మండుతున్న ఎండలు..ఆరు మండలాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత

  •     జిల్లా అంతటా 40 దాటిన ఎండ తీవ్రత 
  •     బయటకు రావడానికి జంకుతున్న జనం
  •     ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు 

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. ఏప్రిల్​ఫస్ట్​ వీక్​లోనే ఎండలు ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 11 తర్వాత బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు. ఆ తర్వాత రోడ్లపై జన సంచారం తగ్గిపోతోంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. 

43.8 ఉష్ణోగ్రత నమోదు.. 

గత నెల మొదటి వారం నుంచి మూడో వారం వరకూ జిల్లాలో 37 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదే నెల 26 నుంచి జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. అప్పటి నుంచి క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతూ వచ్చింది. గత నెల 31న బొమ్మలరామారం మండలం మర్యాలలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో 17 మండలాలు ఉండగా, ఈనెల 3న 8 మండలాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

శనివారం నాటికి రెండు మండలాలు మినహా అన్ని మండలాల్లో 40 డిగ్రీలు దాటింది. ఆరు మండలాల్లో 43 డిగ్రీలు దాటగా మోత్కూరు మండలం బుజిలాపురం, యాదగిరిగుట్టలో ఏకంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో ఆరంజ్ అలర్ట్​ను అధికారులు ప్రకటించారు. రానున్న రోజుల్లో 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

ప్రజలు ఉక్కిరిబిక్కిరి.. 

జిల్లాలో ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్తున్న వారు వేడికి తట్టుకోలేక 11.30 గంటలకే తిరిగి వెళ్లిపోతున్నారు. కూలర్లు ఆగకుండా తిరుగుతున్నప్పటికీ ఉక్కపోత తప్పడం లేదు. కరెంట్ వినియోగం కూడా పెరిగింది. వేడిమి తట్టుకోలేక కూల్ డ్రింక్స్, జ్యూస్​అమ్మకాలు రెట్టింపయ్యాయి. వడదెబ్బ నుంచి ఉపశమనానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హెల్త్​ డిపార్ట్​మెంట్ ప్రచారం చేపట్టింది. ఆశ కార్యకర్తలు, అంగన్​వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.