ప్రతి జాగాకు భూధార్

  •     ఇంటి స్థలాలకూ మ్యుటేషన్ హక్కుల రికార్డు, ఓ ప్రత్యేక బుక్కు
  •     భూవివాదాలకు చెక్ పెట్టేలా రిజిస్ట్రేషన్, మ్యూటేషన్​కు సర్వే మ్యాప్ తప్పనిసరి
  •     కలెక్టర్.. అడిషనల్ కలెక్టర్, ఆ తర్వాత సీసీఎల్​ఏలోనూ అప్పీల్​కు చాన్స్​
  •     సాదా బైనామాలకూ అవకాశం.. పరిష్కార బాధ్యతలు ఆర్డీవోలకు 
  •     మ్యూటేషన్ టైంలో ఫిర్యాదులు ఉంటే ఎంక్వైరీ
  •     కొత్త ఆర్వోఆర్ బిల్లు-2024 లో పలు కొత్త అంశాలు
  •     ప్రజల నుంచి సలహాలు, సూచనల స్వీకరణకు సీసీఎల్ఏ వెబ్​సైట్​లో పెట్టిన రెవెన్యూ శాఖ

హైదరాబాద్, వెలుగు : వ్యవసాయ భూములకు పట్టా పాసు పుస్తకం లెక్క ఇంటి స్థలాలకూ ప్రత్యేక బుక్​ను ఇవ్వనున్నారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్ అయిన వ్యవసాయేతర భూములకు మ్యూటేషన్ ప్రాసెస్​ను తీసుకువచ్చారు. ఇలా గ్రామీణ ప్రాంత ఇంటి స్థలాలకు (ఆబాదీ)లకు ప్రత్యేక హక్కుల రికార్డును నిర్వహించనున్నారు. 

అలాగే ప్రతి వ్యక్తికి ఆధార్ నంబర్ ఉన్నట్లే.. ప్రతి భూకమతానికి భూదార్​ను ఇవ్వాలని ప్రతిపాదించారు. ఒకరికి వేర్వేరు ప్రాంతాలలో అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్​ స్థలాలు ఏమున్నా కూడా భూధార్ నంబర్ ఎంట్రీతో తెలుస్తుంది. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి కొత్త ఆర్వోఆర్ బిల్లు 2024-ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. 

సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, సీఎంఆర్వో లచ్చిరెడ్డి, భూచట్టాల నిపుణులు భూమి సునీల్ ప్రత్యేకంగా ఈ ముసాయిదా బిల్లుపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు సీసీఎల్ఏ వెబ్ సైట్ లో (www.ccla.telangana.gov.in) అందుబాటులో పెట్టారు. ప్రతి భూకమతానికి తాత్కాలిక, శాశ్వత భూధార్‌‌‌‌ (ప్రత్యేక గుర్తింపు సంఖ్య) ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రస్తుతమున్న రికార్డులు పరిశీలించి తాత్కాలిక సంఖ్య, సర్వే తర్వాత శాశ్వత భూధార్‌‌‌‌ జారీ చేస్తారు. ఈ భూధార్‌‌‌‌కు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం తర్వాత తయారు చేస్తుంది. 

డ్రాప్ట్ బిల్లు ప్రకారం కొత్తగా గ్రామీణ ప్రాంత ఇంటి స్థలాలకు (ఆబాదీ) కూడా ప్రత్యేక హక్కుల రికార్డు తయారు చేయాలని బిల్లులో పొందుపరిచారు. భూధార్‌‌‌‌తో పాటు ఈ ఆబాదీల ఆర్‌‌‌‌వోఆర్‌‌‌‌కు అవసరమైన నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోవచ్చు. ఆర్‌‌‌‌వోఆర్‌‌‌‌ రికార్డుకు, గ్రామ పహాణీకి గత చట్టంలో సంబంధం లేకుండా ఉండేది. ఈ కొత్త చట్టంలో మాత్రం హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో ఆ హక్కుల రికార్డును నమోదు చేసేలా నిబంధన విధించారు. 

ప్రస్తుతం ఉన్న ఆర్వోఆర్ చట్టంలో భూ సమస్యలకు సంబంధించి అప్పీళ్లకు అవకాశం లేదు. దీంతో కలెక్టర్, సీసీఎల్ఏ​కు రెండు స్థాయిల్లో అప్పీళ్లకు అవకాశం కల్పించారు. ఆగస్ట్ 2వ తేదీ నుంచి ఆగస్ట్ 23వ తేదీ వరకు ఈ ముసాయిదా బిల్లుపై ఎవరైనా తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు వీలు కల్పించారు. ప్రజలు తమ సలహాలు సూచనలను ఇ–మెయిల్ (ror2024-rev@telangana.gov.in) చేయాలి లేదా పోస్ట్ ద్వారా సీసీఎల్ఏ ఆఫీసుకు పంపించాలని సూచించారు.

ముసాయిదా బిల్లులోని ముఖ్యాంశాలివి:

  గతంలో ప్రభుత్వం తీసుకున్న సాదాబైనామా దరఖాస్తులను కొత్త చట్టం కింద చేసుకున్న దరఖాస్తులుగానే పరిగణించాలి. తద్వారా సాదాబైనామాల కోసం ఇప్పటికే పెండింగ్‌‌‌‌లో ఉన్న 9.4 లక్షల దరఖాస్తులు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ పరిష్కార సమయంలో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌‌‌‌ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. అయితే, కొత్తగా మళ్లీ సాదాబైనామాల దరఖాస్తులను తీసుకుని పరిష్కరించే అధికారం ఈ బిల్లులో పొందుపరిచారు. 

