నిజామాబాద్‌లో రెండోసారి అర్వింద్ దే విజయం

  • హోరాహోరీ పోరులో కాంగ్రెస్​అభ్యర్థి జీవన్​రెడ్డి ఓటమి
  • బీఆర్​ఎస్​ అభ్యర్థి బాజిరెడ్డి డిపాజిట్​ గల్లంతు

నిజామాబా​ద్​, వెలుగు: నిజామాబాద్​ పార్లమెంట్​ స్థానాన్ని  బీజేపీ కైవసం చేసుకుంది.  ఆ పార్టీ తరపున పోటీ చేసిన అర్వింద్​ ధర్మపురి 1,09,241 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి తాటిపర్తి జీవన్​రెడ్డిపై విజయం సాధించారు. బీఆర్ఎస్​ నుంచి బరిలో దిగిన బాజిరెడ్డి గోవర్ధన్​ డిపాజిట్​ కోల్పోయారు. రెండు రౌండ్ల పోస్టల్​ బ్యాలెట్​ కలిపి 15 రౌండ్లలో జరిగిన ఈవీఎం ఓట్ల లెక్కింపులో బీజేపీకి చెందిన అర్వింద్​ 5,92,318 ఓట్లు, కాంగ్రెస్​ అభ్యర్థి జీవన్​రెడ్డికి 4,83,077 ఓట్లు దక్కగా బీఆర్​ఎస్​ నుంచి పోటీ చేసిన బాజిరెడ్డి గోవర్ధన్​ 1,02,406 ఓట్లతో ఘోర పరాజయం చెందారు.  

కౌంటింగ్​లో 4, 5, 14 రౌండ్లలో మాత్రమే కాంగ్రెస్​ అభ్యర్థికి  లీడ్​రాగా మిగితా ప్రతి  రౌండ్​లో బీజేపీ ఆధిక్యత చాటింది. జీవన్​రెడ్డి సొంత అసెంబ్లీ సెగ్మెంట్​తో పాటు బోధన్​, నిజామాబాద్​ అర్బన్​లో కాంగ్రెస్​కు మెజారిటీ లభించినా మిగిలిన బాల్కొండ, ఆర్మూర్​, నిజామాబాద్​ రూరల్​ అసెంబ్లీ స్థానాలలో కాషాయం రెపరెపలాడింది. కారు పార్టీ అభ్యర్థి బాజిరెడ్డికి ఏ రౌండ్​లో కూడా గౌరవప్రదమైన  ఓట్లు  లభించలేదు. 

మూడు రౌండ్ల లెక్కింపు తర్వాత  ఆశలు వదులుకున్న  బీఆర్​ఎస్​ ఏజెంట్లు సీఎంసీ కాలేజీలోని కౌంటింగ్​ హాల్​ నుంచి వెళ్లిపోయారు. అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్​ కౌంటింగ్​ వైపునకు అసలు రాలేదు. 12 రౌండ్ల తరువాత ఓటమి నిర్థారణ కావడంతో కాంగ్రెస్​ అభ్యర్ధి జీవన్​రెడ్డి కూడా వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వచ్చిన బీజేపీ అభ్యర్థి అర్వింద్​ను కౌంటింగ్​ పరిశీలించారు. 

పోస్టల్​ కౌంటింగ్​ ఫస్ట్​ 

ఉదయం 8 గంటలకు పోస్టల్​ బ్యాలెట్​ కౌంటింగ్​ పూర్తి చేసిన రిటర్నింగ్​ ఆఫీసర్​ రాజీవ్​గాంధీ హనుమంతు తరువాత ఈవీఎం లెక్కింపు షురూ చేయించారు. 15 రౌండ్ల ఈవీఎం కౌంటింగ్​ ముగించాక చివర్లో పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లను కలిపి రిజల్టు అనౌన్స్​ చేశారు. నిజామాబాద్ రూరల్, కోరుట్ల, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో ఆధిక్యం లభించింది.  

కాంగ్రెస్​కు నిజామాబాద్ అర్బన్​, బోధన్, జగిత్యాలలో స్వల్ప మెజారిటీ దక్కింది. బీజేపీ గెలుపును ఆపలేకపోయారు.  బీఆర్ఎస్​కు డిపాజిట్​ దక్కకపోవడంతో అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్​ నారాజ్​ అయ్యారు.  పోలైన మొత్తం ఓట్లలో చెల్లనవి తీసేస్తే ఆరో వంతు ఓట్లు పొందిన అభ్యర్థికి డిపాజిట్​ లభిస్తుంది. అంటే కనీసం 2.05 లక్షల ఓట్లు రావాలి.  బీఆర్​ఎస్​కు కేవలం 1,02,406 ఓట్లు మాత్రమే లభించాయి.