గీతా సారం హైడ్రా తత్త్వం

ధర్మం కోసం స్వ, పర భేదాలు చూపొద్దన్నది గీతా సారం, ధర్మాన్ని తుంగలో తొక్కి మనిషి చేస్తున్న ప్రకృతి విధ్వంసంతో మొన్నటి కేదార్​నాథ్ కొండచరియలు విరిగిపడటం, చెన్నై నీట మునగడం, నిన్నటి వయానాడ్ ఉత్పాతం, ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ల నిర్వాకం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకృతి ప్రకోపంతో నామరూపాలు లేకుండా పోయిన ఉదంతాలు కోకొల్లలుగా మనకు కనిపిస్తూనే ఉంటాయి. వీటన్నింటి నుంచి పాఠాలు నేర్చుకోలేకపోతే జరిగే వినాశనం ఇంట్లోని పేపర్లో వార్త నుంచి మన ఇంటికే విధ్వంసం జరిగి మరో వార్తగా మనమే మారే విషాదాంతం ఎదురవుతుంది.

దీన్ని అరికట్టడానికి సమాజం ఇచ్చిన గుర్తింపు గల వ్యక్తులు, బాధ్యత గల ప్రతిపక్షాలు ముందుకు వచ్చి మొత్తంగా పౌర సమాజానికి మార్గదర్శనం చేయాలి. కానీ, నేడు తెలంగాణ రాష్ట్రంలో కొందరు బడా వ్యక్తులు, కొన్ని ప్రతిపక్షాలు పౌరసమాజం కోసం కాకుండా ప్రకృతి విధ్వంసకారులకు మద్దతు పలుకుతున్న దృశ్యం అక్కడక్కడా కనిపిస్తోంది.


‘హైడ్రా’ పేరుతో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రకృతిని కాపాడే ప్రయత్నంతో భూబకాసురులకు, కబ్జాదారులకు కంటిమీద కునుకు కరువైతే.... ఈ అడ్డగోలు ఉల్లంఘనలకు అనుమతులు ఇచ్చి, అందినకాడికి దోచుకున్నోళ్లు అంతకంటే ఎక్కువగా ఆవేదన చెందుతున్నారు.సుందర సరస్సుల నగరంగా చరిత్రకారులు అభివర్ణించిన మన భాగ్యనగరం ఒకనాడు 600కు పైగా గొలుసుకట్టు చెరువులతో 10 ఫీట్ల లోతుల్లోనే అమృతంలాంటి జలాల్ని అందించి ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటే, నేడు 400కు పైగా చెరువులు నామరూపాల్లేకుండా పోయి, ఉన్న 200 చెరువులు కూడా కబ్జాలతో కునారిళ్లుతూ భూగర్భ జలాలు అడుగంటి వెయ్యి అడుగుల లోతులోనూ నీటి జాడ లేక ప్రజలు అల్లాడిపోతున్నారు.

నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అంచనాల ప్రకారం 1979 నుంచి 2022 వరకూ దాదాపు 60 శాతం చెరవులు ఆక్రమణకు గురయ్యాయి. భూమికి రేటు పెరిగిన కొద్దీ ఈ ఆక్రమణల వేగం పెరుగుతుంది.  ఈ వినాశనానికి అడ్డుకట్ట వేయలేమా? అనే సామాన్య ప్రజల ఆవేదనలు ప్రజా ప్రభుత్వం చెవిన చేరి ఆవిర్భవించిందే ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఎజెన్సీ’ సంక్షిప్తంగా ‘హైడ్రా’... ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల్లోంచి పురుడుపోసుకుంది,  రేపటి అందమైన హైదరాబాద్​ను కాంక్షిస్తూ రూపుదిద్దుకుంది. 

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే..

