భూములు కొనుడు లిటిగేషన్​ పేరుతో బెదిరింపులు

  •     ధరణి లోపాలే పెట్టుబడిగా దందా
  •     ఫీల్డ్ లో భూమి లేకున్నా రిజిస్ట్రేషన్  చేసుకుని బ్లాక్ మెయిల్
  •     తహసీల్దార్  ఆఫీస్  అడ్డాగా రెచ్చిపోతున్న గ్యాంగ్

గద్వాల, వెలుగు : ఇల్లీగల్ భూములు కొనుడే వారి టార్గెట్.. ధరణిలో ఉన్న లోపాలతో ఫీల్డ్ లో భూ యజమాని కబ్జాలో లేకున్నా.. భూమి కూడా లేకున్నా.. రికార్డులో మాత్రం భూమి ఉండడంతో ముఠా వాటిపై కన్నేసి ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసుకొని బ్లాక్  మెయిల్ చేస్తున్న ఘటనలు జోగులాంబ గద్వాల జిల్లాలో పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. లిటిగేషన్  భూములు, ధరణిలో రికార్డులో ఉండి ఫీల్డులో లేని భూములు, గతంలో ఎప్పుడో అమ్ముకున్నా మళ్లీ ధరణిలో భూములు వాళ్ల పేర్లపై ఉన్న భూములను గుర్తించి అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు. గద్వాల తహసీల్దార్ ఆఫీస్  అడ్డాగా ఈ ముఠా రెచ్చిపోతోంది. వాటి యజమానులు ఎక్కడున్నా వెళ్లి వారికి కొంత డబ్బు ముట్టజెప్పి వారి పేరుపై రిజిస్ట్రేషన్  చేసుకొని బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారనే ఆరోపణలున్నాయి.

ఇందుకుగాను గద్వాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు ముఠాగా ఏర్పడ్డారని, వారికి గద్వాలలోని ఓ రిటైర్డ్  ఎంప్లాయ్  డబ్బు సాయం అందిస్తున్నారని, భూములు ఎక్కడున్నాయో చెప్పి వారికి ఓ రెవెన్యూ ఆఫీసర్  సపోర్ట్  చేస్తుండడంతో నాలుగైదు నెలల నుంచి ఈ ముఠా గద్వాల టౌన్ తో పాటు చుట్టుపక్కల అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే జమ్మిచెడు, అయిజ రోడ్డు తదితర ప్రాంతాల్లో 8 చోట్ల పొలాలను రిజిస్ట్రేషన్  చేసుకొని బ్లాక్​మెయిల్  చేసి రెండు చోట్ల డబ్బులు కూడా వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

ధరణి లొసుగులే పెట్టుబడి..

ధరణిలో ఉన్న లొసుగులతో బ్లాక్​మెయిల్​ దందాకు ఈ ముఠా తెరలేపిందని అంటున్నారు. ఎర్రవల్లి నుంచి గద్వాల వరకు రోడ్డు నిర్మించేందుకు గతంలో భూసేకరణ కింద తీసుకున్న భూముల రికార్డుల్లో తొలగించలేదని తెలుస్తోంది. దీన్ని ఆసరా చేసుకున్న ముఠాలోని సభ్యులు జమ్మిచేడ్​ శివారులో కొన్ని సర్వే నంబర్లలోని పొలాలను కొనుగోలు చేసి బెదిరింపులకు దిగుతున్నారు. అయిజ రోడ్డు వెంట ఉన్న పొలాలను గతంలో అమ్ముకున్న వారు ధరణి రికార్డులో తమ పేర్లు ఉండడంతో రిజిస్ట్రేషన్  చేసుకుని మిగులు భూమి ఉందంటూ బ్లాక్ మెయిల్  చేస్తూ డబ్బు గుంజే ప్రయత్నం చేస్తున్నారు.

341 పంచాయితీ ఇదే..

జమ్మిచేడ్ శివారులోని 341 సర్వే నంబర్ పంచాయితీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సర్వే నంబర్ లో రెండెకరాల ఒక గుంట పొలం ఉంది. అందులో ఇదివరకే 1.11 గుంటలు నిర్మల అనే మహిళకు అమ్మారు. 20 గుంటల్లో 12 ప్లాట్లు రిజిస్ట్రేషన్​ చేశారు. 12 గుంటలు ఆర్అండ్ బీ రోడ్డుకు తీసుకున్నారు. ఏడు గుంటల్లో కాలనీ కోసం రోడ్డు వేశారు. అయితే రికార్డులో తమ పేరు ఉందని 21 గుంటల పొలం ఉందంటూ రిజిస్ట్రేషన్  చేసుకొని మరో వ్యక్తి ఫీల్డ్ పైకి రావడం వివాదానికి తావిస్తోంది. కాగా 337 సర్వే నంబర్​లో పోయిన భూమిని కూడా 341 భూమిలో చూపించారని శ్రీనివాస్ గౌడ్  అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. అలాగే జమ్మిచేడ్​ శివారులోని సర్వే నంబర్ 42, 43లో కూడా ఇదివరకే భూమి పోయినా, మళ్లీ తమ భూమి ఉందంటూ మోకాపైకి రావడం వివాదానికి కారణమవుతోంది.

8 చోట్ల రిజిస్ట్రేషన్లు..

గద్వాల మున్సిపాలిటీ పరిధితో పాటు జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ఇక్కడి మిగులు భూములపై కన్నేశారు. అయిజ, జమ్మిచేడ్​ శివారుతో పాటు పరిసర ప్రాంతంలో 8 చోట్ల రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. జమ్మిచేడ్​ శివారులో సర్వే నంబర్  42, 43లోని వివాదాస్పద భూములను కూడా రిజిస్ట్రేషన్  చేసుకున్నట్లు సమాచారం. ఈ గ్యాంగ్​కు గద్వాల పట్టణంలోని ఓ రిటైర్డ్  ఎంప్లాయ్ సపోర్ట్  చేస్తున్నారని అంటున్నారు. అలాగే ఇక్కడ పని చేసిన రెవెన్యూ ఆఫీసర్  ఓ సర్వే నంబర్ లో భూమి లేకున్నా.. అగ్రికల్చర్  ల్యాండ్  ఉన్నట్లు రిపోర్ట్  ఇచ్చి సపోర్ట్  చేశారనే ఆరోపణలున్నాయి. ఆయన రిపోర్ట్  ఇవ్వడంతోనే కోర్టులో మాఫియాకు సపోర్ట్  లభించిందనే విమర్శలున్నాయి.

లిటిగేషన్  భూములపై దృష్టి పెడతాం..

గద్వాల చుట్టు పక్కల ప్రాంతాల్లో లిటిగేషన్  భూములపై దృష్టి పెడతాం. రికార్డులో భూములు ఉన్నా.. ఫీల్డ్ లో భూములు లేని వారి వివరాలతో ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేస్తాం. రోడ్లు, ప్రభుత్వ అవసరాలకు సేకరించిన భూమి వివరాలు తెలుసుకొని వివాదాలు లేకుండా చూస్తాం.

- రాంచందర్, ఆర్డీవో, గద్వాల