వేములవాడలో కోడెల పంచాయితీ..ఈవో ఆఫీస్‌ వద్ద బీఆర్‌ఎస్‌, బీజేపీ ధర్నా

  • అసత్య ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామన్న మంత్రి సురేఖ

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన కోడెలను రూల్స్​కు విరుద్ధంగా ప్రైవేట్‌ వ్యక్తులకు ఇచ్చారంటూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై ఎంక్వైరీ చేయించాలని డిమాండ్‌ చేస్తూ ఈవో ఆఫీస్‌ ఎదుట బీఆర్‌‌ఎస్‌ ధర్నా చేయగా, బీజేపీ లీడర్లు ఈవో ఛాంబర్‌‌లో బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ ఫేక్‌ సొసైటీకి కోడెలు ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సిఫారసు లెటర్‌ ఇచ్చారని ఆరోపించారు. రూల్స్​కు విరుద్ధంగా ఒకే వ్యక్తికి 49 కోడెలను ఇవ్వడం సరికాదని మండిపడ్డారు.

మంత్రిని బర్తరఫ్‌ చేయడంతో పాటు ఈవోను సస్పెండ్‌ చేసి కలెక్టర్‌తో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో బీఆర్ఎస్‌ లీడర్లు ఏనుగు మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్  మాధవి, విజయ్, శ్రీకాంత్‌గౌడ్‌, బీజేపీ లీడర్లు రేగుల సంతోష్‌బాబు, హన్మాండ్లు, శేఖర్, కృష్ణ, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ విషయమై ఈవో వినోద్‌రెడ్డి మాట్లాడుతూ గీసుకొండ రాజరాజేశ్వర సొసైటీకి రాజన్న కోడెలను ఇచ్చామనడం వాస్తవం కాదన్నారు. రాజన్న కోడెల విషయంలో తప్పుడు వార్తలపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు 
చేస్తామని హెచ్చరించారు.

చట్టపరంగా చర్యలు తీసుకుంటాం

ప్రభుత్వంపై  అసత్య ప్రచారం చేస్తూ, అశాంతిని సృష్టించే ప్రయత్నం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి కొండా సురేఖ ఒక ప్రకటనలో హెచ్చరించారు. కోడెల నిర్వహణ కోసం విధివిధానాలను రూపొందించేందుకు సిరిసిల్ల కలెక్టర్‌ చైర్మన్‌గా, వేములవాడ ఆలయ ఈవో కన్వీనర్‌గా పలువురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి మార్గదర్శకాలను రూపొందించామన్నారు.

తన వద్దకు వచ్చే దరఖాస్తులను పరిశీలించమని సంబంధిత ఆఫీసర్లకు సూచిస్తుంటామని, దేవస్థానం అధికారులు రూల్స్​ ప్రకారమే కోడెలను ఇచ్చారని స్పష్టం చేశారు. రాజన్న ఆలయంలోని ప్రతి కోడెకు ట్యాగ్ ఉంటుందని, అటువంటి ట్యాగ్‌లు ఉన్న కోడెలు ఎక్కడా పట్టుబడలేదన్నారు. ఇదిలాఉంటే తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గచ్చిబౌలి సైబర్  క్రైమ్  పోలీసులకు మంత్రి తరపున ఆమె ప్రతినిధి అజయ్  ఫిర్యాదు చేశారు.