ఇన్నాళ్లు తమకు అక్రమంగా ఇతోధిక ఆదాయం తెచ్చిపెట్టిన అక్రమ నిర్మాణాలు తమ కళ్లముందే నేలమట్టం అవుతుంటే చట్టాల్లోని లొసుగులను, సాక్ష్యాలుగా పనికొచ్చేలా దొంగ కాగితాలను అడ్డంగా పెట్టుకొని కోర్టు మెట్లేక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ప్రజా ఉద్యమం ముందు ఏ శక్తైనా తలొగ్గాల్సిందే. లంచ్ మోషన్ పిటిషన్ల విచారణార్హతలు సైతం న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోవాలి. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 405 చెప్పింది ఏంటో పరిగణించాలి.

సాక్షాత్తు సుప్రీంకోర్టే చెరువుల ఎఫ్.టి.ఎల్ పరిధిలో బఫర్ జోన్లలో నిర్మించిన వేటినైనా ఎలాంటి నోటీసు లేకుండా కూల్చవచ్చు అన్న మాటల్ని మరోసారి గుర్తుకు చేసుకోవాలి. పక్కా ఉపగ్రహ ఆధారాలతో హైడ్రా ఇస్తున్న నివేదికల్ని పరిశీలించాలి. స్వయంగా ముఖ్యమంత్రి, సీఎస్ తీసుకుంటున్న చర్యలు, నిన్నటికి నిన్న హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్​పై హైడ్రా పరిధిలోని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ చిత్తశుద్ధితో చర్చించి అమలు చేస్తున్న విధానాలను గమనంలోకి తీసుకోవాలి.   ప్రకృతి సంపద అందరిదీ ఇది కొందరి చేతుల్లోకి వెళితే వారి ప్రయోజనాల కోసం విశాల జన బాహుళ్యం, పచ్చని ప్రకృతి విధ్వంసానికి ఆస్కారం ఇవ్వకూడదనేది నేటి సగటు మనిషి మాట. 

అనుమతులిచ్చిన అధికారులపై కూడా చర్యలు

హైడ్రా విషయంలో తీవ్రంగా బురద జల్లాలని ఇక్కడి ప్రధాన ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరు సైతం సామాన్యులను విస్మయపరుస్తుంది, ఇన్నాళ్లు తనకు 111జీవో పరిధిలోని జన్వాడలో ఎలాంటి నిర్మాణం లేదన్న మాజీ మున్సిపల్ శాఖ మంత్రి,  ఎన్నికల అఫిడవిట్లో సైతం లీజుకు తీసుకున్న వివరాలు పొందుపర్చకుండా ఇప్పుడు అది నా దోస్తుదని, అక్రమమని తేలితే నేనే కూల్చేస్తానని మాట మారుస్తున్నారు.

హైడ్రా కమిషనర్ అంతిమంగా రిపోర్ట్ చేసే ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు మొన్నటి వరకూ మంత్రిగా పనిచేసిన కేటీఆర్​కు తను ఉంటున్న ఇల్లు అక్రమం అని తెలియదు అంటే ప్రజలు నమ్ముతారా? ఇప్పుడేమో ఏకంగా నా ఇంటిని కూల్చొద్దంటూ కోర్టు మెట్లెక్కారంటే వారిని హైడ్రా ఎంతలా భయపెట్టిందో అర్థం చేసుకోవాలి.

గత యాభైఏండ్ల విధ్వంసం ఒక ఎత్తైతే.. గత పదేండ్లలో జరిగిన చెరువుల విధ్వంసం మరొక ఎత్తు.  ఆక్రమణదారుల్ని అందుకు కారకులైన అధికారగణాన్ని నిర్ద్వందంగా ప్రాసిక్యూషన్ చేయమని రేవంత్ రెడ్డి చెప్తున్న సందేశంతో ప్రధాన ప్రతిపక్షం నాటకాలు సాగడం లేదు. 

