కోట్లు ఖర్చు చేసినా..తరగని చెత్త..కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో విఫలమైన బయోమైనింగ్‌‌‌‌ 

  • మూడు కార్పొరేషన్లలో రూ. 70 కోట్లకుపైగా ఖర్చు
  • కరీంనగర్‌‌‌‌లో పనిచేయని యంత్రాలు, ఖమ్మం, వరంగల్‌‌‌‌లో స్లోగా పనులు
  • రూ. కోట్లు వెనకేసుకున్న కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థలు
  • అగ్రిమెంట్ ప్రకారం పనులు చేయకున్నా పట్టించుకోని పాలకవర్గాలు

కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలోని కరీంనగర్, గ్రేటర్‌‌‌‌ వరంగల్, ఖమ్మం మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్లలోని డంపింగ్‌‌‌‌ యార్డుల్లో చెత్త నిల్వలను తొలగించేందుకు గత సర్కార్‌‌‌‌ చేపట్టిన బయోమైనింగ్‌‌‌‌ విఫలమైంది. మూడు, నాలుగేళ్లుగా వేస్టేజ్‌‌‌‌ను రీసైక్లింగ్ చేస్తున్నా.. చెత్త గుట్టలు తరగకపోగా మరింత పెరుగుతున్నాయి. కరీంనగర్‌‌‌‌లో రూ.16.50 కోట్లు, గ్రేటర్ వరంగల్‌‌‌‌లో రూ.36 కోట్లు, ఖమ్మంలో రూ.18 కోట్లు వెచ్చించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

చెత్త రీసైక్లింగ్‌‌‌‌ పేరిట కోట్లు వెనకేసుకున్న బయో మైనింగ్‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థలు చేతులెత్తేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కరీంనగర్‌‌‌‌లోని బయోమైనింగ్ యంత్రాలు రిపేర్‌‌‌‌కు రావడంతో ఆర్నెళ్ల క్రితమే చెత్త రీసైక్లింగ్ నిలిపివేశారు. ఖమ్మం, వరంగల్‌‌‌‌లో ఆగుతూ.. సాగుతోంది.

రెండున్నరేళ్లయినా కరీంనగర్‌‌‌‌లో తరగని నిల్వలు

కరీంనగర్‌‌‌‌ నగరంలో మానేరు నది ఒడ్డున ఐదు దశాబ్దాలుగా వేస్తున్న చెత్తతో డంపింగ్‌‌‌‌ యార్డు గుట్టలను తలపిస్తోంది. పేరుకుపోయిన చెత్తను తగ్గించడంతో పాటు రీసైక్లింగ్ ద్వారా మళ్లీ వినియోగించేలా కరీంనగర్ మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ బయోమైనింగ్‌‌‌‌ చేయాలని నిర్మయించి చెన్నైకి చెందిన ఓ సంస్థకు పనులు అప్పగించింది. ఇందుకోసం స్మార్ట్ సిటీ నిధుల కింద రూ.16 కోట్లు మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న సంస్థ 2022 జూన్‌‌‌‌ నుంచి చెత్తను ప్రాసెస్‌‌‌‌ చేయడం ప్రారంభించింది.

అగ్రిమెంట్ ప్రకారం డంపింగ్‌‌‌‌ యార్డును ఏడాదిలో పూర్తిగా క్లీన్ చేసి ఇవ్వాలి. కానీ రెండున్నరేళ్లయినా టార్గెట్‌‌‌‌ను రీచ్‌‌‌‌ కాలేకపోయింది. ఆర్నెళ్లుగా బయోమైనింగ్‌‌‌‌ పూర్తిగా నిలిచిపోయింది. రూ.16 కోట్లు వెచ్చించినా ఫలితం లేకుండా పోయింది. వేసవిలోనేగాక వర్షాకాలం, చలికాలంలోనూ డంపింగ్ యార్డు మండుతూనే ఉంది. దాని నుంచి వచ్చే పొగ ఆటోనగర్, కోతిరాంపూర్‌‌‌‌ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

ఖమ్మంలో నత్తనడకన బయోమైనింగ్.. 

ఖమ్మం మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌కు దానవాయిగూడెంలో 38 ఎకరాల్లో డంపింగ్‌‌‌‌ యార్డు ఉంది. చెత్త గుట్టలుగా పేరుకుపోవడంతో బయో మైనింగ్‌‌‌‌ చేసి యార్డు మొత్తాన్ని క్లీన్‌‌‌‌ చేయించేందుకు రూ. 18 కోట్లతో ఓ సంస్థకు పనులు అప్పగించారు. గతేడాది ఏప్రిల్ 11న బయోమైనింగ్ ప్రారంభమైంది. ఈ సంస్థ పదెకరాల మేర వ్యర్ధాలను తొలగించి ఆ స్థలాన్ని కేఎంసీ ఆఫీసర్లకు అప్పగించింది. ఆ తర్వాత బయోమైనింగ్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.  

మూడేళ్లయినా సగం చెత్త కూడా తీయలే..

గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌ మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ పరిధిలో మడికొండలోని సుమారు 32 ఎకరాల్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. ఇందులో 5 లక్షల టన్నులకు పైగా వ్యర్థాలు పోగయ్యాయి. స్మార్ట్‌‌‌‌ సిటీ స్కీమ్‌‌‌‌లో భాగంగా రూ.37 కోట్లు కేటాయించి డంప్‌‌‌‌యార్డ్‌‌‌‌లో బయోమైనింగ్‌‌‌‌ పనులు ప్రారంభించారు. 2021 డిసెంబర్‌‌‌‌లో పనులు ప్రారంభం కాగా అగ్రిమెంట్‌‌‌‌ ప్రకారం ఏడాదిలోపు మూడు లక్షల టన్నుల చెత్తను రీసైక్లింగ్‌‌‌‌ చేయాల్సి ఉంది. కానీ మూడేళ్లు గడిచినా సగం లక్ష్యాన్ని కూడా చేరుకోలేదు. 

ఎక్కడా సక్సెస్ కాలే 

రాష్ట్రంలో కార్పొరేషన్లతో పాటు కొన్ని మున్సిపాలిటీల్లోని డంపింగ్‌‌‌‌ యార్డుల్లో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన బయోమైనింగ్ ఎక్కడా సక్సెస్ కాలేదు. కోట్లాది నిధులు వృథా అయ్యాయి. కరీంనగర్‌‌‌‌లో మిషన్లు పాడయ్యాయని వదిలేసి వెళ్లిపోయారు. గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ శాఖలో బయోమైనింగ్ పేరిట జరిగిన నిధుల దుర్వినియోగంపై ఎంక్వైరీ చేయాలి. 

– అమీర్, సామాజిక కార్యకర్త, కరీంనగర్