నేడు శ్రీరామ నవమి : ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు

శ్రీరాముడు వసంత ఋతువులో  చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో,  అభిజిత్ ముహూర్తంలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని పుట్టిన రోజును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం, రావణ సంహారం అనంతరం  శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.  శ్రీ సీతారాముల కల్యాణం కూడా అదే రోజున  జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా  సీతారామ కల్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.

 రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు.  కౌసల్య, సుమిత్ర, కైకేయి.  అయితే, ఆయనకు సంతానం లేకపోవడంతో  వశిష్ట మహాముని పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహాముని ఆధ్వర్యంలో  దశరథుడు యజ్ఞ యాగాన్ని నిర్వహించాడు.  ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు  భార్యలకు ఇచ్చాడు.  కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు కౌసల్య రాముడికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర  లక్ష్మణ, శతృఘ్నులకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారం. 

సూర్యవంశ ఆరాధకుడు

శ్రీరామనవమి  పండుగ సందర్భంగా భద్రాచలంలో రామదాసు కట్టిన రామాలయంలో ప్రతి సంవత్సరం రాములోరి ఉత్సవం వైభవంగా చేస్తారు.  హిందువులు సాధారణంగా తమ ఇండ్లలో  సీతారాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. భద్రాచలంలోసీతారామ కల్యాణం తొమ్మిది రోజులు పాటు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. జ్యోతిష్య శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు శాలివాహన శకం 5114,  జనవరి 10న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు. శ్రీరామ నవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది.  వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు.

 సూర్యుడు, రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైనవారు. వీరిలో  రఘు మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధిపొందాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి తన పినతల్లి కైకకు ఇచ్చిన మాటకోసం పద్నాలుగేండ్లు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముడిని రఘురాముడు, రఘుపతి, రాఘవేంద్రుడు పేర్లతో  పిలుస్తుంటారు.

భద్రాచలంలో వైభవంగా సీతారాముల కల్యాణం

ఒకసారి పార్వతీదేవి పరమశివుడిని.. విష్ణు సహస్రనామ స్తోత్రానికి సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి పరమేశ్వరుడు ‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే.. సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే’  శ్లోకంతో మంత్రోపాసన చేశాడు. ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.  మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని మన లోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట!. 

అలాగనే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది.  శ్రీరామనవమి రోజున వడపప్పు, పానకం  నైవేద్యం చేసి అందరికీ పంచుతారు.  బెల్లం, మిరియాలు,  నీరు  కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది. 
- ఓపెన్​ పేజీ డెస్క్