ఒకేరోజు 1,500 మంది ఖైదీలకు శిక్ష తగ్గించిన బైడెన్.. మరో 39 మందికి క్షమాభిక్ష

వాషింగ్టన్: అమెరికా చరిత్రలో ఏ  అధ్యక్షుడూ తీసుకోని నిర్ణయాన్ని ప్రెసిడెంట్  జో బైడెన్  తీసుకున్నారు. ఒకేరోజు 1,500 మంది ఖైదీలకు ఆయన శిక్ష తగ్గించారు. అలాగే, 39 మందికి క్షమాభిక్ష పెట్టారు. కరోనా సమయంలో జైలు నుంచి విడుదలై గృహ నిర్బంధంలో ఉన్న ఆ 1,500 మందికి శిక్షను తగ్గించారు. ఈ మేరకు గురువారం బైడెన్  ఓ ప్రకటన విడుదల చేశారు. వచ్చే కొద్ది వారాల్లో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటానని, క్షమాభిక్ష పిటిషన్లను రివ్యూ చేస్తానని తెలిపారు.

‘‘ఆశయాలు, సెకండ్  చాన్సుల ఆధారంగా అమెరికా నిర్మితమైంది. వివిధ కేసుల్లో ఇప్పటికే శిక్ష ఎదుర్కొన్న వారికి క్షమాభిక్ష పెట్టే అధికారం ప్రెసిడెంట్ గా నాకు ఉంది. వారు కూడా రోజువారి జీవితం గడుపుతూ దేశాభివృద్ధికి తోడ్పడాల్సిన అవసరం ఉంది” అని బైడెన్  అన్నారు. కాగా.. మాజీ అధ్యక్షుడు బరాక్  ఒబామా 2017లో  అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే ముందు ఒకేరోజు 330 మందికి క్షమాభిక్ష పెట్టారు.