సివిల్​ కోడ్​పై కాంగ్రెస్​ వైఖరి చెప్పాలి : అర్వింద్

  • బీజేపీ ఎంపీ అభ్యర్ధి అర్వింద్ డిమాండ్ ​

నిజామాబాద్​, వెలుగు: దేశ విభజన టైంలో పాకిస్థాన్​, బంగ్లాదేశ్ వెళ్లి బతకలేక అవస్థలు పడుతున్న హిందువులు తిరిగి భారత్​ పౌరసత్వం కోరుకుంటున్నారని బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్​ అన్నారు. వారి కోసం రూపొందించిన  సిటిజన్​ఎమెండ్​మెంట్​ యాక్ట్​ ( సీఏఏ), నేషనల్​ రిజిస్ట్రార్​ ఆఫ్​ సిటిజన్స్​ (ఎన్​ఆర్సీ), కామన్​ సివిల్​ కోడ్​పై కాంగ్రెస్​ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. 

 ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్​ షా పాల్గొన్న ఇందూర్​ విశాల జలసభలో ఆయన ప్రసంగించారు.  ఒకే దేశం ఒకే చట్టంతో ముస్లిం మహిళలు గౌరవంగా జీవించేందుకు వీలు కలుగుతుందన్నారు.  ఈ మూడు అంశాలపై క్లారిటీ ఇచ్చి కాంగ్రెస్​ ఓట్లు అడగాలన్నారు.  మోసపూరిత హామీలతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత  స్టేట్​లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ గవర్నమెంట్​ కూలిపోవాలని పూజలు చేయాలన్నారు.  కార్పొరేట్​ లోన్లు గవర్నమెంట్​హామీతో ముస్లింలకు ఇవ్వాలని మేనిఫెస్టోలో చేర్చడాన్ని అందరూ గమనించాలన్నారు. కాంగ్రెస్​ సర్కారు మహాలక్ష్మీ, గృహలక్ష్మీ అంటూ దేవతల పేర్లు స్కీంలకు పెట్టి పేదలను మోసం చేస్తోందన్నారు.  

దేశం కోసం ధర్మం కోసం జరుగుతున్న ఎన్నికలు ఎమ్మెల్యే  పైడి రాకేశ్ రెడ్డి 

దేశం కోసం.. ధర్మం కోసం ఎన్నికలు జరుగుతున్నాయని ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్ ​రెడ్డి అన్నారు.  కాషాయ జెండా సగర్వంగా ఎగిరే తీర్పునివ్వాలని ప్రజలను కోరారు.  సీఎం రేవంత్​రెడ్డి 420 రాజకీయాలు చేస్తూ ద్రోహిగా మారారన్నారు.  కాంగ్రెస్​ పార్టీ ఆరు అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిందని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ ఆరోపించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో మహిళలు, యూత్​కు ఉన్నత స్థానం లభిస్తోందన్నారు. తెలంగాణలో భారీ మెజారిటీతో నిజామాబాద్​ఎంపీని గెలిపించాలని కోరారు. బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​ దినేష్​కులాచారి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ప్లోర్​ లీడర్​ స్రవంతిరెడ్డి, పల్లె గంగారెడ్డి, మోహన్​రెడ్డి తదితరులు ఉన్నారు.