నోరు అదుపులో పెట్టుకో.. కంగనపై బీజేపీ నాయకత్వం ఆగ్రహం

  • వివాదాస్పద వ్యాఖ్యలు చేయకు

న్యూఢిల్లీ: నోరు అదుపులో పెట్టుకోవాలంటూ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు ఆ పార్టీ నాయకత్వం తీవ్రంగా చీవాట్లు పెట్టింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికింది. ఈ మేరకు సోమవారం పార్టీ నాయకత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమం.. భారత్ లోనూ బంగ్లాదేశ్ లాగే సంక్షోభాన్ని సృష్టించి ఉండేదని, కేంద్రం సరైన చర్యలు తీసుకోవడంతో మనకు అలాంటి పరిస్థితి రాలేదని కంగన అంతకుముందు పేర్కొంది.

ఈ వ్యాఖ్యలు సోషల్  మీడియాలో వైరల్ గా మారడంతో బీజేపీ నాయకత్వం స్పందించింది. ‘‘విధానపరమైన నిర్ణయాల మీద పార్టీ తరపున మాట్లాడేందుకు కంగనకు అధికారం లేదు. అలా మాట్లాడేందుకు ఆమెకు అనుమతి కూడా ఇవ్వలేదు. భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని ఆమెకు ఆదేశాలు జారీచేశాం” అని బీజేపీ నాయకత్వం ఆ ప్రకటనలో తెలిపింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని హర్యానా, పంజాబ్ కు చెందిన బీజేపీ నేతలు కూడా ఆమెకు సూచించారు.

‘‘రైతుల విషయాలపై మాట్లాడే పని కంగనది కాదు. రైతుల ఉద్యమంపై ఆమె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతం. కేంద్ర ప్రభుత్వం రైతు అనుకూల ప్రభుత్వం. కంగన కూడా ప్రతిపక్ష నేతల్లాగే మాట్లాడింది. మతపరమైన, సున్నితమైన అంశాల మీద ఆమె మాట్లాడరాదు” అని పంజాబ్  బీజేపీ లీడర్  హర్జిత్  గ్రేవాల్  అన్నారు. మరోవైపు కంగన వ్యాఖ్యలపై కాంగ్రెస్  నేత రణ్ దీప్  సుర్జేవాలా స్పందించారు. ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని, త్వరగా కోలుకోవాలని ఆయన చురకలంటించారు.