దొంగ బాబాల ఉచ్చులో సామాన్యులు.!

తిండికి లేకున్నా, కష్టపడి జీవించడానికి ఉపాధి లేకున్నా, వైద్య సదుపాయం లేకున్నా సామాన్య ప్రజలకు బాబా ఆశీర్వాదం మాత్రం కావాలి.  బాబాల పాదధూళి కావాలి. దానిని నుదుట పెట్టుకుంటే మొత్తం జీవితమే మారిపోతుంది అనే మూఢనమ్మకం, అంధ విశ్వాసం వారిది. రాజకీయ నేతలు కూడా బాబాల వెంట ఉండి అండదండలు అందిస్తున్నారు. దొంగ బాబాల పలుకుబడిని, జనంలో అంధ విశ్వాసాన్ని మరింత పెంచుతున్నారు.  మన మూఢ రాజకీయ నేతలు కూడా వారికి తోడైతే ఇక జనం ఆ వైపు ఎలా వెళ్లకుండా ఉంటారు? అదే మన దేశానికి ఇప్పుడు ఒక శాపంగా  మారిపోయింది.

ఉత్తర్ ప్రదేశ్ లోని  హత్రాస్ లో భోలే బాబా అలియాస్ సూరజ్ పాల్ జాతవ్​ అలియాస్​నారాయణ్​ సాకర్​ హరి నిర్వహించిన సత్సంగ్​ కార్యక్రమానికి   80 వేల మందికి అనుమతి ఉంటే  రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చారు.  బాబా దర్శనం కోసం ఎగబడిన భక్తుల మధ్య  పెద్దఎత్తున తొక్కిసలాట జరిగింది. 121 మంది మృత్యువాత పడ్డారు. బాబా ధూళిని తాకడానికి భక్తుల మధ్య జరిగిన తోపులాట, తొక్కిసలాటలో మహిళలు, పిల్లలు కింద పడిపోయారు.  నిర్వాహకులు, వాలంటీర్లు భక్తులను ఆపే ప్రయత్నం పరిస్థితిని మరింత తీవ్రంగా మార్చింది. రేపిస్ట్, భూ కబ్జాదారు ఆరోపణలపై గతంలో ఈ భోలే బాబా మీద లైంగిక దాడి, భూ కబ్జాల కేసులు ఉన్నాయి.  కానిస్టేబుల్ గా 1997 దాకా పని చేశాడు.  భోలే బాబా యూపీలోని బహదూర్ నగర్​లో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. 

బోలే బాబాపై పాట్నాలో కేసు

భోలే బాబా ఒక మోడ్రన్, టిప్ టాప్ బాబా.  తెల్ల బట్టలు,  బూట్లు ధరించి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. తన సొంత ఊరిలో దాదాపు 20 ఎకరాల్లో పెద్ద ఆశ్రమం నిర్మించుకున్న బాబా తనతో  దేవుడు మాట్లాడుతాడని చెప్పుకుంటాడట, మొయిన్​పురిలో బాబా ఆశ్రమం ఉంది.  రాజస్థాన్, యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇతని పాద ధూళిని నెత్తిన జల్లు కోవడం, విభూతిలా రాసుకోవడం భక్తులు చేస్తూ ఉంటారు.---- భోలే బాబా నిజస్వరూపం సంగతి కొందరు అధికారులకు తెలిసినా, పెద్ద పెద్ద నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు ఈ భోలే బాబా భక్తులు కావడం వల్ల, ఆయన భక్తులు లక్షల్లో ఉండడం వల్ల చర్యలు తీసుకునేందుకు జంకుతారు. భోలే బాబా భక్తులు తమకు ఓట్లుగా ఉపయోగపడతారు కాబట్టి బాబాను నాయకులు కూడా ఏమీ విమర్శించరు పైగా అతడికే మద్దతు ఇచ్చేవారు. 

