పరిచయం: ఆ క్యారెక్టర్స్​ కోసం కష్టపడాల్సిందే!

నా ఫస్ట్  సినిమా తర్వాత సోషల్​ మీడియాలో నన్ను చాలా ట్రోల్ చేశారు. కామెంట్స్ చదివేదాన్ని. కానీ, ఇప్పుడు అవన్నీ పట్టించుకోవట్లేదు. లావు పెరగడానికి నాన్​ వెజ్ బాగా తిన్నా. ఇప్పుడు నేను వెజి​టేరియన్​గా మారిపోయా. సోంచిరియా సినిమాలో నాది ఇల్లాలి పాత్ర. ఆ పాత్ర కోసం గన్​ ఫైరింగ్ నేర్చుకున్నా. ‘సాంద్​ కి ఆంఖ్’​ సినిమాలో షార్ప్​ షూటర్ క్యారెక్టర్​ చేశా. అందుకు ఇద్దరు ఆడవాళ్ల దగ్గర నేను గన్​ షూటింగ్ నేర్చుకున్నా. ఆ టైంలో ప్రోస్తటిక్ మేకప్​ వల్ల స్కిన్​ అలర్జీ వచ్చింది. 

భూమి పెడ్నేకర్..  
 

బాలీవుడ్ నటి. మొదటి సినిమా ‘దమ్​ లగాకే హైషా’లో బొద్దుగా కనిపించిన భూమి ఆ పాత్రకోసం దాదాపు 30 కిలోలు పెరిగిందట! ఆ తర్వాత ఆరు నెలల్లో 25 కేజీలు తగ్గిపోయింది కూడా. అప్పటి నుంచి ఆమె ఎంచుకునే క్యారెక్టర్స్​ ఛాలెంజింగ్​గానే ఉంటున్నాయి. ఆ కోవకి చెందిందే ఈ మధ్య రిలీజ్​ అయిన ‘భక్షక్’​. ఆమె కెరీర్​ ఇంట్రెస్టింగ్​గా మొదలైంది.  ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

‘‘మాది ముంబై. నేను పుట్టిపెరిగింది అక్కడే. చిన్నప్పుడు జుహులోని ‘ఆర్య విద్యా మందిర్’​ స్కూల్లో చదివా. మార్కులు బాగా వచ్చేవి. నాకు చిన్నప్పటి నుంచే నటించాలని ఉండేది. అలంకరణ, మేకప్ వంటివి చాలా ఇంట్రెస్ట్. అందుకని నాకు పదిహేనేండ్లు వచ్చాక మా పేరెంట్స్ ‘విజిలింగ్​ ఉడ్స్ ఇంటర్నేషనల్​’ అనే యాక్టింగ్​ స్కూల్​లో వేశారు. నన్ను అందులో చేర్చడం కోసం స్టడీ లోన్ కూడా తీసుకున్నారు అమ్మా వాళ్లు. కానీ, నేను క్లాసులకు సరిగా వెళ్లేదాన్ని కాదు. దాంతో స్కూల్​ నుంచి నన్ను పంపించేశారు. నా యాక్టింగ్ కోర్స్​ కోసం చేసిన లోన్ పెండింగ్​లోనే ఉంది. అది నా తలపై చాలా భారంగా అనిపించింది. దాన్ని తీర్చడానికి నేను ‘యశ్​​ రాజ్​ ఫిల్మ్స్​’లో అసిస్టెంట్ కాస్టింగ్​ డైరెక్టర్​గా చేరా. ఏడాదిన్నరలో ఆ లోన్​ మొత్తం తీర్చేశా. ఆ తర్వాత కూడా ఆరేండ్లు అదే కంపెనీలో పనిచేశా. 

మొదటి అవకాశం

కొత్త అమ్మాయి, బొద్దుగా ఉండాలి అని ఒక క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారు మూవీ టీం. ఆ టైంలో నేను ఫిల్మ్ ఆర్గనైజేషన్​లో పనిచేస్తున్నా. అక్కడ నన్ను చూసి ‘సినిమాలో నటిస్తావా?’ అని అడిగారు. ఆడిషన్స్​​ కోసం మూడు నెలలు పట్టింది. ఆ టైంలో రోజూ ఉదయం రెండు నుంచి మూడు గంటలు ఆడిషన్ ఇచ్చేదాన్ని. ఆ తర్వాత షార్ట్​ లిస్ట్​ చేసిన వాళ్లని డైరెక్టర్ ఆడిషన్ చేసేవాళ్లు. అలా రోజూ ఒకటే చెప్పేదాన్ని. మైండ్​లో ఎన్నో ఆలోచనలు వస్తుండేవి. ఏం జరుగుతుందో అర్థం అయ్యేది కాదు. కానీ, యాక్టర్ అయ్యేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదు అనుకునేదాన్ని. అదొక్కటే నా మైండ్​లో బలంగా ఉంది. చివరికి ఆ అవకాశం నాకు రావడంతో నా ఫిల్మ్ కెరీర్ మొదలైంది.

