భద్రాద్రిలో మరిన్ని డిజిటల్​ సేవలు

  • భద్రాచలం ఆలయంలో ఇప్పటికే కొన్ని ఆన్ ​లైన్ సేవలు
  • నేటి నుంచి భక్తులకు మరో మూడు డిజిటల్​ సేవలు అందుబాటులోకి.. 
  • అన్ని శాఖలు కంప్యూటరీకరణ దిశగా అడుగులు 

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అన్ని శాఖలను కంప్యూటరీకరణ చేసి ఆన్​లైన్​ సేవలతో అనుసంధానం చేస్తున్నారు. వసతి గదులు, ఆర్జిత సేవలు ఇప్పటికే ఆన్​లైన్​లో భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఈ- టిక్కెట్లను కూడా అమల్లోకి తెచ్చారు. భక్తులకు మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తి పారదర్శకతతో దేవస్థానం డిజిటల్​ సేవలను ప్రవేశపెడుతోంది. 16 ఏసీ కాటేజీలు, ఏసీ, నాన్​ ఏసీ ఉన్న శ్రీరామానిలయం, సౌమిత్రి, శ్రీరామసదనంలోని గదులను ఆన్​లైన్​లో భక్తులు బుక్ చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. 

ఇక రామాలయంలో నిత్యం నిర్వహించే 24 రకాల పూజా సేవలను ఆన్​లైన్​లో ఉంచగా భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆదివారం నిర్వహించే మూలవరుల అభిషేకం టిక్కెట్లు కొంత మంది వీఐపీలు, వీవీఐపీలకే అవకాశం దక్కేది. కానీ ఆ టిక్కెట్లను కూడా ఆన్​లైన్​లో ఉంచడం వల్ల సామాన్యులకు సైతం అవి లభిస్తున్నాయి. తెల్లవారుజామున నిర్వహించే సుప్రభాత సేవ, రాత్రి నిర్వహించే పవళింపు సేవలకు సైతం నిత్యం అధిక సంఖ్యలో భక్తులు ఆన్​లైన్​లో టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారు. 

ఈ- టిక్కెట్లతో అవినీతికి చెక్..​

దేవస్థానంలో నిర్వహించే ఆర్జిత సేవలను పొందేందుకు గతంలో ముద్రించిన టిక్కెట్లను భక్తులు కొనుగోలు చేసేవారు. సిబ్బంది చేతివాటంతో ముద్రించిన టిక్కెట్లే రీ సైకిల్​ అయ్యేవి. భారీగా అవినీతి చోటు చేసుకునేది. ప్రస్తుతం ఈ- టిక్కెట్ల విధానం అమల్లోకి వచ్చాక అవినీతికి చెక్​ పడింది. భక్తులకు టిక్కెట్లు కంప్యూటర్​ ద్వారా ఇస్తున్నారు. ఏ రోజుకారోజు ఎన్ని టిక్కెట్లు విక్రయించారు? ఎంత ఆదాయం వచ్చింది? మొత్తం నివేదికలు వస్తున్నాయి. 

కొత్తగా మరో మూడు డిజిటల్ సేవలు..

ఆన్​లైన్​ విధానంతో చక్కని ఫలితాలు వస్తుండటంతో సీతారామచంద్రస్వామి దేవస్థానం మరో మూడు డిజిటల్​ సేవలను భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. వాటిని బుధవారం ప్రారంభిస్తున్నట్లు ఈవో రమాదేవి ప్రకటించారు. 

అన్నదానం కోసం ముద్రించిన టిక్కెట్లను నిత్యం రామాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే భక్తులకు పంపిణీ చేస్తున్నారు. దీనివల్ల భక్తులకు ఇబ్బంది కలుగుతోంది. టిక్కెట్లు దుర్వినియోగం అవుతున్నాయి. దేవస్థానానికి నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆలయంలోనే భక్తులను ఫొటో తీసి వారికి టోకెన్లు ఇచ్చే విధానం అమలు చేస్తున్నారు. సుమారు 3.30 గంటల వరకు ఈ టోకెన్లు ఇస్తారు. టిక్కెట్లు దుర్వినియోగం కాకుండా ఈ విధానం దోహదపడుతుంది. 

ప్రోటోకాల్​ పేరిట కూడా ఆలయంలో నిత్యం దగా జరుగుతోంది. దీనికి చెక్​ పెట్టేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ప్రోటోకాల్ దర్శనం కోరుకునే వారు ఆఫీసులో తమ వివరాలను అందజేస్తే వారికి టోకెన్​ ఇస్తారు. ఆ సమయంలోనే దర్శనం కల్పిస్తారు. 

భక్తులు నిత్యం స్వామికి,అమ్మవార్లకు వస్త్రాలను బహుకరిస్తారు. చాలా వరకు పక్కదారి పడుతున్నాయి. దీన్ని నిరోధించేందుకు ఇకపై భక్తులు ఇచ్చే వస్త్రాలకు బార్​కోడ్​ ద్వారా డిజిటలైజేషన్​ చేస్తారు. భక్తులు ఇచ్చిన ప్రతీ వస్తువు వివరాలు ఆన్​లైన్​లో పొందుపరుస్తారు. ఎడ్లపల్లికి చెందిన ఆత్రేయి ఇన్ఫోసిస్​ సిస్టమ్స్ ఈ డిజిటల్​ సేవలనుచేపట్టనుంది.

భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం

భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యంగా డిజిటల్​ సేవలను అందుబాటులోకి తెస్తున్నాం. అవినీతి, అక్రమాలకు చెక్​ పెట్టడం, పారదర్శకత, భక్తులకు సకల సదుపాయాలు కల్పించడం ప్రధాన ఉద్దేశ్యం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సామాన్య భక్తులు ఇబ్బంది పడకూడదు. అందుకే ఈ సేవలను అమలు చేస్తున్నాం. భక్తులు సహకరించాలి.- రమాదేవి, ఈవో, భద్రాచలం