హైడ్రా విప్లవాత్మకం

ఇదే సమయంలో తెలిసో...తెలియకో... దుర్మార్గులు చేసిన చెరువుల అక్రమ లేఔట్లలో కొనుక్కొని నివసిస్తున్న మధ్యతరగతిని, బతుకుతెరువుకు నగరమొచ్చి నాలాలపై చిన్న చిన్న గదుల్ని నిర్మించుకున్న పేద వర్గాలను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయబోమని హైడ్రా కమిషనర్​తో పాటు సాక్షాత్తు ముఖ్యమంత్రి సైతం హామీ ఇచ్చారు. ఇకముందు ఇదే వ్యూహాన్ని  కొనసాగిస్తామనే నమ్మకాన్ని ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది. అయితే, ఈ విప్లవాత్మక చర్యలతో ఇప్పటికిప్పుడు ఏడాది రెండేండ్లలోనే అంతా మారిపోతుందని అనుకోలేం.

కానీ ఇకనుంచి చెరువుల్లో అక్రమ నిర్మాణం చేసేవాడికి మాత్రం ఖచ్చితంగా భయం పట్టుకుంటుంది. ఇలాంటి చోట్ల అనుమతులు ఇచ్చే అధికార యంత్రాంగం సైతం ఆగిపోతుంది. ఇది తక్షణం హైడ్రా తీసుకొచ్చిన పెద్ద మార్పు.  భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ధర్మం పక్షానే ఉంటాననే సీఎం మాటకు మనం మద్దతు నివ్వాలి.  భీష్మ, ద్రోణాది ఆచార్యులు, దుర్యోధన, కర్ణాది బంధువులు తనవారైనా తప్పును సహించేది లేదన్న తత్త్వాన్ని అందించిన గీతా సారం ఒంటబట్టించుకుని తన, పర భేదం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకృతిని కాపాడే ఈ మహాయజ్ణం సమాజంలో ఓ ఉద్యమాన్ని తీసుకువస్తుంది.

హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన సీఎం

ఔటర్​కు అటూ ఇటుగా పబ్లిక్ అసెట్స్ అయిన చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, లేఔట్లలో మౌలిక వసతులకు వదిలిన స్థలాలు వంటివాటిని పర్యవేక్షిస్తూ .. 2012 బిల్డింగ్ రూల్స్ ఎఫ్టీఎల్ పరిధిలో, బఫర్ జోన్లలో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని క్రిస్టల్ క్లియర్​గా చెప్పాయి. ఈ స్థలాల్లో నిర్మిత మవుతున్న ప్రతీ అక్రమ కట్టడాన్ని చిన్నా, పెద్దా తేడా లేకుండా అరికట్టి, చెరువులకు పునర్వైభవం చేపట్టడం తన మొదటి ప్రాధామ్యంగా హైడ్రా తన పనిని ప్రారంభించింది. 

దీనికి అంకురార్పణ చేసినప్పుడే దురాక్రమణ దారులైన బడా బాబుల నుంచి, స్వ, పర పక్షాల నుంచి వచ్చే ఒత్తిళ్ళను సైతం అంచనా వేసి ఐజీ స్థాయి అధికారి కమిషనర్​గా, స్వయంగా సీఏం ఛైర్మన్​గా ఎలాంటి అవాంతరాలకు లొంగని స్వేచ్ఛను హైడ్రాకు అందించారు సీఎం రేవంత్ రెడ్డి. చివరికి రాష్ట్రంలోని చెరువులపై అధ్యయనం చేసి కమీషన్లు దండుకున్నారనే పేరు మూటగట్టుకున్న హరీష్ రావు ఆధ్వర్యంలోనే చెరువులపై నిజనిర్ధారణ కమిటీ వేద్దామని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడంతో హైడ్రాను దెప్పిపొడుస్తున్న ప్రతిపక్షం గొంతులో పచ్చివెలక్కాయ చిక్కినట్టయింది. 

- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి
అధ్యక్షుడు, తెలంగాణ జర్నలిస్టుల
అధ్యయన వేదిక