ఆ పాత్ర కోసం బరువు..

ఆ రోల్ కోసం నేను బరువు పెరిగా. చిన్నప్పట్నించీ నేను బొద్దుగానే ఉండేదాన్ని. కానీ, క్యారెక్టర్ కోసం  దాదాపు 30 కేజీలు పెరిగా. అందుకోసం నాన్ వెజ్​ ఎక్కువగా తిన్నా. బటర్​ నాన్, బటర్ చికెన్​, పిజ్జా, దాల్ మఖనీ, కేక్స్, స్వీట్స్ తినేదాన్ని. ‘గ్రాము కూడా తగ్గకూడదు’ అని డైరెక్టర్​ చెప్పారు. అందుకోసం షూటింగ్​ టైంలో కూడా సెట్​లో ఉన్నప్పుడు ఏదో ఒకటి తింటుండేదాన్ని. అలా 65 నుంచి 96 కేజీలకు వచ్చా. బరువు పెరిగేందుకు అన్​ హెల్దీ ఫుడ్ తిన్నా. అది తినేటప్పుడు నాకు ఇది తినాలి, ఇది తినకూడదు అని తెలియలేదు. 

నిజానికి హెల్దీగా వెయిట్ పెరగొచ్చనే విషయం నాకు తెలియదు అప్పటికి. మా అమ్మ ‘‘అలా తినకు. ఆపేయ్’’​ అని చెప్పేది. నేను వినేదాన్ని కాదు. అప్పుడంతా నాకు సినిమా అవకాశం వచ్చిందనే ఎగ్జైట్​మెంట్ మాత్రమే ఉండేది​. నాకు నచ్చింది నేను చేయబోతున్నా. అందుకోసం ఈ పని చేయాలి అని చాలా ఇష్టంగా చేశా. అనుకున్నట్టే సినిమా పెద్ద హిట్​ అయింది. నాకు హ్యాపీగా అనిపించింది. 

ప్రత్యేకించి ఆ సినిమా ఎందుకు ఒప్పుకున్నావు? అని నన్ను అడిగితే.. నాకు వేరే ఛాయిస్ లేదు. నా కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్​ ఎవరు రాస్తారు? కాబట్టి వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు అనుకున్నా. అందుకే ఆ సాహసం చేశా. అంతేకాదు.. యశ్​​ రాజ్ ఫిల్మ్స్​ ద్వారా డెబ్యూ ఇవ్వడం అనేది చాలామందికి డ్రీమ్​. అలాంటిది ఆ ఛాన్స్​ నాకు రావడం గ్రేట్​ కదా!

తగ్గడానికి ఆరునెలలు

పెరిగిన వెయిట్ తగ్గడానికి ఆరు నెలలు పట్టింది. దాదాపు 25 కిలోలు తగ్గా. ఆ టైంలో ఫ్రెండ్స్​ని ఎక్కువ కలవలేదు. మంచి ఫుడ్​ తినడం, జిమ్​ చేయడం... అదే నా రొటీన్. దమ్​ లగాకే హైషా సినిమా రిలీజ్​ టైంకి చాలా తగ్గా. ఎందుకంటే.. లావుగా ఉంటే కామెడీ చేస్తారు. 

ఆ క్యారెక్టర్స్​నే నన్ను చేయమంటారు అనుకున్నా. రెండో సినిమా వరకు..

మొదటి సినిమా రెమ్యునరేషన్ తీసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అమౌంట్​ తక్కువ అయినప్పటికీ మొదటి సినిమా కదా. ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. అయితే తరువాత నా చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోయాయి. సినిమా కోసం పెరిగిన బరువు తగ్గడంతో సరిపోలేదు. ఇంకా బరువు తగ్గాలి. ఎందుకంటే నాకు మరో ఉద్యోగం​ లేదు. అలాగే మరో అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పటివరకు లైఫ్​ లీడ్ చేసేందుకు బాగానే కష్టపడాల్సి వచ్చింది. రెండో సినిమా వచ్చేవరకు స్ట్రగుల్స్ ఉన్నాయి. 

