినిమా చేస్తానో నాకే తెలియదు. అమల్, నేను ఒక ప్రాజెక్ట్​ ప్లాన్​ చేసి, పక్కన పెట్టేశాం. తర్వాత కొన్నాళ్లకు ఈ ప్రాజెక్ట్​ వచ్చింది. పదేండ్ల తర్వాత నేను సినిమాలో నటిస్తున్నా. దీనికోసం నేనేం ప్లాన్ చేయలేదు. నేను డెస్టినీని నమ్ముతా. కొన్నిసార్లు కొన్ని చేయాలని రాసి పెట్టి ఉంటుంది. పదేండ్ల తర్వాత కెమెరా ముందుకు రావాలంటే కొత్తగా అనిపించింది. షూటింగ్ ఫస్ట్ డే టెన్షన్ కూడా ఉంది.

కో– స్టార్స్​తో టైమింగ్ మ్యాచ్ చేస్తూ డైలాగ్ చెప్తూ యాక్టింగ్ చేయడం కాస్త కష్టంగా అనిపించింది. అయితే బోగన్​ విల్లే సినిమా మొదలుకాబోయే పది రోజుల ముందువరకు కూడా నేను చేయగలనా? అని అమల్​ని అడిగా. తను నన్ను మోటివేట్ చేస్తూనే ఉన్నాడు. ఒకసారైతే ‘నువ్వు చేయకపోతే అసలు ఈ సినిమానే చేయను’ అనేశాడు. 

విరామం.. హాయిగా ఉంది

అమల్ నీరద్​ నా ఫ్రెండ్​. తను సినిమాటోగ్రాఫర్​ నుంచి డైరెక్టర్​గా టర్న్​ అయ్యాడు. ఇండస్ట్రీలోకి ఒకే టైంలో అడుగుపెట్టాం. 2015లో మా పెండ్లి జరిగింది. అప్పటికీ నేను డివోర్స్ తీసుకుని నాలుగేండ్లు అయింది. ఆ తర్వాతే యాక్టింగ్​ కెరీర్​కి బ్రేక్ వచ్చింది. అప్పటి నుంచి సినిమాలు చేయలేదు. దాదాపు పదేండ్ల విరామం వచ్చింది. కానీ అది నాకు ఎప్పుడూ బోర్ అనిపించలేదు. ఆ టైంని చాలా బాగా ఎంజాయ్ చేశాను.

అమల్​, నేను కలిసి ట్రావెలింగ్​కి వెళ్లేవాళ్లం. ఒకరి గురించి ఒకరం లోతుగా అర్థం చేసుకునేవాళ్లం. మాకు బాబు పుట్టాక తల్లిండ్రులుగా బాధ్యతలు తీసుకున్నాం. ఇద్దరం కలిసి, అటు వర్క్, ఇటు ఇంటి పనులు చూసుకుంటున్నాం. బంధం బలపడాలంటే భార్యాభర్తల మధ్య ఇగోలు ఉండకూడదు. అప్పుడే రిలేషన్​షిప్ బ్యూటిఫుల్​గా ఉంటుంది. మేం ఇద్దరం సాదాసీదా ఫ్యామిలీస్ నుంచే వచ్చాం. డబ్బున్నా లేకున్నా ప్రతి క్షణం వేడుకలానే ఉంటుంది. డబ్బు అనేది మేం కొన్ని సాధించడానికి హెల్ప్ చేసింది. కానీ, దానికంటే మాకు సంతోషమే ముఖ్యం. 

డాన్స్ చేయలేక..

బోగన్​ విల్లే సినిమాలో ‘స్తుతి’ అనే పాట వైరల్ అయింది. ఆ పాట ప్రమోషనల్ వీడియో కోసం డాన్స్ చేయాల్సి వచ్చింది. నేను డాన్సర్​ని కాదు. సినిమాల్లోనే కొంత నేర్చుకున్నా. కానీ, నేను ఇప్పటికే యాక్టింగ్ మానేసి పదేండ్లు దాటింది. అలాంటిది డాన్స్ చేయమంటే కష్టమే. రిహార్సల్స్ చేసేటప్పుడు నావల్ల కాదు.. నేను చేయలేను అనిపించేది. డాన్స్ నుంచి తప్పించుకోవడానికి కాలు విరగొట్టుకున్నా పర్లేదు అనుకున్నాను. ఫైనల్లీ కొరియోగ్రాఫర్ నాకు చాలా ఈజీగా నేర్పించారు. దాంతో ఆ పాటకు డాన్స్​ చేయగలిగాను. 

ఛాలెంజింగ్ క్యారెక్టర్

బోగన్​ విల్లే సినిమాలో నాది పర్ఫార్మెన్స్​కి స్కోప్​​ ఉన్న క్యారెక్టర్​. ప్రస్తుతం మలయాళ సినిమాలని అన్ని భాషల్లోనూ ఆదరిస్తున్నారు. మలయాళ సినిమా ఇప్పుడు ఒక మంచి స్థానంలో ఉంది. ఇలాంటప్పుడు నటించడం నాకు చాలా ఎగ్జయిటింగ్​గా ఉంది. బోగన్​విల్లే సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు అమల్​కి థ్యాంక్స్ చెప్పాలి. ఈ పాత్రకి తన మొదటి, చివరి ఛాయిస్​ నేనే. ఈ పాత్ర నేను ఒప్పుకోవడానికి కారణం కూడా అమల్​ నీరదే. మేం సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి కలిసి పనిచేస్తున్నాం. ఇద్దరం దాదాపు ఒకే టైంలో ఇండస్ట్రీకి వచ్చాం. ఇది మా ఆయన సినిమా కాబట్టి నేను చేయలేదు. ఆఫర్లు వస్తున్నాయి కానీ, నేను ఇంకా వేటికి ఒప్పుకోలేదు. నాకు ఛాలెంజింగ్​ పాత్రలు చేయడం ఇష్టం. అందుకే మామూలు పాత్రలు వచ్చినా చేయడం లేదు.