గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవా బయలుదేరిన ఓ కుటుంబం దట్టమైన అడవిలో చిక్కుకుని రాత్రంతా అక్కడే గడపాల్సిన పరిస్థితి వచ్చింది. బీహార్‌కు చెందిన రాజ్‌దాస్ రంజిత్‌దాస్ కుటుంబం కారులో గోవా బయలుదేరింది. చిన్నారులు సహా మొత్తం ఆరుగురు ఉన్నారు. మ్యాప్స్ పెట్టుకుని బయలుదేరిన వీరు కర్నాటకలోని బెళగావి జిల్లాలో ఉన్న భీమ్‌గఢ్ వైల్డ్ లైఫ్ జోన్‌లో 7 కిలోమీటర్లు లోపలికి వెళ్లిపోయారు. అక్కడ సిగ్నల్స్ లేకపోవడంతో బయటపడే మార్గం లేక కారు లాక్ చేసుకుని రాత్రంతా అందులోనే గడిపారు. మరుసటి రోజు ఉదయం మొబైల్ సిగ్నల్ కోసం దగ్గరదగ్గర నాలుగు కిలోమీటర్లు రంజిత్ నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.
మొబైల్ నెట్ వర్క్ దొరికిన వెంటనే ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్ 112కి కాల్ చేశారు. ఆ ఫోన్ కాల్కు స్పందించి స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఫ్యామిలీ సేఫ్ గా ఆ అడవి నుంచి బయటపడ్డారు. కానీ.. ఆ రాత్రంతా బిక్కుబిక్కుమంటూ అడవిలోనే గడిపారు. చుట్టూ చీకటి. కనుచూపు మేరలో మనిషి జాడ కనిపించడం లేదు. ఆ పరిస్థితి తలుచుకుంటుంటేనే భయమేసిందని రంజిత్‌దాస్ చెప్పారు. డిసెంబర్ 4న ఈ ఘటన జరిగింది. ఈ ఫ్యామిలీకి మొబైల్ నెట్ వర్క్ దొరకడం అదృష్టమని, ఎందుకంటే ఇటీవలే ఈ అడవిలో ఒక రైతుపై ఎలుగుబంటి దాడి చేయగా తీవ్ర గాయాలపాలైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ మధ్య గూగుల్ మ్యాప్స్ ఫెయిల్ అయిన ఘటనలు చాలానే వెలుగుచూశాయి.
Also Read :- ఈ మార్పులు చేసుకోండి చాలు.. మెదడు చురుగ్గా ఉంటుంది
యూపీలో గూగుల్ మ్యాప్స్ను నమ్ముకొని ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెలిసిందే. గూగుల్ మ్యాప్స్ను ఫాలో అవుతూ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై నుంచి కారు రామ్ గంగా నదిలో పడిపోవడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ను ఫాలో అవుతూ గుడ్డిగా వెళ్లడంతో కారు రామ్ గంగా నదిలో పడి ఫరుక్కాబాద్ జిల్లాకు చెందిన నితిన్, అజిత్, అమిత్ అనే ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. వీరిలో నితిన్, అజిత్ సోదరులు కాగా.. మరో వ్యక్తి అమిత్ మైన్పురి జిల్లాకు చెందిన వ్యక్తి. నోయిడా నుంచి ఫరీద్పూర్కు ఓ పెళ్లికి వెళుతుండగా రాయబరేలీ వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గూగుల్ మ్యాప్ రీజినల్ అధికారిపై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత శిక్షాస్మృతి సెక్షణ్ 105 కింది కేసు నమోదు చేసినట్లు బూదాన్ జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు.