ఎన్నికల హామీలను విస్మరించిన ప్రభుత్వాలు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య

 కోరుట్ల, వెలుగు: కేంద్రంలో బీజేపీ, రాష్ర్టంలో కాంగ్రెస్​ప్రభుత్వాలు  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించాయని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల లోని సినారె కళా భవనం​లో సీపీఐ(ఎం) జిల్లా మూడో మహాసభలు నిర్వహించారు.ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో 3 నల్ల చట్టాలను తీసుకువచ్చిందని, వాటిని రద్దు చేయాలని రైతులు ఆందోళన  చేశారని గుర్తు చేశారు. 

బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలు, నియంత పాలన కొనసాగిస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్​ పరం చేస్తూ అదానీ, అంబానీలకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు.ప్రధాని ఆవాస్​ యోజన కింద పేదలకు ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.నల్ల ధనాన్ని వెలికి తీసి పేదల ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని నమ్మించారని దుయ్యబట్టారు.6 గ్యారెంటీలు, 420 వాగ్దానాలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసిందని మిగతావి నెరవేర్చలేదన్నారు.  

కోరుట్ల, జగిత్యాలలో ప్రభుత్వ భూముల్లో  పేదలు వేసుకున్న గుడిసెలను అన్యాయంగా అధికారులు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రభుత్వ భూములను వదిలే ప్రసక్తి లేదని ,ఇళ్ల పట్టాలు ఇచ్చే వరకు గుడిసెలు వేసుకొని ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టి,​  సీపీఐ(ఎం) పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతనంగా జిల్లా కమిటీ ని ఎన్నుకున్నారు.

 జిల్లా కన్వీనర్ గా శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులుగా తిరుపతి నాయక్,  సులోచన,  చౌదరి, శారద,  రమేశ్​, సురేశ్​, మహిపాల్ ,  వినోద్,చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. అంతకు ముందు శికారి పెట్రోల్​ బంకు నుంచి సినారె కళా భవనం వరకు  ప్రదర్శన ర్యాలీ జరిపి ఎర్ర జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ, శ్రీకాంత్, సీఈఓ సుందర్, జిల్లా కన్వీనర్ తిరుపతి నాయక్, చౌదరి,సులోచన, శారద, భగత్, భూషణ్, రమేశ్​,  సురేశ్​, పద్మ, మహిపాల్ , రజియా సుల్తానా, శంకర్, రమేశ్, పోశయ్య పాల్గొన్నారు.