భద్రాచలంలో .. వరాహరూపంలో భద్రాద్రి రామయ్య

భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా గురువారం రామచంద్రస్వామి వరాహరూపంలో దర్శనమిచ్చారు. గర్భగుడిలో మూలవరులకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై సేవాకాలం నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులను వరాహరూపంలో అలంకరించారు. ప్రాకార మండపంలో చతుర్వేద, రామాయణ ఇతిహాసాలు, పురాణం, భద్రాద్రి క్షేత్ర మహత్యం, నాళాయర దివ్యప్రబంధ పారాయణాలు చేశారు. 

అనంతరం వరాహ రూపంలో ఉన్న రామయ్యను కోలాటాలు, రామనామ స్మరణ, భజనల మధ్య ఊరేగింపుగా వైకుంఠద్వారం వద్ద ఏర్పాటు చేసిన వేదికపైకి తీసుకెళ్లి అధిష్టింంచారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత తాతగుడి సెంటర్‌‌లోని గోవిందరాజస్వామి ఆలయం వరకు తిరువీధి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్దఎత్తున మంగళహారతులు ఇచ్చారు. స్వామివారిని తిరిగి రాత్రి ఆలయానికి తీసుకొచ్చారు.