మరణించినవారిలో..ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే ఎక్కువ

హత్రాస్​ సంఘటనలో  అమాయక జనం 121 మంది  ఊపిరి కోల్పోగా  వందల సంఖ్యలో గాయపడ్డారు. నిర్వాహకుల మీద పోలీసులు కేసు పెట్టారు, ఈ సంఘటన జరగగానే పరారైన భోలే బాబాపై పాట్నా చీఫ్​ జ్యుడీషియల్​ మేజిస్ట్రేట్​ కోర్టులో  కేసు నమోదైంది.  కాగా, రాజకీయ నాయకులకు  ఎన్నికలు, ఓట్లు ముఖ్యం. మరణించినవారిలో ఆదివాసీలు, ఓబీసీ, ఎస్టీ, ఎస్సీలే ఉన్నారు. ఈ బాబా భక్తులు కూడా ఎక్కువ శాతం ఈ వర్గాల ప్రజలే  ఉన్నారు. మరణించినవారిలో  వందమందికి పైగా మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారు. దశాబ్దాల క్రితం కుంభమేళాలో ఇలాగే 800 మంది దాకా మరణించారు. అలాంటి సంఘటన ఇప్పుడు హత్రాస్ లో జరిగింది.

హత్రాస్​కు వెళ్లిన రాహుల్​ గాంధీ ఆదర్శం

సుప్రీంకోర్టుతో మొట్టికాయలు తిన్న రాందేవ్ బాబా వేల కోట్లకు అధిపతి. ఆయన స్థాపించిన పతంజలి.. ఆలోపతి వైద్య నిపుణులను సైతం కరోనా కాలంలో అవహేళన చేసే స్థాయికి మారింది. రాజకీయాల్లో రాం దేవ్ జోక్యం చూశాం.  సుప్రీంకోర్టు ఇటీవల ఆయనను హెచ్చరించిన నాటి నుంచి కాస్త తగ్గాడు.   దేశాన్ని దొంగ బాబాల నుంచి కాపాడాలి. ఇప్పటికైనా ఈ బాబాల ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తం కావాలి. వీరిపైన నిఘా పెట్టేలా చట్టం తీసుకురావాలి.  వీరిని పెంచి పోషిస్తున్న రాజకీయ నేతలను  ఓడించాలి.  పేద ప్రజలు ముఖ్యంగా విద్య, వైద్యం అందని ప్రజలకు ఆ మౌలిక సౌకర్యం కల్పించి మూఢ నమ్మకాల నుంచి వెలికి తీసుకురావాలి.  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలా హత్రాస్​కు వెళ్లి బోలే బాబా వల్ల జరిగిన దుర్గతిని చూడాలి.  బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించాలి.  మూఢ నమ్మకాల ఉచ్చు నుంచి నిరుపేదలను రక్షించాలి. ఆ దిశగా బుద్ధిజీవులు కృషి చేయాలి.

భక్తులకు దొంగ బాబాల పీడ

దేశంలోని సామాన్యులను ఈ దొంగ బాబాల పీడ వేధిస్తోంది.  ఈ బాబాల ఉచ్చులో చిక్కుకున్నవారు మూఢ, అంధ విశ్వాసాల నుంచి ఎప్పుడు బయటపడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. అటు గతంలో  బాబా రాం రహీం, ఆశారాం, రాంపాల్ ఇలా ఎంతోమంది నేరారోపణలు ఎదుర్కొన్నవారే కావడం గమనార్హం.  రాం రహీం అయితే రేప్ అండ్ మర్డర్ కేసులో జైలులో శిక్ష అనుభవిస్తూ పలుమార్లు జైలు నుంచి పేరోల్ మీద బయటకు వచ్చి రాజకీయ పార్టీలకు ప్రచారం చేశాడు. ఇతనికి చాలా మంది నేతలతో  సంబంధాలు ఉన్నాయి. హై లెవల్ సెక్యూరిటీ కల్పిస్తారు. నిజానికి భారత దేశంలో దొంగ బాబాలు మాటలతో  తిమ్మిని బమ్మి చేస్తుంటారు. మూఢ జనం నమ్మకాన్ని పొంది, ఆధ్యాత్మిక ముసుగులో ఆర్థికంగా ఎదిగిపోతారు.

- ఎండి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్