ఆర్టిస్ట్​ లైఫ్

మొదటి సినిమా హిట్ అయ్యింది. అవార్డ్​లకు కూడా నామినేట్ అయింది. అయితే, అవార్డ్​లు ఇచ్చే సీజన్​ మొదలైదంటే.. కాస్ట్యూమ్స్, జువెలరీ, హెయిర్ స్టయిల్స్ అన్నీ డిఫరెంట్​గా ఉండాలి. అందుకోసం ఎప్పుడూ మేకప్​ టీంతో మాట్లాడుతుండాలి. డిస్కస్ చేయాలి. అవార్డ్​ వస్తుందో లేదో తర్వాత విషయం. స్టేజ్​ ఎక్కకపోయినా అవార్డుల ఫంక్షన్​కి వెళ్లే యాక్టర్​ కాస్ట్యూమ్​ బాగుండడం అనేది మినిమమ్​. అంతెందుకు నాలుగేండ్ల నుంచి ఒకటే కారు వాడుతున్నా. దాన్నెవరూ చూడరు. గుర్తుపట్టరు కూడా. కానీ, కాస్ట్యూమ్ అయితే వెంటనే గుర్తుపడతారు. అందుకే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఫ్రెండ్స్ సపోర్ట్ 

నా ఫ్రెండ్​ ఒకామె రెండేండ్ల నుంచి నాకు హెయిర్​ స్టయిలిస్ట్​గా ఉంది. ఇప్పటివరకు ఒక పైసా తీసుకోలేదు. నిజానికి స్టయిలింగ్​​ చేయడం అంత ఈజీ కాదు. చాలా ఖర్చుతో కూడిన పని. అయినా కూడా తను నాకు ఫ్రీగా చేస్తోంది. నేను యాక్టర్ కాకముందు నుంచే మేం ఇద్దరం ఫ్రెండ్స్. అలా నేను అడగకపోయినా సపోర్ట్​ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు. నిఖిల్​ శెట్టి కూడా నాకు మంచి ఫ్రెండ్. చెప్పాలంటే తను నాకు అన్నయ్యలా. నా దగ్గర కారు ​లేనప్పుడు తనకి ఫోన్​ చేసి ‘నాకు ఒక ఈవెంట్ ఉంది. కారు పంపించవా’ అని అడిగేదాన్ని. ఏమాత్రం ఇబ్బంది పడకుండా కారు పంపేవాడు. ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలిని.

భక్షక్ గురించి..

నేను ఎలాంటి స్క్రిప్ట్స్​ చేస్తున్నా అనేది పబ్లిక్ చూస్తున్నారు. నా ఛాయిస్​లను వాళ్లు అభిమానిస్తున్నారు. ‘భక్షక్​’ లాంటి సినిమాల్లో చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుంది. ఈ సినిమా నాకు చాలా పర్సనల్. ఎందుకంటే.. నేను ‘సోంచిరియా’ సినిమా చేస్తున్నప్పుడు, నా ఫ్యామిలీతో కలిసి ఒక ఆశ్రమానికి వెళ్లా. ఆ ఆశ్రమం బందిపోట్ల పిల్లల్ని దగ్గరకు తీసుకుంది. ఇలాంటి సబ్జెక్ట్​ను సినిమాలో చూపించడం వల్ల ఆ సమస్య ఆడియెన్స్​కి చేరుతుంది. అది ఇండియాలో ఉన్న ఒక చిన్న ఊరి సమస్య కాదు. ఎన్నో చోట్ల ఉంది. మరి అలాంటప్పుడు ఇలాంటి సినిమాకి గొంతుకలా ఉండకపోతే యాక్టర్​గా ఎందుకు? యాక్టర్​కి రకరకాల క్యారెక్టర్స్ రావచ్చు. కానీ, ఇలాంటి పాత్రలు రావడం చాలా అరుదు. అందుకే వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా. 

నాన్న అలా అమ్మ ఇలా..

మా నాన్న సతీష్ పెడ్నేకర్, మహారాష్ట్రలో హోమ్​ అండ్ లేబర్ మినిస్టర్​. ఆయన నోటి క్యాన్సర్​ వల్ల చనిపోయారు. నాన్న చనిపోయాక అప్పటివరకు ఉన్న మా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆర్థికంగా, మానసికం​గా ఎవరూ అండగా నిలవలేదు. ఆ టైంలో మా కుటుంబం కుంగిపోయింది. ఆ కష్టకాలంలో మా అమ్మ సుమిత్ర.. నన్ను, నా సిస్టర్​ని ధైర్యంగా పెంచింది. నాన్నలా ఎవరూ నోటి క్యాన్సర్​తో చనిపోకూడదని ‘యాంటీ టొబాకో’ యాక్టివిస్ట్​గా మారింది.  నేను, అమ్మ, నా సిస్టర్​ ముగ్గురం చాలా క్లోజ్​. మా మధ్య ఏ విషయం దాగదు. అన్నీ షేర్ చేసుకుంటాం. 
 ప్రజ్ఞ