బీజేపీది ముందస్తు వ్యూహమే!

కేంద్రంలో మంత్రి పదవుల కూర్పు చూస్తే బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.  తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు కోసం ముందస్తు వ్యూహంగా దీన్ని పేర్కొనవచ్చు.  పార్లమెంట్ ఎన్నికలలో  తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లను గెలుచుకున్న బీజేపీ  ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చింది.  కిషన్ రెడ్డి  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా గతంలో ఉండగా, ఇప్పుడు ఆ శాఖను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్​కి అప్పజెప్పారు. మరో కీలక బొగ్గు శాఖను కిషన్ రెడ్డికి ఇచ్చారు.  కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి రాష్ట్ర  బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈటల రాజేందర్ కు  రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇస్తారని తెలుస్తున్నది.  పీఎం మోదీతో  సహా 72 మంది మంత్రులుగా ప్రమాణం చేయగా,  మరో తొమ్మిది మందిని మంత్రులుగా నియమించే అవకాశం ఉన్నది. బొగ్గు గనులకు తెలంగాణ చాలా ముఖ్యమైన ప్రాంతం.  సింగరేణి ప్రాంతంలో 12 దాకా అసెంబ్లీ,  ఐదు పార్లమెంట్ స్థానాల మీద బొగ్గు గని కార్మికుల ప్రభావం ఉంటుంది.

సిం గరేణి ప్రాంతంలో  బీజేపీ వీక్​గా ఉన్నది. బీఆర్ఎస్​ కూడా బలంగా లేదు. కోల్ మినిస్టర్ అంటే  కోల్ ఇండియాతో పాటు సింగరేణిలోనూ కీలకంగానే ఉంటారు. అందుకే  వ్యూహత్మకంగా కిషన్ రెడ్డిని నియమించారు. ఇక బండి సంజయ్​కి  కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో బీజేపీలోని ఉత్తర తెలంగాణ శ్రేణుల్లో నూతన ఉత్తేజం కనిపిస్తోంది.  సంజయ్ కి పక్కా  నేల మీది లీడర్​గా పేరున్నది.  ఆయనకు పదవి బీజేపీ వ్యూహమే అనక తప్పదు. చాలా కాలంగా తెలంగాణలో  బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తహతహలాడుతున్నది. అయితే  ఈ ఇద్దరు మంత్రులతో  పార్టీ  వ్యూహానికి తగ్గట్టుగా ఫలితాలు వస్తాయా..రావా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. 

రేవంత్​రెడ్డి అలర్ట్​గా ఉండాలి

కాంగ్రెస్ పార్టీ,  ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి ఉన్నది.  ఒకవైపు ఏపీలో  గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీడీపీ,  తెలంగాణలో ఇంకా బతికే ఉన్నది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, టీడీపీ.. ఈ రెండు పార్టీలు ఒకవైపు  తెలంగాణాలో కాళ్ళు, చేతులు ఆడించే పరిస్థితి చాలా స్పష్టంగా ఉన్నది. టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాజకీయాలు కొత్తవి కావు. ఇప్పుడైతే ఆయన కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. బీజేపీతో కలిసి తెలంగాణాలో పని చేస్తారా?  విడిగానే చేసుకుపోతారా అనేది తేలకున్నా,  తెలంగాణలో టీడీపీ మళ్ళీ పుంజుకోవడానికి చంద్రబాబు కృషి చేయడం మాత్రం మానరు. బీఆర్ఎస్ కూడా చేసిన తప్పులకు చెంపలు వేసుకుని కదిలి, విపక్ష పాత్రను మంచిగా పోషిస్తే తప్ప మనుగడ అసాధ్యం అనేది స్పష్టంగా కనిపిస్తున్నది.

