బీఆర్ఎస్​ టూ కాంగ్రెస్, బీజేపీ .. కాంగ్రెస్​కు పెరుగుతున్న ఎంపీటీసీల బలం

  • ప్రధాన పార్టీల్లో జోరందుకున్న చేరికలు
  • బీఆర్ఎస్​ను వీడుతున్న మెజార్టీ లీడర్లు

మహబూబ్​నగర్, వెలుగు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్, లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్, బీజేపీల్లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. దీంతో ఉమ్మడి మహబూబ్​నగర్​ లో కారు పార్టీ క్రమంగా ఖాళీ అవుతోంది.

కాంగ్రెస్​లోకి భారీగా వలసలు..

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్​ పార్టీ నుంచి పెద్ద మొత్తంలో క్యాడర్​ బయటకు వచ్చింది. ముఖ్యంగా అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వ తీరు, ఆ ప్రభుత్వంలోని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల అహంకార ధోరణి వల్ల క్యాడర్​ పార్టీలో ఇమడలేకపోయింది. తరచూ అవమానించడం, అందరి ముందు దుర్భాషలాడడంతో చాలా మంది ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్  పార్టీలో చేరారు. ఆ తర్వాత చేరికలకు బ్రేక్​ పడింది. అయితే, ఇప్పుడు ఎన్నికల సీజన్​ మొదలు కావడంతో బీఆర్ఎస్​తో పాటు బీజేపీ లీడర్లు హస్తం గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, జి.మధుసూదన్​ రెడ్డి, వాకిటి శ్రీహరి సమక్షంలో మండలాల నుంచి ఎంపీటీసీలు, వైస్​ ఎంపీపీలు, ఇతర లీడర్లు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. రెండు రోజుల కింద మాజీ ఎంపీ ఏపీ జితేందర్​రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్​లో చేరారు. ఆయన కొడుకు ఏపీ మిథున్​ రెడ్డి కూడా తండ్రి బాటలోనే కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. జితేందర్​రెడ్డి రాకతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్​కు మరింత  బలం చేకూరినట్లైంది. అయితే ఇదే సమయంలో బీజేపీలోకి కూడా వలసలు పెరుగుతున్నాయి. మహబూబ్​నగర్​ పార్లమెంట్​ పరిధిలో ఆ పార్టీ క్యాండిడేట్​ డీకే అరుణ అపోజిషన్​ పార్టీల్లోని అసంతృప్తులను పార్టీలోకి ఆహ్వానించి, వారి మద్దతును కూడగట్టుకుంటున్నారు.

కాంగ్రెస్​కు పెరుగుతున్న ఎంపీటీసీల బలం..

కాంగ్రెస్​కు ఎంపీటీసీల బలం పెరుగుతోంది. మహబూబ్​నగర్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి బై ఎలక్షన్స్​ జరుగుతుండగా, ఈ ఎన్నికల్లో ఎంపీటీసీల ఓట్లు గంపగుత్తగా ఎవరికి పడితే వారినే విజయం వరించనుంది. ఇటీవల ఈ స్థానానికి 16 మంది నామినేషన్లు వేయగా, మూడు తిరస్కరణకు గురయ్యాయి. 10 మంది విత్​డ్రా చేసుకున్నారు. కాంగ్రెస్​ నుంచి యువ వ్యాపారవేత్త మన్నె జీవన్​ రెడ్డి, బీఆర్ఎస్​​నుంచి మాజీ జడ్పీ వైస్​ చైర్మన్​ నవీన్​ రెడ్డి, ఎంపీటీసీల సంఘం తరుపున ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడీల కుమార్ గౌడ్  పోటీకి రెడీ అయ్యారు.

అయితే గడీల కుమార్​గౌడ్​ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారనే విషయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు యెన్నం, జి.మధుసూదన్​ రెడ్డి తెలుసుకునే ప్రయత్నం చేశారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ఎంపీటీసీలకు గౌవరం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పలు సమస్యలు కూడా వీరి దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం.

ఎంపీటీసీల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పినట్లు తెలిసింది. ఇటీవల పాలమూరులో జరిగిన సభలో సీఎం రేవంత్​ రెడ్డి ఎంపీటీసీలు మద్దతు తెలుపాలని, మద్దతిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చిన నేపథ్యంలో కుమార్​ గౌడ్​ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీటీసీలు మన్నె జీవన్​రెడ్డికి సపోర్ట్​ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

బీఆర్ఎస్​ సైలెన్స్..

బీఆర్ఎస్​ పార్టీ ఖాళీ అవుతోంది. ఆ పార్టీ నుంచి మండలాలకు చెందిన క్యాడర్​ ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతోంది. ఇప్పటికే హన్వాడ, చిన్నచింతకుంట, అడ్డాకుల, మూసాపేట, మక్తల్​ మండలాలకు చెందిన లీడర్లతో పాటు పార్టీకి అనుబంధంగా ఉన్న సంఘాల లీడర్లు కూడా కండువాలు మార్చుకుంటున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ ఘోర పరాభావం చవిచూసింది. అప్పటి నుంచి ఈ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. ఏదైనా సమస్య వస్తే చెప్పుకునేందుకు లీడర్లు అందుబాటులో లేకపోవడంతో మండల స్థాయి క్యాడర్​ ప్రత్యామ్నాయం చూసుకుంటోంది. దాదాపు వారం రోజులుగా జిల్లాలో జాయినింగ్స్​ జోరు పెరిగినా.. ఇంత వరకు ఆ పార్టీల మాజీలు క్యాడర్​ను బుజ్జగించే ప్రయత్నాలు చేయట్లేదు.