బీఆర్ఎస్ ​తరహాలో కాంగ్రెస్ ​అబద్ధపు హామీలు : ధర్మపురి అర్వింద్

  •     బీజేపీ అభ్యర్థి అర్వింద్​ ధర్మపురి

నిజామాబాద్, వెలుగు :  బీఆర్ఎస్​ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయిందని ప్రస్తుతం కాంగ్రెస్​కూడా అదే బాటలో వెళ్తోందని బీజేపీ పార్లమెంట్అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ అన్నారు. మంగళవారం ఆయన జిల్లా బీజేపీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​ ఆరు గ్యారంటీలకు వారంటీ లేదని ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో అమలు చేయని హామీలు ఒక్క ఆగస్టులో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ తరహాలో సీఎం రేవంత్​రెడ్డి కూడా అడ్రస్​లేకుండా పోతారన్నారు.

మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్​లో బీజేపీ, బీఆర్ఎస్​ ఒక్కటేనంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్​ ప్రయత్నించిందన్నారు. లిక్కర్​స్కాంలో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు ఇప్పట్లో బెయిల్​వచ్చే చాన్స్​లేదన్నారు. కొన్ని మీడియా సంస్థలు నిజాలు చెప్పడంలేదని అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అర్బన్​ఎమ్మెల్యే ధన్​పాల్​సూర్యనారాయణ, పార్టీ జిల్లా ప్రెసిడెంట్​దినేశ్​కులాచారి ఉన్నారు.

రేవంత్​ను దేవుడే కాపాడాలె

పార్లమెంట్​ఎలక్షన్ తర్వాత రేవంత్​రెడ్డి సీఎం కుర్చీకి గ్యారంటీ లేదని దేవుడే ఆయన్ను కాపాడాలని అర్వింద్​ అన్నారు. నగరంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. బీజేపీకి 12 పార్లమెంట్​ స్థానాలు వస్తాయని కాంగ్రెస్​ లీడర్లే అంటున్నారని ఇక రేవంత్​రెడ్డి కుర్చీ ఎక్కడుంటుందని ప్రశ్నించారు. తెలంగాణ పాలిటిక్స్​మారబోతున్నాయన్నారు.