జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. అయితే అయోధ్య రామ మందిరం కంటే ఐదు రెట్లు పెద్ద రామ మందిర నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఈ ఆలయాన్ని కంబోడియాలోనో లేక అమెరికాలోనో కాదు, భారత్‌లో ఎక్కడ నిర్మిస్తున్నారో తెలుసుకుందాం.
బీహార్, తూర్పు చంపారన్‌లోని కైత్వాలియా (కొంతమంది కథ్వాలియా అంటారు)లో ప్రపంచంలోనే అతి పెద్ద రామాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయం అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీరామ మందిరం కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుంది. నవంబర్ 13, 2013న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ఆలయ భవిష్యత్తు నమూనాను ఆవిష్కరించారు. దీని పేరు విరాట్ రామాయణ దేవాలయం. మే 2023లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ దేవాలయం అయోధ్య దేవాయలం కంటే ఐదు రెట్లు పెద్దది
ఆలయం పూర్తిగా నిర్మించిన తర్వాత అయోధ్య నుంచి జనక్‌పూర్ వైపు వెళ్లేటప్పుడు ఈ ఆలయం కనిపిస్తుంది. ప్రస్తుతం దీని నిర్మాణం వేగంగా జరుగుతోంది. 2025 చివరి నెల నాటికి ఆలయం సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ కొత్త దేవాలయం, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దేవాలయం కాబోతోంది. ఆలయ నిర్మాణ ప్రణాళిక ప్రకారం, ఈ ఆలయం 125 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంటుంది. దీన్ని 200 ఎకరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆలయ వైశాల్యం 3.67 లక్షల చదరపు అడుగులు. ఈ భారీ రామాయణ దేవాలయం పొడవు 1080 అడుగులు, వెడల్పు 540 అడుగులు. ఈ ఆలయాన్ని మొత్తం 3,102 స్తంభాలతో నిర్మిస్తున్నారు.
తిహారి (తూర్పు చంపారన్)లోని కైత్వాలియాలో నిర్మించే విరాట్ రామాయణ దేవాలయ ప్లాన్ 2012లో ప్రారంభమైంది. ఇది పాట్నాలోని మహావీర్ టెంపుల్ యొక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. . ఈ ఆలయంలో 108 అడుగుల ఎత్తులో ఐదు శిఖరాలు ఉంటాయి. ఈ దేవాలయం యొక్క ఎత్తైన శిఖరం 405 అడుగులు ఉంటుంది. అలాగే 180 అడుగుల ఎత్తులో నాలుగు శిఖరాలు ఉంటాయి. ఈ ప్రధాన ఆలయం ముందు, 20,000 మంది సామర్థ్యంతో భారీ ప్రార్థనా మందిరం కూడా ఉంటుంది.
కైత్వాలియా గ్రామంలోని కేసరియా-చైకా రహదారి పక్కన ఈ విరాట్ రామాయణ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రదేశం వైశాలి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో, పాట్నా నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. కంపూచియా లేదా కంబోడియాలోని అంగ్‌కోర్ వాట్ రూపకల్పన ఆధారంగా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయ ప్రధాన శిఖరం అంగ్‌కోర్ వాట్ యొక్క 215 అడుగుల శిఖరం కంటే దాదాపు రెట్టింపు ఉంటుంది. అంటే 405 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది పూర్తయినప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన నిర్మాణం అవుతుంది. మొత్తం నిర్మాణానికి ₹500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ ఆలయం అంగ్‌కోర్ వాట్ కంటే రెట్టింపు ఎత్తు, పరిమాణం ఉండేలా ప్లాన్ ఉంది. ఈ దేవాలయాల సమూహంలో, మొత్తం 18 దేవతలు, 18 గర్భాలయాలు ఉంటాయి, వీటిలో ప్రధాన దేవత శ్రీరాముడు, స్వామి మధ్య శిఖరం కింద కూర్చుంటారు. అక్కడే ఆయన సహచరులైన సీతాదేవి, లవకుశుల విగ్రహాలను ప్రతిష్టిస్తారు.
బీజేపీ ఎమ్మెల్యే సచింద్ర సింగ్ ఇందులో చురుగ్గా పాల్గొన్నప్పటికీ రాజకీయ ప్రభావంతో ఆలయ పనులకు అంతరాయం ఏర్పడింది. మాజీ IPS అధికారి, మహావీర్ స్థాన్ ట్రస్ట్ కమిటీ కార్యదర్శి ఆచార్య కిషోర్ కునాల్, రాజకీయాలకు దూరంగా ఉంటూనే పనిని ముందుకు తీసుకెళ్తున్నారు.
2025 మహాశివరాత్రి రోజున ఆలయంలో అతిపెద్ద శివలింగాన్ని ప్రతిష్టిస్తామని కిషోర్ కునాల్ చెప్పారు. 33 అడుగుల వెడల్పు 200 మెట్రిక్ టన్నుల బరువుగల శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించనున్నారు. చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో నల్ల గ్రానైట్ రాయితో సహస్రలింగం కూడా చెక్కబడుతుందని ఆయన తెలియజేశారు.
విరాట్ రామాయణ ఆలయ నిర్మాణ ప్రణాళిక ప్రకారం, ఇది కంపూచియా (కంబోడియా)లోని అంగ్‌కోర్ వాట్ ఆలయానికి ప్రతిరూపంలా ఉంటుంది. అలాగని ఇది పూర్తిగా ఆంగ్‌కోర్ వాట్‌కి కాపీ కాదు. దీని రూపకల్పన అంగ్‌కోర్ వాట్, రామేశ్వరం, మీనాక్షి దేవాలయాల నమూనాల ప్రకారం తయారు చేశారు.