తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

యాదాద్రి, వెలుగు : కొమురవెల్లి మల్లన్న సాగర్​ నుంచి ఏర్పాటు చేసే పైపులైన్​తో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్టలో పైలాన్​ఆవిష్కరణ సందర్భంగా వారు మాట్లాడారు. రూ.210 కోట్లతో 16 కిలో మీటర్లు ఏర్పాటు చేసే పైప్​లైన్​ద్వారా ఆలేరు, భువనగిరి, జనగామ నియోజకవర్గాల్లోని 526 గ్రామాల్లో తాగునీరు అందుతుందన్నారు. 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు.

 మూసీ ప్రక్షాళన కోసం ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి పాదయాత్ర చేశారన్నారు. భువనగిరి ఎమ్మెల్యే  కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మూసీ కారణంగా భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయని తెలిపారు. మూసీ పునరుజ్జీవం జరిగితే మంచినీరు అందుతుందని, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి పాల్గొన్నారు.