అన్నా చెల్లెళ్లు... అక్కా .. తమ్ముళ్ల అనుబంధాన్ని గుర్తు చేస్తూ హిందువులు ప్రతి ఏటా రెండు పండుగలను జరుపుకుంటారు. అందులో ఒకటి రాఖీ పండుగ ( శ్రావణ పౌర్ణమి)అయితే మరొకటి భగిని హస్తి భోజనం ( కార్తీకమాసం శుద్ద విదియ)పండుగను జరుపుకుంటారు. అయితే ఇప్పుడు రక్షా బంధనం.. భాయ్ దూజ్ పండుగల తేడాను ఒకసారి తెలుసుకుందాం. . . .
దేశవ్యాప్తంగా హిందులు సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. సోదర.. సోదరీమణుల బంధాల గురించి చాటిచెప్పే పండుగలు సంవత్సరానికి రెండు వస్తాయి. భారతీములు ఎక్కువుగా రక్షా బంధన్ మరియు భాయ్ దూజ్ (భగినీ హస్త భోజనం) జరుపుకుంటారు. అయితే ఈ రెండు పండుగల భావన ఒక్కటే అయినప్పటికి.. జరుపుకొనే విధానంలో కొన్ని ముఖ్యమైన తేడాలున్నాయి.
భాయ్ దూజ్ (భగినీ హస్త భోజనం)
సోదరీ, సోదరుల ఆప్యాయత, అనుబంధాలకు అద్దంపట్టే ఒక సంప్రదాయం భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి. సోదరి పెట్టే భోజనం కనుక “భగినీ హస్త భోజనం” అంటారు. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి పండగ రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు. ఈరోజు అన్నదమ్ములు తమ తమ అక్కా చెల్లెళ్ళ ఇంటికి వెళ్లి.. వారి చేతితో నుదుట తిలకం దిద్దించుకుని.. వారి వంట తిని.. బహుమతిని ఇస్తారు. ఈ అన్నాచెల్లెళ్ల పండుగను భయ్యా ధూజీ అనే పేరుతో ఉత్తరదేశంలో బాగా జరుపుకుంటారు. దక్షిణ భారతంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుపుకుంటారు. తమ సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనాన్ని స్వయంగా తిని ఆమెను ఆశీర్వదిస్తారు.
భగినీ హస్త భోజనం పురాణ కథ
సూర్య భగవానికి యమధర్మరాజు , యమున. కుమారుడు.. కుమార్తెలు .. యమునకు అన్నగారు అంటే విపరీతమైన అభిమానం. సమవర్తి యమధర్మరాజు సోదరి యమున వివాహమై అత్తవారింటికి వెళ్లింది. అలా వెళ్లిన యమున తన సోదరుడు యమధర్మరాజుని తన ఇంటికి ఎన్నో సార్లు రమ్మని కోరింది. కాని ఆయనకు తీరిక ఉండేది కాదు. యమలోకంలో పాపులను శిక్షించే పనిలో రాత్రి వరకు తీరిక ఉండదు. పాపం చెల్లెలు కోరిక. తీర్చలేదని భాధపడేవాడు. కాలము గడచిపోతూ ఉంది. చివరికి వీలు చేసుకుని సోదరి ఇంటికి అనుకోకుండా ఒకనాడు ఆయనకు చెల్లెలు ఇంటికి వెళదామని అనకున్నాడు. ఆ రోజు కార్తీక శుద్ద విదియ.
రాక రాక సోదరుడు వచ్చాడని యమున ఎంతో సంతోషపడింది. చెల్లెలు యమున సంతోషంగా అన్నయ్య కు ఇష్టమైన పదార్థాలు వండి దగ్గర కూర్చుని కొసరి కొసరి వడ్డించింది. ఎంతోకాలానికి కార్తీక శుద్ధ విదియనాడు కలవటంతో సోదరీ సోదరులు ఎంతో సంతోషించారు. ఆ సంతోషంతో యమధర్మరాజు సోదరిపై ప్రేమతో నాకు ఇషమైన పదార్థములు తో భోజనము పెట్టావు. నీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకో అని యమునకు చెప్పాడు. దీంతో యమనదేవి అన్నయ్యా లోకకల్యాణము కోసం నాకు ఒక వరము ఇవ్వు అని అడిగింది..
కార్తీక శుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్లి అన్నా తమ్ముడు భోజనం చేస్తాడో నీవు ఎట్టి పరిస్థితి లో వారి జోలికి వెళ్ళవద్దని .. అటువంటి సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఇది నా కోరిక అని యమధర్మరాజు ని యమున అడిగింది. . ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించాడు. లోకకల్యాణం కోసం అడిగావు కనుక ” తధాస్తు” అని చెల్లెలు ను దీవించి వెళ్ళాడు.దీంతో ఆ రోజు( కార్తీక శుధ్ధ విదియ) అక్క , చెల్లెలు చేతివంట ఎవరైతే భోజనం చేస్తారో వారికి అపముృత్యు దోషం.. అంటే అకాల మరణం లేకుండా ఉంటుంది. సోదరుడికి భోజనం పెట్టిన ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని యముడు వరాలిచ్చాడట. అలా ఈ వరం సంప్రదాయంగా మారింది. కనుక ఈరోజు సోదరులు తమ సోదరి ఇంటికి వెళ్లి.. ఆమె చేతివంట తిని.. ఆప్యాయంగా బహుమతిని ఇచ్చి వస్తారు.
రక్షా బంధనం( రాఖీ పౌర్ణమి)
శ్రావణమాసం పౌర్ణమి రోజున జరుపుకొనే ఈ పండగను రాఖీ పండుగ, రక్షాబంధనం అంటారు. ఈ పండుగ గురించి హిందూ పురాణ గ్రంధాలలో చెప్పబడిందని పండితులు చెబుతుంటారు. ఈ పండుగ గురిచి చాలా కథలు ఉన్నాయి. అయితే ఓ పురాణ గ్రంథం ప్రకారం శ్రీకృష్ణుడు.. ద్రౌపది అన్నా చెల్లెళ్లు. ఒకానొక సమయంలో శ్రీకృష్ణునికి వేలు తెగి రక్తం కారుతున్న సమయంలో అతని సోదరి ద్రౌపది తన చీర కొంగును చింపి అతని వేలుకు కట్టు కట్టి రక్తం కారకుండా చేసిందని .. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను రక్షిస్తానని చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ పండుగ అన్నా చెల్లెళ్ల... అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని ప్రతీకగా నిలుస్తుందని అప్పుడు మునులు చెప్పారని చెబుతున్నారు. అందుకే ప్రతి శ్రావణ పౌర్ణమి రోజున సోదర సోదరీమణులు రాఖీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ALSO READ :- రెండున్నర కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్