ఈ దరఖాస్తుల పరిష్కార సమయంలో మాత్రం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌‌‌‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సాదాబైనామాలను పరిష్కరించే అధికారం గతంలో కలెక్టర్లకు ఉండగా, ఈ చట్టం ద్వారా ఆర్డీవోలకు సాదాబైనామాల పరిష్కార అధికారాలిచ్చారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్‌‌‌‌ చేసేటప్పుడు సర్వే మ్యాప్‌‌‌‌ తప్పనిసరి చేశారు. రిజిస్ట్రేషన్‌‌‌‌కు వెళ్లే వారు ఈ మ్యాప్‌‌‌‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. భవిష్యత్తు వివాదాలకు చెక్‌‌‌‌ పెట్టే విధంగా గతంలో లేని ఈ కొత్త నిబంధన పెట్టారు. 

అయితే, ప్రభుత్వం నిర్దేశించిన తేదీ తర్వాత (ఇందుకు అవసరమైన వ్యవస్థను తయారు చేసుకున్న తర్వాత) మాత్రమే ఈ మ్యాప్‌‌‌‌ తప్పనిసరి అవుతుందని బిల్లులో పొందుపరిచారు. తహసీల్దార్లు, ఆర్డీవోలు చేసే రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లకు సంబంధించి వివాదాలు వస్తే అప్పీల్, రివిజన్‌‌‌‌కు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. తహసీల్దార్లు, ఆర్డీవోలు తీసుకునే నిర్ణయాలపై అప్పీల్‌‌‌‌ను కలెక్టర్లు లేదా అడిషనల్‌‌‌‌ కలెక్టర్లకు చేసుకోవచ్చు. 

ఆ తర్వాత సెకండ్‌‌‌‌ అప్పీల్‌‌‌‌కు కూడా వెళ్లే వెసులుబాటు కల్పించారు. అయితే, సెకండ్‌‌‌‌ అప్పీల్‌‌‌‌ మాత్రం సీసీఎల్‌‌‌‌ఏకు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్పీల్‌‌‌‌ నిబంధన పాత చట్టంలో లేదు. ఇక, రివిజన్‌‌‌‌ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం లేదా సీసీఎల్‌‌‌‌ఏ మాత్రమే చేయాలని బిల్లులో పొందుపరిచారు. గతంలో జేసీకి ఉన్న రివిజన్‌‌‌‌ అధికారాలను ఇప్పుడు సీసీఎల్‌‌‌‌ఏకి దాఖలు పర్చారు. 

రికార్డులో ఏదైనా తప్పు జరిగిందని భావిస్తే సుమోటోగా తీసుకుని కూడా పరిష్కరించవచ్చు. అయితే, అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ స్థాయి నుంచి ప్రభుత్వం వరకు అప్పీల్‌‌‌‌ లేదా రివిజన్లలో ఏ నిర్ణయం తీసుకున్నా లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వడాన్ని తప్పనిసరి చేశారు. 

2020 చట్టంలో ఈ అంశం లేదని, కొత్త చట్టం అమల్లోకి వస్తే భూమి హక్కుల రికార్డుల వివాదాలన్నీ అప్పీలు, రివిజన్లతోనే పరిష్కారమవుతాయని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అయితే, యాజమాన్య హక్కుల వివాదాలు, భాగపంపకాల విషయంలో వివాదాలున్నప్పుడు మాత్రమే కోర్టులకు వెళ్లే వెసులుబాటు ఇచ్చారు. భూమి హక్కుల బదలాయింపు కోసం 18 రకాల పద్ధతులను గుర్తించి, ఈ 18 పద్ధతుల్లో ఏ రకంగా హక్కుల బదలాయింపు జరిగినా రికార్డ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ రైట్స్‌‌‌‌ (ఆర్‌‌‌‌వోఆర్‌‌‌‌)లో నమోదు చేయాలి. 

రిజిస్టర్‌‌‌‌ దస్తావేజులు, వారసత్వం, భాగపంపకాల ద్వారా హక్కుల బదలాయింపునకు పాత చట్టంలోని నిబంధనను కొనసాగించారు. ఈ పద్ధతుల్లో తహసీల్దారే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్‌‌‌‌ చేస్తారు. అయితే, మ్యూటేషన్‌‌‌‌ చేసే సమయంలో ఎంక్వైరీ చేసే వెసులుబాటు చట్టంలో కల్పించారు. ఈ విచారణలో తప్పు జరిగిందని తేలితే మ్యూటేషన్‌‌‌‌ కారణాలు వివరిస్తూ మ్యూటేషన్‌‌‌‌ను ఆపేయవచ్చు. 

ఇది ప్రస్తుతం ఉన్న చట్టంలో లేదు. రిజిస్టర్డ్‌‌‌‌ దస్తావేజులు, భాగపంపకాలు, వారసత్వ హక్కుల మ్యూటేషన్‌‌‌‌ను విచారించే అధికారం తహసీల్దార్లకు, మిగిలిన సందర్భాల్లో రిజిస్ట్రేషన్‌‌‌‌ చేయాల్సి వచ్చినప్పుడు మ్యూటేషన్‌‌‌‌ చేసే అధికారం ఆర్డీవోకు ఇచ్చారు.