హర్యానాలో రెబెల్స్​పై బీజేపీ వేటు

 
  • 8 మందిని ఆరేండ్లు బహిష్కరించిన కమలం పార్టీ 

  • సీఎం నాయబ్ సింగ్​పై పోటీకి దిగిన నేత కూడా ఔట్  

చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా బరిలోకి దిగిన 8 మంది రెబెల్ నేతలను ఆ పార్టీ బహిష్కరించింది. సీఎం నాయబ్ సింగ్ సైనీపై పోటీకి దిగిన నేత, ఓ మాజీ మంత్రితోపాటు మరో ఆరుగురిని ఆరేండ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఆదివారం బీజేపీ స్టేట్ చీఫ్ మోహన్ లాల్ బదోలీ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేసి, రణియా నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన మాజీ మంత్రి రంజిత్ చౌతాలా, లాడ్వా నియోజకవర్గంలో సీఎం సైనీపై ఇండిపెండెంట్ గా పోటీకి దిగిన సందీప్ గార్గ్ బష్కిరణకు గురైనవారిలో ఉన్నారు. అలాగే రెబెల్స్ గా బరిలోకి దిగిన మాజీ మంత్రి బచన్ సింగ్ ఆర్యా(సఫిదో), రామ్ శర్మ (అస్సాంధ్ సెగ్మెంట్), రాధా అహ్లావత్ (మేహమ్), నవీన్ గోయల్ (గుర్గావ్), కేహార్ సింగ్ రావత్ (హథిన్), మాజీ ఎమ్మెల్యే దేవేంద్ర కద్యాన్ (రణియా నియోజకవర్గం)లపైనా పార్టీ వేటు వేసింది. కాగా, హర్యానా అసెంబ్లీలో 90 సీట్లు ఉండగా, అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. 8వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.