ఆహారమే తొలి ఔషదం అంటారు. ఒకప్పుడు మన పూర్వికులు వారికి అవసరమైన పోషకాలను అహారధాన్యాల నుంచే పొందేవారు. కానీ కాలం మారింది. వ్యవసాయ రంగంలోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆహారంలో పోషకాలు కరువయ్యాయి. రైతులు అధిక దిగుబడులు అందించే వరి రకాల సాగుకు అలవాటు పడిపోయారు. అయితే ఈ మధ్యకాలంలో సేంద్రియ విధానంలో పండిన పోషకాల పంట ఉత్పత్తులను ఆహారంగా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
తెల్ల బియ్యం చూసి ఉంటారు. దానితో చేసే అన్నం తినీ ఉంటారు. కానీ ప్రస్తుతం ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ఈ నేపధ్యంలో నల్ల బియ్యం తెరపైకి వచ్చాయి. నల్ల బియ్యం అన్నాన్ని తినేందుకు కొందరు మొగ్గు చూపుతున్నారు. దీంతో నల్లవరి సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.ఖరీఫ్ సీజన్‌లో నల్ల వరి నాట్లు వేసేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ఆధునిక పద్ధతుల ద్వారా నల్ల వరి సాగు ఎక్కువ దిగుబడి( ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్లు ) సాధించవచ్చు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ యొక్క వ్యవసాయ విజ్ఞాన కేంద్రం తెలిపిన ప్రకారం.. నల్ల వరిని సాగు చేసు పొలంలో నాగలితో మొదట దున్నాలి. ఆ తరువాత 2 నుంచి 3 సార్లు కల్టివేటర్‌తో దున్ని సాగు భూమిని సిద్దం చేసుకోవాలి. పంట పొలంలో ఎక్కువకాలం నీరు ఉండేలా తగు ఏర్పాట్లు చేసుకోవాలి. అయితే నాటు వేసే ముందు.. పంటను కోసే సమయంలో పొలాన్ని నీటితో నింపి చదును చేయాలి. . నల్ల వరి నాట్లు వేసేటప్పుడు రైతులు జిబామృత్, వర్మీకంపోస్టు, జీవ ఎరువులు వాడతారు. దీని సాగులో రసాయనిక ఎరువుల వాడకాన్ని నివారించాలి. ఇది సేంద్రీయంగా పెరగడంతో .. పోషకాలు ఎక్కువుగా ఉంటాయి.
బ్లాక్ రైస్ ను మొదట చైనాలో పండించారు. రైతాంగం నల్లవరి సాగు చేస్తూ అధిక అదాయాన్ని పొందుతున్నారు. ప్రకృతి సేద్య విధానాన్ని అవలంభిస్తూ తక్కువ ఖర్చుతో ఈ నల్లవరి సాగు చేయవచ్చు. మార్కెట్లో నల్ల బియ్యానికి మంచి ధర రూ. 250 నుంచి 500 వరకు పలుకుతుండటంతో రైతులు నల్లవరి సాగుచేసేందుకు మొగ్గుచూపుతున్నారు. మన దేశంలో మణిపూర్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో నల్ల వరిని అధికంగా సాగు చేస్తున్నారు. నల్ల వరి సాగుకు వాతావరణం అనుకూలంగా ఉండటంతో అస్సాంలోని వివిధ ప్రాంతాలలో .. సిక్కిం .. ఒడిషాతో సహా కొన్ని ఇతర రాష్ట్రాలలో కూడా రైతులు నల్ల వరి సాగుపై దృష్టి కేంద్రీకరించారు.
ఖరీఫ్ సీజన్‌లో నల్ల వరిని ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా బంపర్ దిగుబడి సాధించవచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. నల్లటి వరి రకాల్లో కలబతి మరియు చఖావో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇంకా ఇవి కాకుండా బ్లాక్ జపనికా రైస్, బ్లాక్ గ్లుటినస్ రైస్, ఇటాలియన్ బ్లాక్ రైస్, ధాయ్ బ్లాక్ జాస్మిన్ రైస్ రకాలను నల్లవరిని సాగు చేస్తున్నారు. బ్లాక్ రైస్ లో అనేక పోషకాలున్నందున మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. నల్ల వరి పంట 100 నుండి 120 రోజులలో 4.5 అడుగుల ఎత్తుకు చేరి కోత దశకు చేరుకుంటుంది. ఇది సాధారణ వరి పంట కంటే పెద్దదిగా ఉంటుంది. చీడపీడల బెడద లేకపోవటం సాధారణ ఎరువుల వినియోగించటం ద్వారా ఈ పంటను సాగు చేయవచ్చు.
సాధారణ వరి పంటలాగే, నల్ల వరి పంట ఉత్పత్తి ఎకరాకు సగటున 12 నుంచి -15 క్వింటాళ్లు. నల్ల బియ్యాన్ని ఎక్కువగా ఖీర్ రూపంలో ఔషధంగా ఉపయోగిస్తారు. పిండి, సెమోలినా, సిరప్, బీర్, వైన్, కేకులు, రొట్టెలు, లడ్డూలు , ఇతర తీపి ఆహారాలు , సౌందర్య ఉత్పత్తులతో సహా కొన్ని ఇతర వస్తువుల తయారీలో బ్లాక్ రైస్ ఉపయోగిస్తారు. సాధారణంగా సాధారణ వరి బియ్యాన్ని కిలో రూ.60 నుంచి 70 వరకు విక్రయిస్తారు. కాగా, నల్ల బియ్యం కిలో రూ.250 నుంచి రూ.500 వరకు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇది గల్ఫ్ దేశాలతో పాటు అనేక యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేయబడుతుంది.
బ్లాక్ రైస్ ను పోషకాల గనిగా భావిస్తూ చాలా మంది ఆహారంగా తీసుకుంటున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు,ఆంథోసైనిన్ లు(anthocyanin) పుష్కలంగా లభిస్తాయి. గుండె సంబంధిత వ్యాధులతో పాటు, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ నల్ల బియ్యం సంజీవనిలా పని చేస్తుందని నిపుణులు అంటున్నారు. సాధారణ తెల్ల బియ్యంతో పోలిస్తే ఇందులో ఐరన్, ప్రొటీన్, ఫైబర్, కాపర్, కెరోటిన్ వంటి పోషకాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. డయాబెటీస్ ను అదుపులో ఉంచటం, అధిక రక్తపోటు సమస్య, నరాల బలహీనత తదిర వ్యాధుల నుండి కాపాడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.