బ్లిట్జ్ పత్రిక కథనాలపై రాహుల్ స్పందించాలి : ఎంపీ రఘునందన్ రావు

  •     బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్
  •     సోనియా నివాసానికి వెళ్లేందుకు ఎంపీ యత్నం

న్యూఢిల్లీ, వెలుగు : రాహుల్  గాంధీ బ్రిటన్  పౌరుడని బ్లిడ్జ్  పత్రికలో వచ్చిన కథనంపై కాంగ్రెస్  అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్  గాంధీ  స్పందించాలని బీజేపీ ఎంపీ రఘునందన్  రావు డిమాండ్  చేశారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్  గాంధీని కలవడానికి రఘునందన్  శుక్రవారం ఢిల్లీలోని 10 జన్ పథ్ లో సోనియా నివాసానికి వెళ్లేందుకు యత్నించారు. ఆయన వెంట సిర్పూర్  ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్  కూడా ఉన్నారు. 

బ్లిడ్జ్  పత్రికలో వచ్చిన వ్యాసానికి సంబంధించిన క్లిప్పింగ్ ను తీసుకొని సోనియా నివాసంలోకి వెళ్లేందుకు రఘునందన్, హరీశ్   యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. అనంతరం మీడియాతో రఘునందన్  మాట్లాడారు. బ్లిట్జ్  పత్రిక కథనాలను రాహుల్  గాంధీకి అందించేందుకు సోనియా నివాసానికి వచ్చానని చెప్పారు. అయితే, రాహుల్  వేరే సమావేశంలో ఉన్నారని సిబ్బంది చెప్పారని, దీంతో ఆ ప్రతులను అక్కడి సిబ్బందికే ఇచ్చానని వెల్లడించారు.