మూసీ పునరుజ్జీవంపై ప్రజలను కదిలిస్తాం

  • భువనగిరి ఎమ్మెల్యే కుంభం 

యాదాద్రి, వెలుగు : మూసీ పునరుజ్జీవంపై ప్రజలను ఏకం చేసి కదిలిస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి తెలిపారు. శనివారం భువనగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్​ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం కార్యాచరణ ప్రారంభిస్తే రాజకీయం లబ్ధికోసం బీఆర్ఎస్, బీజేపీ అడ్డం పడుతున్నాయని ఆరోపించారు. 

జిల్లాకు చెందిన బీర్ల ఐలయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, మందుల సామేల్, వేముల వీరేశం, ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డితో కలిసి ఐక్య కార్యాచరణ ప్రారంభిస్తామని తెలిపారు. నియోజకవర్గాల్లో అందరం కలిసి మూసీ ప్రక్షాళన ఆవశ్యకతపై ప్రజలకు వివరిస్తామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్​ఆడుతున్న నాటకాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. మూసీ ప్రక్షాళన జరిగితే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకే ఉపయోగమని తెలిపారు. 

కాటమయ్య కవచం పంపిణీ..

గీత కార్మికుల రక్షణే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలను అందించి మాట్లాడారు. కల్లు గీయడానికి తాటి చెట్లు ఎక్కే గీత కార్మికులకు ప్రమాదం జరగకుండా ఉండడానికే ఈ కవచం అందిస్తున్నామని తెలిపారు. అనంతరం భువనగిరి మండలం అనాజీపురం, నందనం, బొల్లేపల్లి, సూరేపల్లి, ఆకుతోట బావితండా, పీబీ తండా గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమాల్లో భువనగిరి మున్సిపల్​చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పోత్నక్ ప్రమోద్​కుమార్​పాల్గొన్నారు.