బ్లాక్ మూవీ రివ్యూ:  1964లో జరిగిన ఘటనకు, విల్లాకు సంబంధమేంటి..?

టైటిల్: బ్లాక్
ప్లాట్​ఫాం: ఆమెజాన్​ ప్రైమ్​ వీడియో
డైరెక్షన్: కేజీ బాలసుబ్రమణి
కాస్ట్: జీవా, ప్రియా భవానీ శంకర్, వివేక్ ప్రసన్న, యోగ్ జపీ
లాంగ్వేజ్​: తమిళం

ఇది సైన్స్​ ఫిక్షన్​ సినిమా. మొదటి పది నిమిషాలు1964లో జరిగిన ఒక సన్నివేశాన్ని చూపిస్తారు. అందులో ఒక ప్రేమ జంట ఇంటినుంచి పారిపోయి తమ ఫ్రెండ్ మనో (వివేక్ ప్రసన్న) దగ్గరకు వస్తారు. అతను వాళ్లను కారులో ఒక బీచ్​ విల్లాకు తీసుకెళ్తాడు. మధ్యలో దారికి అడ్డంగా ఆగిపోయిన ఒక ఎద్దుల బండి కనిపిస్తుంది. దాని మీద ఒక పాలరాతి విగ్రహం ఉంటుంది. విల్లాకు వెళ్లాక మనో ఆ జంటను గదిలోకి పంపిస్తాడు. తర్వాత మందు తాగి.. గన్​ తీసుకురావడానికి మళ్లీ కారు దగ్గరకు వెళ్తాడు. సడెన్​గా విల్లా నుంచి రెండుసార్లు గన్​ పేలిన సౌండ్స్​ వినిపిస్తాయి.

మనో పెరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్లి చూస్తే ఇద్దరూ చనిపోయి ఉంటాయి. ఇప్పుడు కథ 2024కి వస్తుంది. వసంత్ (జీవా), అతని భార్య ఆరణ్య (ప్రియా భవానీ శంకర్) అప్పుడప్పుడు సరదాగా గడపడానికి ఒక బీచ్​ విల్లా కొంటారు. అది చెన్నై శివార్లలో కట్టిన ఒక కొత్త గేటెడ్​ కమ్యూనిటీలో ఉంటుంది. ఒకరోజు ఇద్దరూ కారులో అక్కడికి వెళ్తారు. అందులోకి మొదటగా వెళ్లింది వీళ్లే అని బిల్డర్ చెప్తాడు. వసంత్​, ఆరణ్య వెళ్లిన కాసేపటికే కరెంట్​ పోతుంది. బయటికి వెళ్లి.. జనరేటర్​ ఆన్ చేస్తారు.

మళ్లీ ఇంట్లోకి వెళ్లి చూసేసరికి ఎదురుగా ఉన్న విల్లాలో కూడా లైట్లు వెలుగుతుంటాయి. అందులో ఎవరున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. చూస్తే.. అందులో కూడా అచ్చం వీళ్లలాగే ఇద్దరు ఉంటారు. బట్టలు కూడా వీళ్లు వేసుకున్నట్టే ఉంటాయి. అసలు వాళ్లెవరు? 1964లో జరిగిన సంఘటనకు, ఈ విల్లాలో ఎదురైన పరిస్థితికి సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా పూర్తిగా చూడాలి.