అదానీ, అంబానీల అండతోనే ఎన్నికల్లో బీజేపీ విజయం: MLC జీవన్ రెడ్డి

జగిత్యాల: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భవిష్యత్‎లో భారత ప్రధాని కావడం ఖాయమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఉత్తర భారత దేశానికి రాహుల్, దక్షిణ భారత దేశానికి ప్రియాంక గాంధీ బాధ్యతలు చేపడితే రానున్న ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద 2024, నవంబర్ 24 ఆదివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వయనాడ్‏లో ప్రియాంక గాంధీ గెలుపుతో యావత్ భారతావనిలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. దేశ సమగ్రత, ప్రపంచ శాంతి కోసం చేసిన త్యాగాల ఆశయాల సాధనకు గాంధీ కుటుంబం ముందుకు సాగుతుందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ కూటమి విజయం సాధించిందని ఆరోపించారు. జార్ఖండ్‎లో సొరెన్‎పై ఎన్ని కుట్రలు చేసిన ప్రజాస్వామ్యమే గెలిచిందన్నారు. అదానీ పెట్టుబడులతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని.. అంబానీ, అదానీల అండతోనే బీజేపీ ఎన్నికల్లో విజయం సాధిస్తోందని ఆరోపణలు గుప్పించారు. అదానీ అరెస్ట్ అయితే ఎన్డీఏ కూటమికి ముగింపు తప్పదని అన్నారు.