బొగ్గు సంస్థలకు  కేంద్రం బడ్జెట్ కేటాయించాలి

బొగ్గు సంస్థల్లో ఐటీ మాఫీ కోసం చాలాకాలంగా కార్మిక సంఘాలు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి  కార్మికులకు, రాష్ట్ర అసెంబ్లీలోనూ ఐటీ మాఫీ చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. కనీసం  అలవెన్స్​ల  మీద  కోల్ ఇండియా మాదిరి  ఐటీ రీయింబర్స్​మెంట్​ ఇవ్వాలి.   సింగరేణి భవిష్యత్తు  బాగా ఉండాలంటే  కొత్త బొగ్గు బ్లాకులు రావాలి.  మరో 150 సంవత్సరాలు సంస్థ  కొనసాగేవిధంగా  తెలంగాణాలో గోదావరి తీరంలో ఆంధ్రప్రదేశ్ లోని  చింతలపూడి దాకా 10 వేల మిలియన్ టన్నుల బొగ్గు తీయాల్సి ఉన్నది. 60 దాకా బొగ్గు బ్లాకులు రెడీగా ఉన్నాయి. అయితే,  మారిన కేంద్రం పాలసీ ప్రకారం  ఫీజులు కట్టి,  ప్రైవేట్ సంస్థల మాదిరి,  ప్రభుత్వ రంగంలో ఉన్న సింగరేణి,  కోల్ ఇండియా  దాని అనుబంధ సంస్థలు వేలంలో పాల్గొంటే తప్ప బ్లాకులు అలాట్ కావు.  కాబట్టి,  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, బొగ్గు సంస్థల భవిష్యత్తు కోసం బొగ్గు బ్లాక్​ల కేటాయింపు విషయంలో వెసులుబాటు కల్పించాలి. ప్రభుత్వ రంగంలో బొగ్గు సంస్థలు బతికి ఉంటేనే రేపు ఈ ప్రాంతంలో ఉపాధికి అవకాశాలు ఉంటాయి. ఆ దిశగా కేంద్రం కృషి చేయాలి.  

సింగరేణిపై నాయకుల నజర్​

కేంద్ర మంత్రిగా  కిషన్ రెడ్డి  బాధ్యతలు  చేపట్టిన వెంటనే ఆయన మాట్లాడుతూ..  బొగ్గు సరిపడా ఉత్పత్తి చేసి దేశంలో విద్యుత్ కష్టాలు లేకుండా చూస్తానని పేర్కొన్నారు.  తెలంగాణకు గుండెలాంటి  సింగరేణికి, నల్ల నేల ప్రాంతం కార్మిక కుటుంబాలకు  కేంద్ర  బొగ్గుశాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకోవడంతో  ఆశలు చిగురిస్తున్నాయి. కిషన్ రెడ్డి పలుమార్లు సింగరేణిని సందర్శించారు.  బొగ్గు బావుల్లో  నేరుగా దిగి కార్మికుల సమస్యలు, సంస్థ అభివృద్ధి గురించి తెలుసుకునేవారు.  భారత్ జోడో యాత్ర  సందర్బంగా కాంగ్రెస్ నేత సింగరేణి కార్మికులతో కలిసి ముచ్చటించారు.  మాజీ  కేంద్ర మంత్రి  గడ్డం వెంకట స్వామి,  మాజీ ఎంపీ,  ప్రస్తుత చెన్నూర్  ఎమ్మెల్యే  గడ్డం వివేక్ వెంకట్ స్వామి లాంటి వాళ్ళు, సీఎం రేవంత్ రెడ్డి,  డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,  టీజేఎస్​ అధ్యక్షుడు  ప్రొఫెసర్  కోదండరామ్,  పౌరహక్కుల సంఘం నేత బాలగోపాల్,  పురుషోత్తం,  ప్రజా యుద్ధ నౌక గద్దర్,  ప్రస్తుత సీపీఐ  పక్ష నేత కూనంనేని సాంబశివరావు ఇలా ఎందరికో సింగరేణితో  అనుబంధం ఉన్నది. ప్రస్తుతం ఉన్న కేంద్ర మంత్రుల్లో అందరికన్నా ఎక్కువ కిషన్ రెడ్డికి సింగరేణి మీద అవగాహన ఉంది. అసెంబ్లీలోనూ చాలాసార్లు సింగరేణి కార్మికులు, సంస్థ సమస్యల మీద కిషన్ రెడ్డి స్పందించారు. 

- ఎండి మునీర్, సీనియర్ జర్నలిస్ట్